ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Where is the happiness great story in Telugu
ఆనందం ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఓ కుర్రవాడు బయల్దేరాడు. దేశంలో చాలా రోజులపాటు తెగ తిరిగాడు. చివరికి సంతోషపు రహస్యం గురించి చెప్పగల ఒక పెద్దాయన గురించి విన్నాడు. ఆ పెద్దాయన ఫలానా పర్వతం మీద ఓ అందమైన భవంతిలో ఉంటాడని తెలిసింది.
ఆ ఇంటిని వెతుక్కుంటూ పర్వతాన్ని ఎక్కాడు. నిజంగానే ఆ పర్వతం మీద కళ్లు చెదిరిపోయే ఒక భవనం కనిపించింది. తన గమ్యాన్ని చేరుకున్నానన్న సంతోషంలో ఆ కుర్రవాడు హడావుడిగా భవంతిలోకి అడుగుపెట్టాడు. అక్కడ వందలాది మంది రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నారు. వారందరినీ దాటుకుని ఆ ఇంటి యజమాని దగ్గరకు చేరుకునేసరికి అతనికి చాలా సమయమే పట్టింది.
ఆ పెద్దాయన దగ్గరకి వెళ్లిన కుర్రవాడు, తన బాధనంతా ఏకరవు పెట్టాడు. సంతోషపు రహస్యం ఎలాగైనా తనకు చెప్పితీరాలని పట్టుపట్టాడు. కుర్రవాడు చెప్పినదంతా పెద్దాయన శ్రద్ధగా విన్నాడు. ‘నా పని పూర్తయ్యాక నీకు సంతోషపు రహస్యాన్ని తప్పకుండా చెబుతాను. ఈలోగా నువ్వు నా భవంతిని చూసిరా. అయితే ఒక చిన్న షరతు.
ఇదిగో ఈ చెంచా ఉంది చూశావు. అందులో రెండు చుక్కల నూనె ఉంది. ఆ చెంచాని పట్టుకుని నువ్వు తిరగాలి. తిరిగి వచ్చేసరికి అందులోని నూనె ఒలికిపోకూడదు. సరేనా!’ అన్నాడు పెద్దాయన. ‘ఓస్ అంతే కదా!’ అనుకున్నాడు కుర్రవాడు. ఆ చెంచాని పట్టుకుని భవంతి అంతా కలియతిరిగాడు.
ఓ రెండు గంటలు ఇంట్లోని మూలమూలలా తిరిగిన తర్వాత పెద్దాయన దగ్గరకి చేరుకున్నాడు. ‘వచ్చేశావా! నా ఇల్లు ఎలా ఉంది చెప్పు. అక్కడ వంటింట్లో తగిలించి పర్షియా కర్టెన్లు చూశావా? నా తోటమాలి పదేళ్లపాటు శ్రమించి రూపొందించిన అందమైన తోటని గమనించావా? నా గ్రంథాలయంలో ఉన్న అరుదైన తాళపత్రాలను పరిశీలించావా?…’ అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు.
పెద్దాయన అడిగిన ప్రశ్నలకి కుర్రవాడు చిన్నబోయాడు. ‘భవనం అంతా తిరిగాను కానీ… వాటన్నింటినీ అంత దగ్గరగా పరిశీలించలేకపోయాను. నా చేతిలోని నూనె చుక్కలు ఎక్కడ జారిపోతాయో అన్న భయంతో నిరంతరం చెంచా వంక చూసుకోవడమే సరిపోయింది,’ అంటూ సంజాయిషీ చెప్పాడు.
‘అయ్యయ్యో! ఎంత పని జరిగిపోయింది. నా ఇంటినే సరిగా చూడలేనివాడివి ఇక జీవితాన్ని ఏం చూడాలనుకుంటున్నావు. మరోసారి భవంతి అంతా కలియతిరిగి రా!’ అన్నారు పెద్దాయన. ఈ మాటతో సంబరంగా మరోసారి ఇల్లు కలియతిరగడానికి బయల్దేరాడు కుర్రవాడు.
ఈసారి ఇంట్లోని నలుమూలలూ క్షుణ్నంగా పరిశీలించాడు. అందులోని ప్రతి వస్తువులోనూ ఉన్న కళాత్మకతను ఆస్వాదించాడు. ఓ రెండుగంటల తర్వాత పెద్దాయన దగ్గరకి చిరునవ్వుతో వెళ్లి నిల్చొన్నాడు. ‘నీ వాలకం చూస్తే ఇంట్లోని ప్రతి అంగుళమూ చూసి వచ్చినట్లు ఉన్నావే!’ అన్నాడు పెద్దాయన.
‘అవునండీ!’ అంటూ ముసిముసిగా నవ్వుతూ బదులిచ్చాడు కుర్రవాడు. ‘కానీ ఈసారి చెంచాలో నూనె అంతా ఒలికిపోయింది చూశావా? జీవితం కూడా ఇంతే! దాన్ని ఆస్వాదించాలి అన్న ధ్యాసలోనే ఉంటే నీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేవు. నీ బాధ్యతల హోరులో పడిపోతే….. నీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించలేవు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది,’ అని చెప్పుకొచ్చాడు పెద్దాయన.