అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
భర్తల జీవిత చక్రం – Husbands Life Cycle in Telugu
లేలేత భర్తలు: భార్య చుట్టూ తిరుగుతూ ఉండడం. భార్య చూపు తగిలితే చాలనుకోవడం..,”అసలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ పెళ్ళవదు”, అనుకోవడం..! భార్య దగ్గరే స్వర్గం ఉంది అని భావించడం.. అసలు సృష్టిలో భార్య, తను తప్ప ఎవ్వరూ లేరనుకోవడం…! అన్నీ పనులూ వచ్చని చెప్పడం..!
తమ జీవితంలో సంఘటనలన్నీ, అడిగినా అడక్కపోయినా స్వచ్ఛందంగా, అమాయకంగా ఉన్నది ఉన్నట్టు భార్యకు చెప్పేసుకోవడం..! కొన్ని బలహీన క్షణాల్లో ..భవిష్యత్తు ఊహించక భయంకర వాగ్ధానాలు చేయడం ..! ఈ దశ పెళ్ళైన పదహారు రోజుల పండగ వరకు ఉంటుంది..!

దోర భర్తలు: పదహార్రోజులంత ఉత్సాహం ఉండదు కానీ, కొంత పచ్చి మిగిలుంటుంది.“అన్నీ చెప్పేసామే..! కొన్ని దాచ వలిసిందే “అని అలోచిస్తూ ఉండడం.. పర్లేదులే పరాయిది కాదుకదా కట్టుకున్న భార్యేగా అర్థం చేసుకుంటుందిలే, అయినా మా మధ్య రహస్యాలు ఉండకూడదు” అని నమ్మకంగా ఉండటం..
కాస్త బాహ్య ప్రపంచంలో వేరే మనుషులు కూడా కంటికి కనపడుతూ ఉండడం. భార్యని చీటికి మాటికి సినిమా షికార్లకి తిప్పడం.. అడక్కపోయినా చీరలు నగలు కొనిస్తూ ఉండడం..! భార్యకి చిన్నగాయం అవడానికి కొన్ని క్షణాల ముందునుండే కంగారు దిగులు.
కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకోవడం. విలవిల్లాడిపోవడం. భార్య వైపు బంధువులను కూడా అతి ప్రేమగా చూడ్డం. భార్య పని చేస్తుంటే లాక్కుని ‘నే చేస్తాలే’ అనడం.. తనని పని చేయనివ్వక పోవడం. ఈ స్థితి పెళ్ళైన ఆర్నెల వరకూ ఉంటుంది..!

వగరు భర్తలు: అన్నీ అనవసరంగాచెప్పేసాం అని దిగులు పెరగడం..! ఆఫీస్ అయి పోయిన వెంటనే స్కూల్ పిల్లాడిలా ఉత్సాహంగా వెంటనే ఇంటికి వచ్చేయడం..“ఉద్యోగం చేసి ఇంటి పనులూ చేయడం నా వల్ల కాదు “అని అనుకోవడం..అప్పుడప్పడూ మాట పెరిగి, మళ్ళీ సర్దుకు పోవడం..
కొంచెం భార్యని అదుపులో పెట్టుకోవాలి అనే విపరీత ఆలోచనలు రావడం..! బైటకి తిప్పడం తగ్గించడం. భార్య ఏదైనా కొనమని చెప్తేనే కొనడం..! భార్యకి చిన్న చిన్న దెబ్బలు తగిలి తనకి చూపిస్తూ తిరిగితే “ఏదైనా మందు వేసుకో “ ఎంతసేపని అలా పనిచేస్తూఉంటావ్” అని పేపర్ చదవుతూ రెండు వేళ్ళతో పేపర్ వొంచి నిర్లిప్తతగా చెప్పడం.
కానీ భార్య వల’పు’ వల్ల కాదులే మనం కూడా ఇంటి పని చెయ్యాల్లే కాస్త , పాపం తను ఒక్కతే కష్టంకదా చేసుకోవడం.. అని భావించడం..! ఈదశ పెళ్ళైన ఆర్నెల్ల నుండి మెదటి సంవత్సరం వరకూ ఉంటుంది..!
పండిన భర్తలు: భార్యకి తన విషయాలు అన్నీ చెప్పడం తప్పని నిర్థారించుకోవడం..! భార్యతో కాస్త ముభావంగా ఉండడం. ముక్తసరిగా మాట్లాడ్డం..! భార్యని ఖశ్చితంగా అదపులో పెట్టాలి లేకపోతే కష్టం అని నిర్ణయించుకోవడం..
ఆఫీస్ అయ్యాక ఊరంతా తిరిగి ఉసూరుమంటూ ఇంటికి రావడం రావడం తోనే భార్య సంధించే,“ఎందుకు లేటైంది? ఆఫీస్ అయ్యాక ఎక్కడికైనా వెళ్ళారా..?….” లాంటి ప్రశ్నలు తట్టుకోలేక కోప్పడ్డం(ఇది మొదటి స్వచ్ఛమైన కోపం) ‘ఏమనుకుంటోందో నేనంటే??’ అని తనలో తను మాట్లాడుకుంటూ ఉండడం.
ఇంట్లోపని నేను చెయ్యను చేస్తే చేస్తుంది లేకపోతే మానేసుకుంటుంది. అయినా ఆడవాళ్ళపని మనం చేయడమేంటి..? అని నిశ్చయించుకోవడం..! ఈదశ మొదటి సంవత్సరం దాటాకా ఆర్నెల్లు ఉంటుంది..!

పొగరు భర్తలు: నేను మగాణ్ణి నా ఇష్టం అనే భావనతో మెలగడం. భార్య ఏమైనా ప్రశ్నలు అడిగినా ,తన గతం ఎత్తి దెప్పుతూంటే చిరాకు పడ్డం. కోపంగా అరవడం..ఇంట్లోంచి ఆవేశంగా వెళిపోవడం..రాత్రికి చల్ల బడ్డం. తనే ముందుగా,భార్యతో మాట్లాడ్డం “అన్నం తిందామా”అని అడగడం. మళ్ళీ ఉదయం మామూలే. ఈదశ ఆర్నెల్లు ఉంటుంది..! అంటే పెళ్ళయ్యి అప్పటికి రెండేళ్ళు ముగుస్తుంది.. ఈ దశ దాటాక కొత్త కష్టాలు మొదలౌతాయి…!
విసుగు భర్తలు: పిల్లల ఏడ్పులతో విసుగు చెందడం..!భార్య, ”పిల్లల్ని చూస్తూండండి” అని చెప్పినప్పుడు.కోపం-చికాకు అణుచుకోవడం..ఓర్పు క్షీణించడం..“ఛ ఛ కొంపలో మనశ్శాంతి లేదు” అని వీధుల్లో తిరగడం..పాత మితృలను కలవడం..పుట్టింటిని, అమ్మా నాన్న ను ఎక్కువ తలుచుకుంటూ ఉండటం..
చదువుకున్న రోజులు గుర్తు తెచ్చుకోవడం.. ఇంటికి వెళ్ళాలంటేనే చికాకు రావడం..భార్యపై అరుస్తూ ఉండడం.. భార్యతో వాదనకు దిగడం..భార్య తన గతం ఎత్తి దెప్పుతుంటే, వస్తువులు పగలకొట్టడం..ఆవేశంగా బైటకి వెళిపోవడం.. ఈ దశలో భార్య తనకి కనిపించేలా తన అనారోగ్యం.
దెబ్బలు చూపిస్తూ,ప్రదర్శిస్తూ తిరుగుతూ ఉన్నా.. భర్త అస్సలు పట్టించుకోరు ఏమీ స్పందించరు..”ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి ఏం చిన్న పిల్లా??” అని మనసులో అనుకోవడం.“ఇంకా పెళ్ళికాని తన స్నేహితులకి చేసుకోవద్దురా నామాట విను” అని సలహాలు చెప్తూండడం.పెళ్ళి చేసుకున్న వాళ్ళపై జాలి ,సానుభూతి చూపడం. ఈ దశ పిల్లలు హైస్కూల్ చదువులకు వచ్చే వరకూ ఉంటుంది…!

దిగులు భర్తలు: ఆదాయం కంటే ఖర్చులు పెరగడం.. అప్పులు చేయడం..ముందు ఘోరం ఊహించక, భార్యని “ఏమైనా మీ ఇంట్లో వాళ్ళని అడుగుతావా??” అని అభ్యర్థించడం..!భార్య తెచ్చిచ్చి, గొడవలైనప్పుడల్లా “మా పుట్టింటివాళ్ళు ఇస్తేనే గానీ దిక్కు లేదు” అనే ఈ అతి ప్రమాదకరమైన అస్త్రం ప్రయోగించినపుడు.. భార్యని ఏమీ అనలేక, మానసికంగా కుంగిపోవడం..కుమిలిపోవడం.గిలగిల్లాడిపోవడం..!
భార్య”ఏం మా వాళ్ళు ఇంటికొస్తే నోరు పెగల్దే ..? మొహం మాడ్చుంటావ్.. అదే మీ వాళ్ళొస్తే చంద్రబింబం అయిపోతుంది అయ్యగారి మొహం..మా వాళ్ళని చూడలేవు కళ్ళల్లో నిప్పులు పోసేసుకుంటావ్. పలకరిస్తే నీ ఆస్తులు కరిగిపోతాయా??.”లాంటి మాటలు.
భర్త వైపు చుట్టాల ఫంక్షన్లకి వెళ్ళొచ్చాక కొన్ని నెలలపాటు భార్య,”చూసావా మీ వాళ్ళు ఎలాంటి చీర పెట్టారో !ఇల్లు తుడవడానికి కూడా పనికిరాదు! ఓ మంచిగా పలకరింపు లేదు.!తిన్నావామ్మా?అని అడిగింది లేదు..!గొప్పకుటుంబాలు ..! గొప్ప వంశం మీది..!”లాంటి మాటలు వింటూ..“పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను”అని పశ్చాత్తాప పడడం..మా నాన్నగారు ”పెళ్ళైంది ..ముందులా కాకుండా జాగర్తగా ఉండాలి”అని చెప్పిన మాటకి అర్థం ఇప్పుడు తెలుస్తోంది…!అని బాధపడడం..
శూన్యంలోకి పిచ్చి చూపులు చూస్తూ నవ్వకోవడంచిన్న చిన్న మానసిక,శారీరక అనారోగ్యాలు..! ముఖంలోదిగులు బెంగ, నిరాశ, ఎదుటివారికి కొట్టొచ్చినట్టు కనపడ్డం. ఈదశ చాలా ప్రమాదకరమైన దశ, ఈదశలోనే చాలా మంది వ్యసనాలు అలవాటు చేసుకోవడం, పూర్వపు ఆడ స్నేహితురాళ్ళకు దగ్గర కావడం.. ఇలా చాలా ఘోరంగా ఉంటుంది.. లేదా దేవునిపై విపరీతభక్తి .గుళ్ళకి , గోపురాలకి ఎక్కువ తిరగడం.. పూజలు,ఉపవాసాలు,ఎక్కువగా చేస్తూ ఉండడం…ఎక్కువగా దేవుని ప్రవచనాలు వింటూండడం.. అమ్మ నాన్నలపై విపరీతమైన ప్రేమ కలిగే దశ…! ఇది సుమారు పిల్లలు డిగ్రీకి వచ్చే వరకూ ఉంటుంది…!

బరువు భర్తలు: పిల్లలకి పెళ్ళి సంబంధాలు చూడ్డం అనే బరువు మీద పడితన బాధలు మర్చిపోవడం..(ఇక్కడే భర్త తన భర్త తత్వాన్ని కోల్పోయి ఏదోచేద్దాం అనుకున్నవి మరిచిపోయి) నేను తండ్రిని ..నేను తండ్రిని ..‘పిల్లలకి పెళ్ళి చేసెస్తే ప్రశాంతంగా ఉండచ్చు’అని అనుకోవడం. ఈ దశ పిల్లలకు పెళ్ళి చేసి ఆ పిల్లలకు పిల్లలు పుట్టే వరకు ఉంటుంది . అంటే ఒకప్పటి భర్త .. తండ్రి దశ దాటి తాత అవ్వడం..!
చల్లారిన భర్తలు: పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటూంటారు..వీరికి ఇక ఏ బాధ్యతలు ఉండవు..ఓపికా ఉండదు..కానీ అప్పటికింకా భార్యకి ఓపిక ఉండటం ..ఒకప్పుడు తను తిట్టాలనుకున్నవి..అనాలని ఆపుకున్నవి అన్నీ గట్టిగా భర్తకి వినిపించేలా తిట్టడం..జరుగుతుంది..కానీ ఏమీ వినపడనట్టు “వంటైందా..?”
అని అమాయకంగా అడగడం పడక్కుర్చీలో కళ్ళ జోడు సర్దుకుంటూ పేపరు చదివినట్టు అడ్డు పెట్టుకుని ..”అన్నీ గుర్తున్నాయ్ దీనికి ఎన్నెన్ని మాటలంటోంది నాయనో పెళ్ళంత నరకం లేదు..నడుం వొంగాక పూర్తి జ్ఞానం వచ్చి ఏం ప్రయోజనంలేదు..పోనీ ,తిట్టుకుంటే తిట్టుకోని మనకింత ముద్దపాడేస్తోందిగా ఎవరి పాపాన వారే పోతారు ప్రొద్దున్నేగా టివి లో ప్రసంగం విన్నాంగా..
అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు”అని సమాధాన పడతారు..ఈలోపు “మింగడానికి తగలడు”అని పిలుపు వినపడగానే , కిక్కురుమనకుండా వచ్చి అన్నంతిని కాలం గడుపుకుంటూ ఉండడం.. ఈదశ చివరి దశ ఇక్కడితో భర్త పాత్రకు శుభం పడుతుంది..!
అంకితం: భర్తగా మారిన వారికి.., భర్తగా మారాలనుకునే వారికి..,భర్తగా మారకూడదు ,అని అనుకునే వారికి.. ఈ వ్యాసం అంకితం..! దండాలు పెళ్ళైన వారికి, పూలు పెళ్ళి కాని వారికి. నేనేమీ మీకు ఉచిత సలహాలు గట్రా ఇవ్వడం లేదండి మరి. ఎవరిష్టం వారిది. చేసుకున్నవారికి చేసుకున్నంత.
బూరెల శరత్ బాబుమధిర
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com