Menu Close

దీపావళి నుంచి రెండోరోజున – అన్నాచెల్లెళ్ల పండుగ


యమవిదియ (అన్నాచెల్లెళ్ల పండుగ) – భగినీ హస్త భోజనం

భారతీయ సంప్రదాయంలో రక్త సంబంధాలకీ, అనుబంధాలకీ ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రాధాన్యతను ఇవ్వడమే కాదు, వాటిని కలకాలం నిలుపుకొనేందుకు చక్కటి ఆచారాలను కూడా అందించారు మన పెద్దలు. అందుకు గొప్ప ఉదాహరణే భాతృవిదియ! ఇది దీపావళి నుంచి రెండోరోజున వస్తుంది.

అనగనగా యమునానదికి తన అన్నగారి మీద బెంగపట్టుకుందట. ఆ అన్నగారు ఎవరో కాదు… సాక్షాత్తూ మృత్యువుని అమలుపరిచే యమధర్మరాజు! అందుకే యమునను యమి అని కూడా పిలుస్తారు. య‌ముడు త‌న ఇంటికి వ‌చ్చి చాలా రోజులైంది కాబ‌ట్టి, ఓసారి వ‌చ్చి వెళ్ల‌మ‌ని గంగాన‌ది ద్వారా య‌ముడికి క‌బురుపెట్టింది య‌మున‌.

క‌బురు విన్న అన్న‌గారు వెంట‌నే య‌మునాదేవి ఇంటికి వెళ్లారు. అక్క‌డ య‌మున‌ ఆయ‌న‌ను సాద‌రంగా ఆహ్వానించి, క‌డుపునిండా భోజ‌నం పెట్టింది. చెల్లెలి అనురాగానికి సంతోషించిన య‌ముడు, ఏం వ‌రం కావాలో కోరుకోమ‌న్నాడ‌ట‌. అందుకు య‌మున నువ్వు ఏటా ఇదే రోజున మా ఇంటికి వస్తే చాలు. అదే గొప్ప వ‌రం అంది. య‌ముడికి అంత‌కంటే కావ‌ల్సింది ఏముంది! ఆ వ‌రానికి త‌థాస్తు చెప్ప‌డ‌మే కాదు, ఎవ‌రైతే ఆ రోజున త‌న సోద‌రి ఇంట్లో భోజ‌నం చేస్తారో వాళ్లు అకాల‌మృత్య‌వు నుంచీ, న‌ర‌క‌లోకం నుంచీ శాశ్వ‌తంగా త‌ప్పుకుంటార‌ని చెప్పాడ‌ట‌.

ఇక ఈ రోజున తన సోదరులని సేవించుకున్న సోదరికి వైధవ్యం ప్రాప్తించదు అని కూడా వరాన్ని అందించాడట. అందుకే ఈ రోజుని యమద్వితీయం అని పిలుస్తారు. నరకాసురుని సంహరించి వచ్చిన శ్రీకృష్ణుని అతని సోదరి సుభద్ర సాదరంగా ఈ రోజునే ఆహ్వానించిందనీ, అందుకు గుర్తుగా భాతృవిదియ మొదలైందని కూడా చెబుతారు.

ఆడపిల్లలకి పెళ్లి అయిపోగానే తమ పుట్టింటి నుంచి దూరం అవుతారు. పురుళ్లూ పుణ్యాలకు హడావిడిగా రావడమే కానీ, తల్చుకున్నప్పుడు ఓసారి తన పుట్టింటివాళ్లను చూసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇక వాళ్ల సోదరుల పరిస్థితీ అలాగే ఉంటుంది. బావమరదులుగా ఎంత బతకకోరినా, వీలైనప్పుడల్లా సోదరి ఇంటికి వెళ్లే స్వాతంత్ర్యం, అవకాశం ఉండకపోవచ్చు. తన సోదరి కాపురం ఒక్కసారి చూడాలని వారికీ, తన సోదరునికి ఒక్కసారి కడుపారా భోజనాన్ని పెట్టాలన్న తపన వీరికీ తీరని కోరికగానే మిగిలిపోతుంది.

అందుకే ఈ భాతృవిదియను ఏర్పరిచారు మన పెద్దలు. దక్షిణాదిన ఈ పండుగను కాస్త తక్కువగానే ఆచరిస్తారు కానీ, ఉత్తరాదికి వెళ్లే కొద్దీ ఈ పండుగ ప్రాముఖ్యం మరింతగా కనిపిస్తుంది. నేపాల్‌లో అయితే ఆ దేశ ముఖ్య పండుగలలో దీన్ని కూడా ఒకటిగా ఎంచుతారు.ఉత్తరాదిన ఈ పండుగను భాయిదూజ్‌, భాయిటీకా, భాయితిహార్‌… వంటి భిన్నమైన పేర్లతో పిలుచుకుంటారు. దీపావళి పండుగ వీరికి భాతృవిదియతోనే ముగుస్తుంది. ఈ రోజుకి సోదరులంతా తమ సోదరి ఇంటికి తప్పక చేరుకుంటారు. అక్కచెల్లెళ్లు తమ అన్నదమ్ముల నుదుటిన తిలకాన్ని అద్దుతారు.

నేపాల్‌లో అయితే ఏడురకాల రంగులలో సోదరుని తిలకాలను అద్దుతారు. తిలకధారణ తరువాత సోదరులకు హారితులందిస్తారు. బదులుగా అన్నదమ్ములంతా కొండంత ఆశీస్సులనూ, బహుమతులనూ తిరిగిస్తారు. ఆ మధ్యాహ్నం తమ సోదరులకు ఇష్టమైన పదార్థాలను కొసరి కొసరి వడ్డిస్తారు. సోదరి చేతివంటను తృప్తిగా ఆరగించిన సోదరులు, తమ అక్కచెల్లెళ్ల ఇంట ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలనీ, వారి కడుపు పండాలనీ, కాపురం పదికాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ బయల్దేరతారు. అన్నాచెల్లెళ్లనూ, అక్కాతమ్ముళ్లనూ ఒకచోటకి చేర్చే ఈ సంప్రదాయం ఎంత గొప్పదో కదా

Like and Share
+1
0
+1
1
+1
0
Posted in Telugu Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading