ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు. ప్రజలంటే వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ప్రార్థించేవాడు. చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు.
“రాజా, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.” అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమ గల ఆ రాజు ఇట్లా అన్నాడు.
“భగవన్, నా దగ్గర నీవు ఇచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖసంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏంటంటే
మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యులను చేయండి. వారికి దర్శనాన్ని ఇవ్వు. ”భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం చాలా పట్టుదల బట్టి “ఈ కోరికను తీర్చు వలసిందే.” అన్నాడు భగవంతుడు చివరకు భక్తుడి కోరికను తీర్చక తప్పలేదు. ఆయన అన్నాడు.
“సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా నేను కొండమీద అందరికీ దర్శనమిస్తాను.” అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై, భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుని, మరుసటిరోజు నగరంలో దండోరా వేయించాడు. “రేపు అందరూ కొండ దగ్గరకు నాతోపాటు వచ్చి చేరవలసింది. అక్కడ భగవంతుడు మీకందరికీ దర్శనం ఇస్తాడు.” రెండవ రోజు రాజు తన ప్రజలందరిని, స్వజనులతో పాటు తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు, నడుస్తూ నడుస్తూ దారిలో ఒకచోట రాగి నాణేల కొండ కనిపించింది. ప్రజలలో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు.
అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు అందరిని సమాధానపరచి, “అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు. ఎందుకంటే మీరు అందరూ భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణాలు వెనకాల మీ అదృష్టాన్ని కాల తన్ను కోకండి.” అన్నాడు. కానీ లోభం ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆ నాణాలను మూటకట్టుకుని, తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో అనుకున్నారు, మొదలు ఈ రాగి నాణాలను ఇల్లు చేర్చుకుందాము. భగవంతుడిని తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని.
రాజు ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక వెండినాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణేల మూట కట్టుకుని ఇంటివేపు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. ‘వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో తెలియదు.. భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు.’ ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే పరుగెత్తడం మొదలుపెట్టారు.
వాళ్లు ఇతరుల లాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి వెళిపోయారు. ఇంక కేవలం రాజు రాణి మిగిలారు. రాజు రాణి తో అన్నాడు- “చూడు, ఈ జనాలు ఎంత ఆశపోతులో! భగవంతుడు లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు. భగవంతుడు ఎదుట మొత్తం ప్రపంచం లోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే.” నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. కొంతదూరం వెళ్లాక రాణికి, రాజుకు ఏడురంగుల లో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆగలేకపోయింది. ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నీ మూట కట్టుకోవటం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది, చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు.
నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు “ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటి నుంచి ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.” రాజు చాలా సిగ్గుతో ఆత్మగ్లానితో తన తల దించుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు “ఓ రాజా, ఎవరు తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను. వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు.”