Best Story in Telugu – Lakshmi Devi Stories in Telugu – ఒకసారి లక్షీదేవి ఒక వ్యక్తి పై కోపగించుకొని “ఈ ఇంటినుండి వెళ్లి పోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను. అడుగు!” అని అంటుంది.
అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు… “అమ్మా నీవు వెళ్లుతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు వున్నచోట ఒకరు వుండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ *మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే వుండేటట్లు వరం ఇవ్వమ”ని అంటాడు.* ‘తథాస్తు!’ అని లక్ష్మీదేవి ఆ ఇంటినుండి వెళ్లిపోతుంది.
కొన్నిరోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్ళలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమై పోతుంది. ఇంకొంతసేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తనుకూడ ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరేపనిలో పడిపోతుంది.
ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు తమ పనిలోపడి ఉప్పు వేశారో లేదో అని తనూ కొంత వేస్తుంది. మధ్యాహ్నం ఆవ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువయిందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమి మాట్లాడకుండా తిని లేస్తాడు. కొంత సేపటికి ఆ వ్యక్తి పెద్దకొడుకు కూడ భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి ‘నాన్న గారు తిన్నారా?’ అని భార్యను అడుగుతాడు.’తిన్నారు!’ అని చెబుతుంది.
దానితో ‘నాన్న ఏమీ అనకుండ తిన్నాడు. నేనెందుకు అనాలి?’ అని ఏమి మాట్లాడకుండ తనూ తిని లేస్తాడు. ఇలా ఆ ఇంటి వాళ్లంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండ వుంటారు. ఆరోజు సాయంత్రం *దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ‘నేను ఇక్కడ ఉండలేను వెళ్లిపోతున్నాను. ఉప్పు కశాయం అయిన వంట తిని కూడ మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటు వంటి చోట నేనుండను!’ అని వెళ్లిపోతుంది.
దరిద్ర దేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొంటుంది. కనుక, ఏ ఇంటిలో ‘ప్రేమ, అప్యాయతలు మరియు శాంతి’ కళకళలాడుతూ వుంటాయో ఆ ఇల్లు లక్ష్మీనివాసం’ అవుతుంది.
Best Story in Telugu – Lakshmi Devi Stories in Telugu – Devotional Stories in Telugu
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.