ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Short Stories
ఆ రాజు గారు చాలా తెలివైనవాడు, వివేకవంతుడు. ఆయన న్యాయ నిర్ణయానికి ప్రజలంతా ఆశ్చర్యపోతారు. మంత్రులతో ఒకరోజున రాజుగారు వ్యాహ్యాళికి బయలుదేరారు. దారిలో ఒకచోట ఒక ముసలి తోటమాలి మామిడి మొక్కలను శ్రద్ధగా పెంచడం చూశాడు. రాజు అతని దగ్గరికి వెళ్లి, “ఈ తోటకు యజమానివా? పనివాడివా?” అని అడిగాడు.
ఆ తోటమాలి “నేను పని వాడిని కాదు. మా తాతముత్తాతలు ఈ పండ్ల తోటలు పెంచారు. నేను వాటి పోషణభారాన్ని మోస్తున్నాను. అంతే” రాజు మళ్లీ అడిగాడు, “నీవు మొక్కలు పెంచుతున్నావు, బాగుంది. అవి పుష్పించి, ఫలించడానికి చాలా ఏళ్ళు పడుతుంది కదా! నీవు బ్రతికి ఉండగానే ఆ ఫలాలు తినే అవకాశం ఉంటుందా!! ఇదంతా వృధా ప్రయాస కదా!”
ఆ తోట యజమాని, “నేను మా తాత ముత్తాతల నాటి చెట్ల పళ్ళను చాలా తిన్నాను, కాబట్టి ఇతరుల కోసం, నా తర్వాతి తరాల కోసం నేను పండ్ల చెట్లను నాటాలి కదా! మనకోసం మాత్రమే చట్లు నాటుకోవడం స్వార్థం అనిపించుకోదా!” రాజుగారు తోట యజమాని మాటలకు ముగ్ధుడై తగురీతిన సత్కరించాడు.
మన అవసరాలకు లాభాల కోసం మాత్రమే ఆలోచించకూడదు. రేపటి తరం బాగుకోసం కూడా సహేతుకమైన మంచి పనులు చేయాలి.
సేకరణ – V V S Prasad