ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
వేశ్యా గా మారుతున్న. అమ్మాయిల బాధలు….,,,,!
నలిగిన ఎర్ర గులాబీ
ఆమె ఓ జీవన్మరణ ప్రవాహం..
ఆమె దేహం చీకటి గాయాల సమూహం..
నీడనివ్వని నీచుల చేష్టలకు బలియై..
జాతిలేని వీధికుక్కల చేత
వెలకట్టబడ్డ కన్నీటి బాష్పం తను..
ఎవరినీ నోరారా పిలవలేక..
ఎవరెప్పుడొచ్చినా కాదనలేక..
జనం కోసం ముస్తాబవుతోన్న దేహ ప్రాంగణం తనది..
పంట పొలాల్లో పడ్డ ఎలుకల్లా..
చెత్తకుప్పలపై ముసిరే ఈగల్లా..
ఆమె ఎంగిలి దేహంపై
ఎన్ని పురుషహంకారాలు ఎగబ్రాకుతున్నవో..
ఆడదిగా పుట్టడం శాపమో?
అతివగా బ్రతకడం పాపమో?
లేక పురుష సంభోగమే రాజభోగమో?
తెలియక
ఈ సంఘపు వృక్షానికి ఉరి వేయబడ్డ వ్యక్తిత్వం తనది..
ఈ సమాజానికి తన కన్నెరికాన్ని కానుకిచ్చి…
కాసిన్ని మెతుకుల కోసం
బతుకును వేలం వేసుకున్న వేల్పుబానిస..
పంటికింద బాధను నొక్కిపెట్టి…
పురుష దేహానికి పడకసుఖాన్ని అందించి..
గోడు పట్టించుకోని ఈ సమాజపు గోడల మధ్య
గోటి గాయాలను భరిస్తున్న నరపీడిత..
ఈ సంఘానికి తను అరగంటకో
చేయిమారుతున్న అంగడి సరుకట..
డబ్బులిచ్చి కులికినోడు రసికరాజట..
దేహాన్ని అర్పించిన తను మాత్రం ద్రోహియట..
ఆమె వ్యక్తిత్వదేశమ్మీద ఎన్ని దాడులు జరిగాయో..
పతితయని..
కులటయని..
వేశ్యయని..
వ్యభిచారియని….
ఎన్ని గాయాల్ని దాటొచ్చిన జీవితమో గాని..
ఎంత బాధ కలిగించినా..
ఎంత కన్నీరు పారించినా..
తన దేహాన్నే శిధిల సామ్రాజ్యంగా మార్చినా
మౌనంగా భరిస్తుంది..
తన వారి కడుపాకలి తీర్చాలని..
పెదవులకు నవ్వుల్ని పులుముకుని
ఒకరి తరువాత మరొకరితో
నిత్య జాగరణ చేస్తోన్న పురుష సేవకి..
కాసులు కూడబెట్టడానికి కాదు..
కడుపుకింత కూడు పెట్టడానికి..
కామపు కత్తుల దాడిలో నలిగిన ఎర్రగులాబీ ఆమె దేహం..
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com