తరం వెళ్ళిపోతుంది.
ప్రేమగల పెద్దరికం కనుమరుగైపోతుంది.
బహుదూరపు బాటసారై పయనం ముగిస్తున్నది.
జ్ఞాపకాల మూట వదిలి బాటపట్టి పోతుంది.
తరం వెళ్ళిపోతుంది.
తెల్లని వస్త్రధారణతో
స్వచ్ఛమైన మనసుతో
మధురమైన ప్రేమతో
అందరి పట్ల అనురాగంతో
విలువలతో కూడిన బ్రతుకును సాగించిన
మన ముందు తరం తిన్నగా చేజారిపోతున్నది.
తరం వెళ్ళిపోతుంది.
వయోభారంతో మనల్ని వదిలిపోతుంది
హుందాతనపు మీసకట్టు
రాజహాసపు పంచ కట్టు
పూటకో తీరు మార్చని మాట కట్టు
శ్రమనే నమ్ముకుని ఎక్కిన బ్రతుకు మెట్టు
తల తెగినా మాట తప్పని నీతి ఒట్టు
ఇబ్బందులు ఎన్ని ఎదురైనా విప్పని గుట్టు
ఇలా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన
ఒక నాటి మన పెద్దతరం
క్రమంగా కనుమరుగవుతుంటే
హృదయం బరువెక్కుతుంది.
మనసు మూగబోతుంది.
కంటనీరు కారిపోతుంది.
తరం వెళ్ళిపోతుంది.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా
కష్టాలు ఎన్ని చుట్టుముట్టినా
సమస్యలు ఎన్ని ఎదురైనా
అందరూ సామరస్యంగా.. కలిసిమెలిసి
ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకునేవారు.
ఒకరికొకరు సహకరించుకునేవారు.
సమస్యలను సమూహంగా జయించేవారు.
తరం వెళ్ళిపోతుంది.
గమనిక : ఈ ఆర్టికల్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.