“నమ్మకం నడిపిస్తుంది.
విశ్వాసం కాపాడి నిలబెడుతుంది”.
మనం ఎవరిని ఎంత వరకు నమ్ముతున్నామో మనకే సరియైన అవగాహణ లేకుండా వ్యవహరిస్తుంటాము. అనవసరమైన అనుమానాలతో మంచి బంధాలను పాడు చేసుకుంటాము. అతిగా ఆలోచించే మనతత్వం కలిగినవారు రేపటి గురించి ఆలోచించి ఈ రోజును పాడు చేసుకుంటారు. ప్రతి వ్యక్తి ప్రస్తుత కాలన్ని సద్వినియోగ పరచుకోవాలి. ఈ భావంతో వ్యవహరించుకోగలిగితే ప్రతి రోజు ఒక ఆనందమైన రోజుగా గడుస్తుంది. అందుకు ఉదహరణగా భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క మనస్తత్వాన్ని ఎలా పరీక్షించాడో చూడండి.
ఒకనాడు శ్రీ కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ఉద్యానవనంలో కూర్చోని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అపుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశంవైపు చూపి…
‘ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా ‘ అని అడిగాడు.
అర్జునుడు ” అవును కృష్ణా! అది పావురమే ” అన్నాడు.
మరికాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు.
” అబ్బే! అది పావురం కాదు గ్రద్దలా ఉంది చూడు చూడు.
“అవును నిజమే అది పావురం కాదు అది గ్రద్దనే కృష్ణా” అన్నాడు అర్జునుడు.
కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడు..”అర్జునా! అది గ్రద్ధ కానే కాదు. అది చిలుక సరిగ్గా చూడు ఒక్కసారి”
“నిజమే కృష్ణా! అది చిలుకనే” అన్నాడు అర్జునుడు.
చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు కృష్ణుడు…
“అయ్యో! అది చిలుక కూడా కానేకాదు. అది కాకి అర్జునా! ఒక్కసారి పరీక్షించి చూడు”
అరే! నిజమే అది చిలుక కాదు కాకే కృష్ణా!” అన్నాడు అర్జునుడు.
కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు.
” అసలు నీకు బుద్ధి ఉందా? నీకంటూ ఒక అభిప్రాయం లేదా?
సొంతంగా ఆలోచించలేవా?
నేను ఏదంటే అదే అని వంత పాడుతున్నావు ” అన్నాడు.
దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు.
” ఓ సర్వాంతర్యామీ! నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను.
నువ్వు ఏదంటే నేనూ అదే! మీరు పావురమే కదా అన్నారునేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది.
నాకు అన్నీ మీరే. మీ మాటే నాకు వేదం కృష్ణా!”
నమ్మకమే భగవంతుడే అర్జునుడి ప్రక్కన ఉండేలా చేసింది.
దేవుడిపైన మనకు అనుమానం అక్కరలేదు. భగవంతునిపైన నిజమైన నమ్మకాన్ని ఉంచాలి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మునికి ఉంది. మనకు కావలసింది ఏదో ఆ దేవునికి తెలుసు. ఎప్పుడు మనకు ఏది ఇవ్వాలో మన నుండి ఎప్పుడు ఏది తీసుకోవాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు. భగవంతుడికి శరణుజొచ్చి నమ్మకంతో జీవించిన వారికి అన్ని తానై నడిపిస్తాడు.
శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు యుద్ధం ముగిసింది ఆ రాత్రి రామలక్ష్మణులు కపి సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు. అర్థరాత్రి అయింది రాముడు లేచి సముద్రం దగ్గరకు వెళ్ళాడు ఒక్కొక్క రాయి తీసికొని సముద్రం నీటిలో వేస్తున్నాడు ప్రతి రాయి మునిగిపోతుంది.
రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం గమనించిన హనుమంతుడు తాను రాముని వెంట వెళ్ళాడు, రాముడు రాళ్ళను సముద్రంలో వేయడం గమనించారు రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి మహాప్రభూ ఎందుకిలా రాళ్ళను అంబుధిలో వేస్తున్నారు అని ప్రశ్నించాడు..
“హనుమా..! నువ్వు నాకు అబద్ధం చెప్పావు” అన్నాడు.
“రాముడు అదేమిటి స్వామి నేను మీకు అబద్ధం చెప్పానా?
ఏమిటి స్వామి అది?” ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు.
“వారధి కట్టేటప్పుడు నా పేరు జపిస్తూ రాళ్ళను కడలిలో వేశామని అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడ్డాయని చెప్పావు నిజమేనా?” అన్నాడు రాముడు
“అవును స్వామీ!” అన్నాడు హనుమా.
“నా పేరు జపింవి వేసిన రాళ్ళు తేలడం నిజమైతే నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు ఎందుకు తేలడం లేదు?”
మునగడానికి కారణమేమిటి?
నువ్వు చెప్పిన మాట అబద్ధం కాదా!!” అడిగాడు రాముడు
హనుమంతుడు వినయంగా చేతులు కట్టుకుని ఇలా అన్నాడు..
“రామచంద్ర ప్రభూ! మేము మిమ్ము మీ శక్తిని నమ్మాము మీ మీద నమ్మకంతో వేశాము మా నమ్మకం వలన అవి తేలాయి మీకు మీ శక్తి మీద నమ్మకం లేదు అనుమానంతో అపనమ్మకంతో రాళ్ళను వేశారు అందుకే అవి మునిగిపోయాయి” అన్నాడు.
“నమ్మకం విలువ అది. దేన్నైనా పూర్తి విశ్వాసం, నమ్మకంతో చేయాలి.”
మనం ఎవరినైనా నమ్మితే పూర్తి విశ్వాసంగా నమ్మలి. కొంత అనుమానం, సందేహాలు అనేవి ప్రారంభ దశలోనే నిర్ణయించుకోవాలి. ఒకసారి నమ్మకం కుదిరాక తిరిగి పరిపరి విధాలుగా ఆలోచనలు రాకూడదు. అది ఏ బంధమైన సరే విశ్వాసం, నమ్మకం ఉంటే ఆ మైత్రితో మంచి మేలును కలుగజేస్తుంది. పరిపూర్ణమైన నమ్మకంలో నారాయణుడు ఉంటాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.