Menu Close

కష్టాన్ని చూసి నవ్వకు – Telugu Moral Stories


రవి సాఫ్త్వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు. ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. “ఆకు కూరలు.. ఆకు కూరలు” అని కేక వినిపించింది.

డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. “కాస్త గంప దించయ్యా” అన్నది ఆమె. “పాలకూర కట్ట ఎంత?” అడిగాడు. “పది రూపాయలకు మూడయ్యా” చెప్పింది అవ్వ. “మరీ అన్యాయం.. బయట అయిదు ఇస్తున్నారు” అన్నాడు చిరుకోపంగా”నాలుగు తీసుకో నాయన..” కట్టలు తీసింది అవ్వపదిరూపాయలు ఇచ్చాడు.

“గంప కాస్త పట్టయ్యా” అన్నది అవ్వ తనవైపు పట్టుకుని. గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి. అవ్వ వెళ్ళిపోయింది.”ఎంత ఆశో ఈ ముసలిదానికి.. ఇవాళో రేపో చావబోతుంది.. ఇంకా మూటలు కడుతున్నది” ముసిముసిగా నవ్వుకున్నాడు. అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, రెండు వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు.

vegetable seller old women Telugu Moral Stories telugu bucket

కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు. అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచీని మోస్తూ “నానమ్మా.. నన్ను స్కూల్ నుంచి పంపేశారు..” ఏడుస్తూ వచ్చింది. అవ్వ కంగారుగా “అయ్యో నా బిడ్డ.. బాబూ.. కాస్త గంప కిందికి దించు” అన్నది రవితో.”ఏడవకమ్మా.. నేనొచ్చి చెబుతాలే. రేపు ఫీజు కడతాలే.. నా తల్లే.. ఇంటికిపొదాం పద” అన్నది పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ.

రవికి అర్ధం కాలేదు. “ఎవరీ పిల్ల?” అడిగాడు అవ్వను.”నా మనవరాలు బాబూ.. ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలవారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు ఎలుకలమందు మింగి చచ్చిపోయింది. మా ఆయన మూడేళ్ళ బట్టీ మంచం మీదున్నాడు. ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వ లేదు.

ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజూ తెల్లారుజామునే లేచి పొలాలకెళ్లి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకుని మోస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ అమ్ముకుంటూ పైసాపైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా. మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు. నెలరోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు.

ఈరోజు చూడు బాబు.. పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటకి పంపించారు.” అన్నది కళ్ళు తుడుచుకుంటూ. రవి నరాలు మొత్తం బిగుసుకునిపోయాయి. రక్తం స్తంభించిపోయింది. గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు. అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది. మనసంతా ఉష్ణ జలపాతం అయింది.

ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి. “ముసల్దానికి ఎంత డబ్బాశ” అనే తన వెకిలి మాట వెయ్యి గునపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది. ప్రతి కష్టం వెనుకా ఒక కన్నీటిగాధ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు. పర్సులో చెయ్యి పెట్టాడు. బయటకొచ్చి “అవ్వా..ఈ ఐదువేలు తీసుకుని మనవరాలి ఫీజ్ కట్టెయ్యి” అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని. హంపి మొహంజదారో శిధిలాలకు ప్రతీకలాంటి అవ్వ వృద్ధశరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది.

“బాబూ.. ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది” అన్నది వణుకుతూ” అప్పని ఎవరు చెప్పారు? చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను. ఇప్పుడే కాదు.. నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజ్ కడతాను.. రేపటినుంచి రోజూ నేను ఉన్నా లేకపోయినా పదిరూపాయల ఆకు కూరలు ఇచ్చేసి వెళ్ళు” గంప పైకెత్తాడు రవి. మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు. వాకిట్లో ఆరు ఆకు కూర కట్టలు కనిపించాయి!. 🙏

Like and Share
+1
2
+1
1
+1
0

2 Comments

  1. Banu

    ఇలాంటి మంచి కథలను, నేను voice ఇచ్చి స్టోరీ tellling వీడియో గా న ఛానల్ లో వాడుకోవచ్చ చెప్పండి ప్లీజ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading