ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Motivational Telugu Short Stories
ఒక సారవంతమైన నేలలో రెండు విత్తనాలు పక్కపక్కనే ఉన్నాయి. అందులో ఒకటి ఈ విధంగా చెప్పింది. “నాకు బాగా ఏపుగా ఎదగాలని ఉంది. నా వేళ్ళు భూమి లోపలి పొరలలోకి చొచ్చుకొని పోయి, నా మొలకలు భూమి పైన అందంగా, ఆరోగ్యంగా పెరిగేలా చూడాలి. నాకు పూసిన లేత మొగ్గలు, పూలతో వసంత రుతువు ఆగమనాన్ని చాటాలని అనుకుంటున్నాను. సూర్యుడి వేడిమి నా ముఖం మీద పడ్డప్పుడు ఆ వెచ్చదనాన్ని ఆస్వాదించాలని ఆకాంక్ష. నా పూల రెక్కల మీద వాలిన మంచు బిందువుల ఆశీస్సులతో పులకరించాలి.
“ఆ విత్తనం తన ఆశయాలకు అనుగుణంగా పెరిగింది. రెండవ విత్తనం, “నాకు చాలా భయంగా ఉంది. నా వేళ్ళను భూమి పొరల్లోకి పంపితే, ఆ చీకట్లో ఏం ఎదుర్కోవలసి వస్తుందో?? గట్టిగా నేలను చీల్చుకు పోయే ప్రయత్నిస్తే మొలకలకు ఏ గాయాలౌతాయో, ఏమో ?? నా మొగ్గలను కీటకాలు, నత్తల వంటివి తినేస్తాయేమో ?? పూలుగా విరబూస్తే అందరూ కోసేస్తారేమో? అందుకే కొన్నాళ్ళు ఆగడం మంచిది ! అంతా బాగుంటే, అప్పుడు మొలకెత్తుతాను.” అంటూ మంచి సమయం కోసం కాచుకుని ఉండి పోయింది. ఈ లోపల ఒక కోడిపుంజు పురుగులు, గింజల కోసం వెతుక్కుంటూ ఈ గింజను నోట కరిచి గుటుక్కు మనింది.
ఉన్నతంగా ఎదగడానికి తగ్గ రిస్క్, చొరవ తీసుకోవడానికి భయపడి ఉన్న చోటే ఉండిపోతే, కఠినమైన జీవితపు కోరల్లో చిక్కుకుని నలిగి పోతారు.
సేకరణ – V V S Prasad