ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నేను పుట్టగానే నా నోటి నుంచి వొచ్చిన మొదటి శబ్దం, పేరు లేని నీ పేరు. మూర్ఖులు వీళ్లు, అది పాలకోసం యేడుపనుకున్నారు.
అది మొదలు నీకోసం వెతుకుతున్నాను. నేనాడుకున్న బొమ్మల్లో నీవున్నావేమోనని వెతికాను. నేను చదువుకున్న పుస్తకాల్లో నీ రూపం ముద్రించారేమోనని చూశాను. కవులు నీ అందాన్ని పాడారేమోనని చదివాను. నీవెక్కడున్నా కనపడతావేమోనని మొహాలు వెతుకుతూ దేశాలు తిరిగాను.
కనపడవు. కానీ నీవు చిరపరిచయవు. నీ రూపమగోచరము. నీ స్వభావము మనోభావానికతీతము. కానీ నీకన్న నాకు హృదయానుగతమేదీ లేదు. నీ నామమనుసృతము. కలలో విన్న గానం వలె ప్రతి నిమిషమూ నా చెవుల ధ్వనిస్తోంది.
నావేపు నడిచి వొచ్చే నీ మృదు పాదరజము అస్తమయ మేఘాలకి యెర్రని రంగు వేస్తోంది. నన్ను వెతుకుతూ వచ్చే నీ అడుగుల చప్పుడు నా హృదయంలో ప్రతి నిమిషం ధ్వనిస్తోంది. నా పరమావధి నీవు.
నీ వుండబట్టి, ఈ ప్రపంచమింత సుందరమూ, హృదయాకర్షకమూనూ నాకు. కాకపోతే ఈ కొత్త లోకానికీ నాకు సంబంధం ఏమిటి? లోహపు బిళ్ళల్నీ, నీతి ప్రతిష్టల్నీ ఆరాధించే ఈ ప్రజలతో నాకు సాపత్యమేమిటి? వీరెవరో నాకు తెలియదు. నేను వీరికర్థం కాను, నేనిట్లా ఎందుకు వెతుకుతున్నానో ఊహించలేరు.
ఒక చోట నీ అధర లావణ్యమూ, ఒక చోట నీ కళ్ళ నలుపూ, ఇంకొకచోట నీ నడుము వొంపూ, మరి ఒక చోట నీ వక్షము పొంగూ చూసి నీ నించి ప్రేమ లేఖల్ని స్వీకరిస్తున్నాను, అనుభవిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
ఒక హృదయంలో నీ ప్రణయ మాధుర్యమూ, ఒక హృదయంలో నీ లీలా వినోదాసక్తీ, ఇంకొక హృదయంలో నీ మాతృ మార్దవమూ, మరి ఒక హృదయంలో నీ ఆనంద పారవశ్యతా చూసి ఆకర్షింపబడుతున్నాను, స్వీకరించి అనుభవిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
కానీ, నిరాశ, ఇవన్నీ నువ్వెట్లా కాగలవు? వీళ్ళంతా నన్ను నీతిలేనివాణ్ణి అంటున్నారు, చూడు. కానీ నాకు భయమెందుకు? దొంగతనమెందుకు నిన్ను ప్రేమించిన నాకు?
నీ వున్నావని, నీ నించి విడిపడ్డానని, నీ కోసం వెతక్కుండా వొక్క నిమిషం నిలువలేనని, వీళ్ళ లెఖ్ఖ నాకు రవ్వంత లేదని, నీవు నాకు వార్తలు పంపుతున్నావని, యెక్కడ దేనిని ప్రేమించినా నిన్నేననీ, వీళ్ళకేం తెలుసు?
మృణ్మయమైన ఆత్మలు, తమో నిర్మితమైన మేధస్సులు నిన్నూ-నన్నూ అర్థంచేసుకోగలవా?