అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
చిన్న కథలు, పొట్టి కథలు, నీతి కథలు
మందతో పాటు ఒక గొర్రె, గడ్డి మేస్తూమేస్తూ తప్పిపోయింది. గడ్డి తీయదనాన్ని ఆస్వాదిస్తున్న గొర్రె, తన దగ్గరకు ఒక తోడేలు రావడం చూడలేదు. తోడేలు గొర్రె మీదికి దూకబోయే సమయానికి గొర్రె గుర్తించి “ఆగాగు!! నన్ను చంపొద్దు!” ప్రాధేయపడింది. “నీవు నా ఆహారానివి, నిన్ను చంపి తినడం నా జన్మహక్కు.” అని తోడేలు హూంకరించింది.
గొర్రె దీనంగా వేడుకుంది, “ఇప్పుడే గడ్డి కడుపు నిండా తిన్నాను. ఆ గడ్డి వల్ల నా మాంసం రుచిగా ఉండదు. కొద్దిసేపు ఆగితే, గడ్డి జీర్ణమై మాంసం రుచిగా మారుతుంది.” గొర్రె తప్పించుకోలేదని రూఢీ చేసుకుని గొర్రె పక్కనే కూర్చుంది. కొంచెం సేపటికి గొర్రె, “నాకు డాన్స్ వచ్చు. అవకాశం ఇస్తే నేను తిన్న గడ్డి త్వరగా అరుగుతుంది.” దానికి తోడేలు ఒప్పుకుంది.
అది నాట్యం చేసేటప్పుడు మెడలో ఉన్న గంట ‘ఘల్లు ఘల్లు’ మని మ్రోగింది. కానీ ఆ శబ్దం అంత గట్టిగా వినబడడం లేదు. ఇప్పుడు ఇంకొక కొత్త ఉపాయం గొర్రెకు తోచింది. మెడలో గంట తీసి తోడేలు చేతికిచ్చి, “దీన్ని ఎంత గట్టిగా వాయిస్తే అంత వేగంగా నాట్యం చేస్తాను. నీవు సులభంగా తినేయవచ్చు..” అని ఊరించింది.
ఎప్పుడెప్పుడు గొర్రెను భోంచేద్దామా అని చూస్తున్న తోడేలు వేరే ఆలోచన లేకుండా ఆ గంట తీసుకొని వీలైనంత గట్టిగా వాయించిది. గొర్రెల కాపరి ఈ శబ్దం విని తన కుక్కలను ఆ తప్పిపోయిన గొర్రె వైపు పంపాడు. కుక్కలు గొర్రెను కొనుక్కొని పెద్దగా మొరగటం మొదలు పెట్టాయి. ఈ వేటకుక్కల అరుపులకు తోడేలు భయపడి కాళ్లకు బుద్ధి చెప్పింది.
బలహీనుడు, అమాయకుడు అయిన వ్యక్తి, ధైర్యంగా, తెలివిగా, ఆలోచించగలిగితే క్లిష్టమైన సమస్యల నుండి రక్షించుకోవచ్చు.
సేకరణ – V V S Prasad