ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
రామాయణం కోసం రాలేదు, రాముని కోసం వచ్చా – Devotional Telugu Stories
మహరాష్ట్రకు చెందిన సుప్రసిద్ధ కవి, భక్తుడు, సంఘసంస్కర్త అయిన ఏకనాథుడు ‘భావార్థ రామాయణం’ రాస్తున్న రోజుల్లో రామకథ వినేందుకు ఆయన వద్దకు ఆసక్తిపరులు వచ్చేవారు. అలాంటి రోజుల్లో ఓ అజ్ఞాత వ్యక్తి ఏకనాథుడి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. అప్పుడు ఏకనాథుడు రామాయణ రచనకు సంబంధించిన ఇబ్బందుల్లో ఉన్నాడు. అరణ్యకాండ ముగింపు దశలో లేఖిని ఆగిపోయింది. ధార ముందుకు సాగలేదు.
అప్పుడు వచ్చిన అజ్ఞాత వ్యక్తి…. తాను రామాయణం కోసం రాలేదన్నాడు. రాముడి కోసం వచ్చానన్నాడు. ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతున్న ఏకనాథుడికి అర్థం కాలేదు. ‘అయ్యా, నాకు రాముడు కలలో కనిపించి చెప్పాడు…. ఆయన కృష్ణకాంతుడి పేరుతో తమరి ఇంటి పనులు చేస్తున్నాడట’ అన్నాడా అజ్ఞాత వ్యక్తి. ఏకనాథుడు నివ్వెరపోయాడు. కృష్ణకాంతుణ్ని పిలిచాడు. సేవకుడు ఇంట్లో లేడని, నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాడని తెలుసుకున్నాడు.
ఏకనాథుడు అదాటున లేచాడు. ఉన్మాదిలాగా కేకలు పెడుతూ ఉరకలెత్తాడు. కృష్ణకాంతుడి జాడ లేదు. తాను వచ్చిన పని పూర్తయిందని కాబోలు, కానరాకుండా జారిపోయాడు. ఏకనాథుడు కరిగి కన్నీరయ్యాడు. హృదయం ద్రవించేలాగా విలపించాడు. ‘కరుణించు రామా.. మన్నించు ప్రభూ’ అంటూ ప్రార్థించాడు.
కన్నీటితో బరువెక్కిన గుండె కర్తవ్య పథాన్ని చూపించింది. నిలిచిపోయిన లేఖిని కదిలింది. అరణ్యకాండ ముగింపులో తన సృజనకు పరీక్ష పెట్టిన… ‘శబరి ఘట్టం’ చకచకా పూర్తయింది. ఆది కావ్యమైన రామాయణ రచనకు బీజం పడింది కూడా తడిబారిన గుండెలోనే! వేటగాడి బాణం దెబ్బకు పక్షుల జంటకు వాటిల్లిన ఎడబాటును చూసి కలత చెందిన వాల్మీకి మహర్షి నోట ఛందోబద్ధంగా వెలువడ్డ శ్లోకం మర్యాదా పురుషోత్తముడి కథకు తెర తీసింది.
మానవ సంబంధాల్లో విలువలను పొదిగి, మానవాళికి ఆదర్శంగా నిలిచింది. భాగవత రచన పూర్వ వేదికలో వ్యాసమహర్షి అనుభవం కూడా ఇటువంటిదే! ఆయన వేద రాశిని విభజించాడు. మహాభారతాన్ని రచించాడు. ఆత్మతృప్తి కలగలేదు. హృదయం బాధాతప్తమైంది. అప్పుడు నారద మహర్షి రాకతో భాగవత రచన ఊపిరి పోసుకుంది.
అదే విధంగా భాగవతాన్ని శుకమహర్షి ద్వారా పరీక్షిన్మహారాజు వినడం వెనక కూడా ఆర్ద్రమైన సంఘటన ఉంది. చేసిన తప్పునకు పరీక్షిన్మహారాజు పశ్చాత్తాపం చెందాడు. జాలిగొన్న హృదయంతో శుకయోగి భగవత్ తత్త్వాన్ని, భక్తుల గాథలను బోధిస్తే- శ్రద్ధ మూట కట్టుకుని విన్నాడు. భవసాగరాన్ని దాటాడు.
పురాణాలను, కావ్యాలను తరచి చూస్తే ఇటువంటి ఉదాహరణలు అనేకం! మనిషి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమించవచ్చు. అంతరిక్షంలో నివాసం ఏర్పరచుకునే స్థాయికి చేరుకోనూ వచ్చు. కానీ, అంతరంగంలో కారుణ్యం పెల్లుబకాలి. సారవంతమైన నేల వంటి బుద్ధికి ఆర్ద్రత తోడవాలి. అప్పుడు మహాత్ములు ఆశించినట్లు పాశ్చాత్య మేధ, భారతీయ హృదయం ఒకటవుతాయి. ప్రపంచాన్ని శాంతి కాంతి జయిస్తుంది.