ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Moral Stories in Telugu
గాలి పటాల పండుగకు తండ్రితో పాటు చూడడానికి వెళ్ళిన కొడుకు, ఆ ఎగురుతున్న పతంగులు చూసి, ఆనందం పట్టలేక, తనకూ ఒక గాలిపటం కావాలని పట్టుబట్టి కొనిపించి ఎగరేసి ఆనందించాడు. అది పైపైకి ఎగురుతుంటే అబ్బాయి ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు. కొద్ది సేపటి తర్వాత, “నా గాలిపటం పైకి ఎగరకుండా ఈ దారం అడ్డుపడుతోంది.
దీన్ని తెంచేస్తే ఇంకా పైకి స్వేచ్ఛగా ఎగురుతుంది కదా నాన్నా! దారం తెంచేద్దామా!” అంటూ గాలిపటం దారాన్ని తెంచేసాడు. తెగిన గాలిపటం ఇంకాస్త పైకి ఎగిరింది. పిల్లవాడి ఆనందానికి అవధులు లేవు. కానీ, కొద్ది సేపటికే క్రిందికి పడిపోతూ కనుమరుగై పోయింది.
పిల్లవాడికి ఆశ్చర్యం వేసి, ‘అలా ఎందుకు పడిపోయింద’ని తండ్రిని అడిగాడు. “మనం కూడా ఒక స్థాయిలో జీవిస్తుంటాం. ఇంకా పైకి ఎదగాలనుకుంటుంటే మనల్ని ఎదగనీయకుండా ఎవరో ఒకరు కిందికి లాగేస్తుంటారు. దారం గాలిపటం పైకి ఎగరడానికి సహకరిస్తూ, గాలిలో ఎత్తుగా ఉంచి, గాలి హెచ్చుతగ్గులకు తగ్గట్లుగా అదుపు చేస్తుంది. దారాన్ని తెంచేస్తే, అంత వరకూ దారం అందించిన ఆధారం పోయి, పడిపోతుంది. కొడుకుకి విషయం అర్ధమైంది.
ఇల్లు, కుటుంబం వంటి పరిమితులు లేకపోతే మనం చాలా త్వరగా పైకి ఎదగగలమని అనుకుంటాం. కానీ కుటుంబం, ఇల్లు, ప్రేమించే వాళ్ళు అనే ఆధారాలు మనకు తోడుగా ఉండి మన ఎదుగుదలకు దోహదం చేస్తారు. కుటుంబం మనల్ని ఎదగనీయకుండా పట్టుకోవడం లేదు, మనకు సపోర్ట్ గా ఉంటున్నారు. అందుకే వాళ్ల చెయ్యి వదిలి పెట్టకండి.
సేకరణ – V V S Prasad