Menu Close

సంపాదిస్తే సరిపోదు – Financial Education in Telugu


సంపాదిస్తే సరిపోదు – Financial Education in Telugu

సంపాదించని వ్యక్తిని సమాజమే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా లోకువగా చూస్తారన్నది ఒక నానుడి. సంపాదిస్తేనే సరిపోదు, అది సద్వినియోగం అయితేనే సార్ధకత.

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

శివకుమార్ చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వ్యక్తి. చదువు పూర్తి కాగానే బతుకు తెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. తన ఖర్చులు పోగా కొంత మొత్తం ఇంటికి కూడా పంపేవాడు.

కొన్నాళ్ళకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చింది. గతంలో 20000 వచ్చే జీతం ఇప్పుడు 50000 అయింది. ఇంతకుముందు ఆర్టికల్ లో చెప్పుకున్న రాహుల్ మాదిరిగానే కుమార్ కు కూడా పాతికేళ్ల వయసులోనే 50000 ఉద్యోగం దొరికింది.

అంతలోనే పెళ్లి కుదిరి ఓ ఇంటివాడయ్యాడు కూడా. భార్య రాకతో సింగిల్ రూమ్ ఖాళీ చేసి.. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. అప్పటిదాకా కడుతున్న 3000 రెంట్ కాస్తా 8000 కు పెరిగింది. తప్పదుగా ..కొత్త కాపురం కావడంతో తను దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టి ఇంటికి అవసరమైన ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, బీరువా, ఓ పెద్ద టీవీ కొన్నాడు. పెళ్ళికి ముందే లక్షన్నర పెట్టి కొన్న బైక్ కి ఈఎంఐ (EMI) కడుతున్నాడు. అతనికున్న భారం ఏదైనా ఉందంటే ఇదొక్కటే.

Financial Education in Telugu - Young Indian Man

మరోపక్క అతనికున్న పెద్ద భరోసా క్రెడిట్ కార్డులు (Credit card) … జీతం పెరిగాక పడి ఉంటాయిలే అని ఓ నాలుగైదు బ్యాంకుల క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. వాటి లిమిట్ కూడా దాదాపు 3 లక్షల దాకా ఉంది. క్రెడిట్ కార్డు మీద 30000 ఖర్చు పెట్టి ఓ మొబైల్ కొనుక్కున్నాడు.

పెళ్లి అయ్యి ఏడాది కావడంతో వివాహ వార్షికోత్సవానికి భార్యకు లక్ష రూపాయలు పెట్టి ఓ నెక్లెస్ కొన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరు పిల్లలు పుట్టుకు రావడమే కాదు, వాళ్ళను స్కూల్లో చేర్పించాల్సిన టైం కూడా వచ్చింది. ఫీజులు కాస్త ఎక్కువైనా వెనకాడక కొంచెం ‘ఖరీదైన’ స్కూల్లోనే చేర్పించాడు.

మరోపక్క జీతం 80000 కు పెరగడం, బైక్ బాకీ తీరిపోవడంతో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులేవీ రాలేదు. ఒకవేళ వచ్చినా క్రెడిట్ కార్డులు వాడుతూ.. నెలనెలా కనీస మొత్తం కడుతూ వస్తున్నాడు. ఈనేపథ్యంలోనే సొంత ఇల్లు ప్లాన్ చేసి.. దాదాపు 70 లక్షలు పెట్టి ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు.

నెలకు 40000 రూపాయలు ఈఎంఐ పడుతోంది. ఇది పోను జీతంలో ఇంకో 40000 మిగులుతున్నా… ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, క్రెడిట్ కార్డు వాయిదాలు, ఊళ్ళో తల్లిదండ్రులకు పంపాల్సి ఉండటం.. ఇలా మొత్తం మీద వచ్చిన జీతం బొటాబొటీగా సరిపోతోంది. అయినా క్రెడిట్ కార్డులు ఉన్నాయన్న ధైర్యం అతన్ని పెద్దగా ఆందోళన పరచలేదు.

ఇంతలో ఊహించని సంఘటన..ఓరోజు ఆఫీస్ నుంచి వస్తూండగా.. దారిలో ఆక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. హాస్పిటల్ లో వారం రోజులు ఉండి ఇంటికొచ్చాడు. హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకోకపోవడంతో హాస్పిటల్ బిల్లు రెండున్నర లక్షలు అప్పోసొప్పో చేసి కట్టక తప్పలేదు.

మరోపక్క నాలుగు నెలల పాటు బెడ్ రెస్ట్. ఎర్న్డ్ లీవ్ లు ఓ రెండు నెలల పాటు ఆదుకున్నా… మిగతా రెండు నెలలపాటు లాస్ అఫ్ పే తప్పలేదు. చేతికి రూపాయి వచ్చే మార్గం లేదు. క్రెడిట్ కార్డుల్లో బాలన్స్ కూడా వాడేశాడు.

4 నెలల తర్వాత జాబ్ లో తిరిగి జాయిన్ అయ్యాడు. ఐదో నెల నుంచి శాలరీ రావడం మొదలయింది. కానీ జీవితం ఇదివరకటిలా లేదు. వచ్చే శాలరీ కి మించి కమిట్మెంట్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు అదనంగా క్రెడిట్ కార్డు బాకీల రూపంలో (మూడు లక్షలూ వాడేయడం వల్ల) నెలకు 15000 భారం (కనీస మొత్తమే కడుతున్నాడు అనుకుంటే) పడింది.

మరోపక్క గోటి చుట్టు మీద రోకటి పోటులా ఇద్దరు పిల్లలకూ తలో 50000 చొప్పున ట్యూషన్ ఫీజు కట్టాల్సి వచ్చింది గతంలో చేసిన అప్పుకు ఇది మరింత ఆజ్యం పోసింది. అప్పులు.. వడ్డీలు.. ఖర్చులు.. రానురాను భారం పెరిగిపోతూ వచ్చింది.

తట్టుకునే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. బ్యాంకుల్లో పర్సనల్ లోన్ కోసం ప్రయత్నించాడు. అప్పటికే ఇంటి లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు ఎక్కువగా ఉండటం వల్ల లోన్ రాలేదు. అయితే తన ఇంటి మీద టాప్ అప్ లోన్ వచ్చే అవకాశం ఉండటం తో దాన్ని ఆశ్రయించాడు.

ఓ రెండు లక్షలు వచ్చాయి. దాంతో చిన్న చిన్న అప్పులు తీర్చేశాడు. అయినా భారం తగ్గకపోగా… కొత్త లోన్ తో ఈఎంఐ మరింత పెరిగింది. కష్టాలు కూడబలుక్కుని వస్తాయి అన్నట్లు తండ్రి ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్ లో జాయిన్ చేయడంతో మరో 2 లక్షల దాకా ఖర్చయ్యాయి. ఇది కూడా అప్పే.

ఇక పిల్లలు క్లాస్ మారడంతో పెరిగిన ఫీజు తట్టుకోలేక.. అలాగని వాళ్ళని ఆ స్కూల్ మాన్పించలేక (ప్రెస్టేజ్ ఇష్యూ) అప్పుల మీద అప్పులు చేస్తూ పోయాడు. బాకీలు తీర్చే పరిస్థితి లేకపోవడంతో మెల్లగా క్రెడిట్ కార్డులు డిఫాల్ట్ అవ్వడం మొదలైంది. ఇది అక్కడితో ఆగలేదు. ఇంటి లోన్ కూడా బకాయి పడే దుస్థితి ఎదురైంది. మొదట భార్య నెక్లెస్ కుదువ పెట్టాడు.తర్వాత బండి అమ్మేశాడు. ఆనక ఇల్లు అమ్ముకునే పరిస్థితి దాపురించింది.

ఎన్నో కష్టాలుపడి జీవితంలో ఎదిగిన శివ కుమార్ చేసిన తప్పల్లా.. ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడమే. దీనికి దారి తీసిన కారణాల గురించి విశ్లేషించుకుంటే.

  • ముందుచూపుతో వ్యవహరించకపోవడం
  • సరైన ఆర్ధిక ప్రణాళిక లేకపోవడం
  • తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోవడం
  • పెట్టుబడులపై దృష్టి పెట్టకపోవడం
  • ఆరోగ్య, జీవిత బీమా ల గురించి ఆలోచించకపోవడం
  • జీవితంలో పూర్తిగా స్థిరపడక మునుపే వివాహ బంధంలోకి అడుగుపెట్టడం
  • పిల్లల చదువుల విషయంలో స్థాయికి మించి పరుగులు తీయడం
  • చేతిలో కాసిని డబ్బులు కనబడగానే తనకు లోటు లేదనుకునే భ్రమలో బతికేయడం
  • ఎక్కువగా క్రెడిట్ కార్డు ల మీద ఆధారపడటం
  • క్రెడిట్ కార్డుల విషయంలో కనీస మొత్తాలు మాత్రమే చెల్లిస్తూ రావడం వల్ల బాకీ ఎప్పటికీ తీరకపోవడం
  • అప్పుల మీద అప్పులు చేస్తూ అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడం… లోన్ ల కోసం ఎగబడటం
  • భవిష్యత్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే విధంగా పొదుపుపై దృష్టి పెట్టకపోవడం
  • స్థాయికి మించి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం…

కష్టాలన్నవి చెప్పి చెప్పి రావు. అవి ఎప్పుడొచ్చినా తట్టుకునే విధంగా జీవితంలో ఆర్ధిక క్రమశిక్షణ అలవరచుకుంటేనే ఎలాంటి ఒడుదొడుకులనైనా తట్టుకునే సామర్ధ్యం కలుగుతుంది. మొదట్లో కాస్త కష్టపడ్డా… పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగాలి. లేదంటే శివకుమార్ లా అప్పుల ఊబిలో చిక్కుకుపోయి విలవిలలాడుతాం.

Like and Share
+1
1
+1
0
+1
0
Posted in Financial Education

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading