Menu Close

అమూల్యమయిన మూడు నీతి సూక్తులు – Moral Stories in Telugu


అమూల్యమయిన మూడు నీతి సూక్తులు – Moral Stories in Telugu

అనగనగా ఒక రోజు ఒక వేట గాడి చేతికి ఒక చిన్న పక్షి(పిచ్చుక) దొరికింది . అతడు దానిని చంపబోతుంటే ఆ పక్షి అతనితో ఇలా అంది.

“అయ్యా నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను జంతువులను వేటాడి ఉంటావు, నా లాంటి అల్ప ప్రాణిని చంపటం వల్ల నీకేమి ఉపయోగం?
నీ పిడికిలి పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగూ తీరదు. దయచేసి నాకు ప్రాణ బిక్ష పెట్టి నన్ను వదిలి వేయి.

అందుకు ప్రతి ఫలంగా నేను నీకు అమూల్యమయిన మూడు నీతి సూక్తులు చెప్తాను అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, నీవు సంతోషం గా సుఖంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.”

అది విన్న వేటగాడు క్షణం అలోచించి, నిజమే ఈ పిచ్చుకని చంపటం వల్ల ఉపయోగము లేదు అనుకుని, “సరే వదిలివేస్తాను ఆ నీతి సూక్తులు ఏమిటో చెప్పు” అన్నాడు.

అప్పుడు ఆ పిచ్చుక, “అయ్యా కానీ నాది ఒక షరతు, నేను మొదటి సూక్తి నీ చేతిలో చెప్తాను, రెండవది నీ ఇంటి పైకప్పు పై కూచుని చెప్తాను, ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూచుని చెప్తాను అంది.” వేటగాడు సరే అని ఒప్పుకుంటాడు.

పిచ్చుక వేటగాడి చేతిలో కూచుని మొదటి నీతి సూక్తి ఇలా చెప్తుంది …

1) ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి(తర్కానికి) రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు.

అని చెప్పి, వేటగాడి చేతి లో నుండి ఎగిరి వెళ్లి ఇంటి పైకప్పు పై కూచుంటుంది. అక్కడ నుండి ఫక్కున నవ్వి అంటుంది “ఓరి మూర్ఖుడా నువ్వు నన్ను ఎవరనుకున్నావు, నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువయిన వజ్రం ఉంది, అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలివేసావు .”

అది విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టం తలచుకుని ఏడవటం మొదలుపెడతాడు. అయ్యో అంత విలువయిన బరువయిన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడిని నేను అని గట్టి గట్టిగా ఏడవటం మొదలుపెడతాడు. అప్పడు పిచ్చుక అంది, ఓరీ నీవు నిజంగానే మూర్ఖుడివి, నేను ఇంతకు ముందే నీకు చెప్పాను

“ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి(తర్కానికి) రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు.”

నీ పిడికిలి అంత కూడా లేని నేను, నా కడుపులో బరువయిన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు? మూర్ఖుడా, రెండవ నీతి సూక్తి ఏమిటంటే

2) ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి అలోచించి చింతించకూడదు బాధ పడకూడదు.

అని చెప్పి ఎగిరి వెళ్లి చెట్టు కొమ్మ పై కూచుంది.

వేటగాడు ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాడు. “లేదు, నేను నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు నన్ను మోసం చేసావు.”

పిచ్చుక వేటగాడిని చూస్తూ అలా కూచుని ఉంది.

కాసేపటికి వేటగాడు తేరుకుని సరే, “ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి అలోచించి చింతించకూడదు బాధ పడకూడదు” అని గుర్తు చేసుకుని, సరే ఇప్పుడు మూడవ సూక్తి ఏమిటో చెప్పు అంటాడు.

అప్పుడు పిచ్చుక, ఎలాగూ నే చెప్పిన మొదటి రెండు సూక్తులు నీ బుర్రకెక్కలేదు, మూడవది చెప్పటం వల్ల ప్రయోజనం లేదు.

3) నీ మాటలు వినని, అర్థం చేసుకోని వారిపై ఎన్నడూ నీ శక్తినీ, విజ్ఞానాన్ని, సమయాన్ని వృథా చేసుకోవద్దు.

అని మూడవ సూక్తి చెప్పి ఎగిరి వెళ్ళిపోతుంది.

గమనిక : ఈ ఆర్టికల్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com
Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading