ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
తాడు దొరికిందని ఏనుగును కొనుక్కోవడం అంటే ఇదేనేమో! – Moral Stories in Telugu
“ఏమండీ వచ్చేటపుడు పెరుగు తీసుకొస్తారా.. ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది.. బాగా పుల్లగా అయింది.”
“అవునా… అలాగైతే దాన్నేం చేస్తావు?”
“ఏం చేయాలి ? బయట పారబోస్తానంతే…”
“అమ్మ చెబుతుండేది.. పెరుగును బయట పారబోయరాదని. ఏదో ఒకటి చేయి…”
“ఏం చేయాలి.. మజ్జిగ చేస్తే పులుపే పులుపు. నోట్లో పెట్టుకోలేమే!”
“ఒక పని చేయి. మజ్జిగ పులుసు చేయి. తినడానికీ రుచిగ ఉంటుంది.”
“గుడ్ ఐడియా .. ఎలాగూ బయటకు పోతున్నారుగా.. కొన్ని సామాన్లు చెబుతాను, వ్రాసుకోండి.”
“సరే చెప్పు…”
“ఊఁ.. కొత్తిమీర, కరివేపాకు, అల్లం.. ఆ.. ఒక టెంకాయ, జీలకర్ర..”
“సరే .. వ్రాసుకున్నాను.. బయల్దేరనా?”
“ఉండండి.. ఇంకా ఉన్నాయి.. ఒక బూడిద గుమ్మడికాయ…”
“బూడిద గుమ్మడికాయనా ? అదెందుకు?”
“మరి మజ్జిగ పులుసులో వేస్తరా? తెచ్చేదేదో పెద్దదే తెండి. కోసిపెట్టినది , కుళ్ళిపోయినది కాకుండా చూసి తీసుకురండి.”
“సరే… బయల్దేరనా?”
“అయ్యో .. కాస్త ఆగండి.. ఒకటే గుమ్మడికాయ తేకూడదంట, అమ్మమ్మ చెబుతుండేవారు. ఎలాగూ తెస్తున్నారు రెండు తెండి. అవి కూడ పెద్దవి.
ఇంకో పని చేయండి.పెద్ద గుమ్మడి కాయ తెస్తున్నారెలాగూ, ఒక కేజి చక్కెర, ఒక కేజి నెయ్యి , ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు…”
“ఇవన్నీ మజ్జిగ పులుసుకు ఎందుకే?”
“ఛీ, పులుసుకు కాదండి.. హల్వా చేయడానికి. గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలివేయరాదు. అపశకునం..”
“ఇక చాలా?”
“కాస్త ఆగండి.. ఓ నాలుగైదు నిమ్మ కాయలు, నల్ల మిరియాలు, ఇంగువ తీసుకురండి. ఘమఘమల వాసనలొస్తాయి.”
“హల్వాకు ఇంగువ వేస్తారా?”
“థూ .. హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారాండి.. ఇవి గుమ్మడికాయ వడియాలకు.. గుమ్మడికాయ తెస్తున్నపుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి?”
“ఇకనైనా వెళ్ళనా?”
“ఏదో జ్ఞాపకానికొస్తోంది ఉండండి. ఆ.. జ్ఞాపకమొచ్చింది. ఒక పొట్లకాయ తెండి. మజ్జిగ పులుసుకోసం గుమ్మడికాయతో బాటు మంచి కాంబినేషన్ . దాంతో బాటు ఒక అర్ధ కేజి మొత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి? అలాగే వంటసోడా, రిఫైన్డ్ ఆయిలూ తీసుకురండి, వేరుశనగనూనె కాదు సన్ ఫ్లవర్ ఆయిల్…”
“సరే.. బయల్దేరుతున్నాను.”
“అదేమిటి వెనుక తలుపు వైపు. అక్కడెక్కడికి వెళ్తున్నారు.”
“నేను బయటకు పోవడం లేదు, వంటింట్లోకి వెళ్తున్నాను.”
“ఎందుకు? మార్కెట్ కు పోరా?”
“నీ మార్కెట్ నాశనం కాను. గ్లాసుడు మజ్జిగపులుసు కోసం వేయి రూపాయలు ఖర్చు చేయాలా? పాపమొస్తే రానీ.. నేనే ఆ పులిసిన పెరుగును బయట పారబోస్తాను..”
“ఏమిటండీ, మీరే చెప్పారుగా…”
“చెప్పాను.. బుద్ధిలేక.. పులుపు నాకు సరిపోదు.. అసిడిటీ…”
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com