పాజిటివ్ ఆటిట్యూడ్‌ను పెంచుకోండి – అద్బుతమైన కథ – Be Positive
ఒకరోజు శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు, ధర్మరాజు వెళ్తారు. అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడితో మాట్లాడుతూ.. ‘నాకు వంద మంది సోదరులు ఉన్నారు. అందరికీ నేనే అండగా నిలిచాను. ధర్మరాజు మాత్రం తమ్ముళ్లపై ఆధారపడ్డాడు. ఆయన వల్ల తమ్ముళ్లకు నష్టం తప్ప జరిగిన లాభం లేదు.

జూదం తప్పని తెలిసి నేను ఆడకుండా మా మామతో ఆడించాను. అదే ధర్మరాజు నేరుగా జూదంలో దిగాడు చివరికి భార్యను కూడా అడ్డుగా పెట్టాడు. అయినా ధర్మరాజునే మంచి వాడని అందరూ అంటారు. అసలు ఎందుకిలా’ అని ప్రశ్నిస్తాడు.
దీనికి కృష్ణుడు బదులిస్తూ ‘నేను సమాధానం చెప్తా కానీ ముందు మీరుద్దరికీ ఒక పని చెప్తాను, చేస్తారా’.? అంటారు. హా సరే చేస్తామని చెప్తారు. ముందు దుర్యోధనుడితో మాట్లాడుతూ.. ‘దుర్యోధన నువ్వు వెళ్లి నీకంటే 5గురు మంచి వారిని తీసుకురా అని’ చెప్తారు. అదే విధంగా ధర్మరాజుతో.. ‘నువ్వు వెళ్లి నీకంటే ఐదుగురు చెడ్డ వాళ్లను తీసుకురమ్మని’ చెప్పి వారిని అక్కడి నుంచి పంపిస్తారు.
అయితే సాయంత్రానికి ఇద్దరూ ఖాళీ చేతులతో వస్తారు. దీంతో దుర్యోధనుడిని ఏమైంది.? ఎవ్వరినీ తీసుకురాలేదేందుకు అని ప్రశ్నించగా.. ‘నా కంటే మంచి వారు ఒక్కరూ కనిపించలేదు. ప్రతీ ఒక్కరిలో నాకంటే ఏదో ఒక చెడ్డ గుణం కనిపించింది. అందుకే ఖాళీ చేతులతో వచ్చాను’ అని బదులిస్తాడు.
ఇక ధర్మరాజు సమాధానం ఇస్తూ.. ‘నాకంటే చెడ్డవారు ఎవరైనా ఉన్నారా? అని వెతికాను కానీ నాకంటే చెడ్డవారు ఎవరు కనిపించలేదు. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక మంచి గుణం కనిపించింది. అందుకే ఎవరినీ తీసుకురాలేదని సమాధానం చెప్తాడు’.
ఇదంతా విన్న కృష్ణుడు.. ‘చూశావా దుర్యోధన నువ్వు మనుషుల్లో చెడు గుణాల్ని చూశావు కాబట్టి నీకు ఎవరు దొరకలేదు. అదే విధంగా ధర్మరాజు మనుషుల్లోని మంచి గుణాలు చూశాడు అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు, ప్రజలంతా ఆయనను కీర్తిస్తున్నారు. ఇదే మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా’ అని చెప్తాడు. దీంతో దుర్యోధనుడికి అసలు విషయం బోధపడుతుంది.
నీతి(Be Positive): ప్రస్తుతం సమాజంలో నెగిటివిటీ పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా తప్పులను ఎంచే వారి ఎక్కువుతున్నారు. అందుకే పాజిటివ్ ఆటిట్యూడ్‌ను పెంచుకోవాలని చెబుతున్నారు. ప్రతీ మనిషిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. దానిని గుర్తిస్తే మనలో కోపం, అసూయ అనే భావోద్వేగాలకు అసలు తావే ఉండదనే గొప్ప సందేశాన్ని ఈ కథ చెబుతోంది.
భగవద్గీత చెప్పే జీవిత పాఠాలు – Life Lessons from Bhagavad Gita