ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కళాప్రపూర్ణ గుమ్మడి వెంకటేశ్వరరావు, గుమ్మడి పేరు తలచుకోగానే ఈ నాటికీ ఆయన పోషించిన వందలాది వైవిధ్యమైన పాత్రలే ముందుగా మన మదిలో మెదలుతాయి. గుమ్మడి తన చివరి రోజుల్లో చిత్రసీమలో తన అనుభవాలను “తీపి జ్ఞాపకాలు – చేదు గుర్తులు’ పేరుతో రాసుకున్నారు.
వందలాది చిత్రాలలో తనకు లభించిన ప్రతీపాత్రకూ న్యాయం చేస్తూ నటించిన మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయన ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా, అందులో తన జాడ కనిపించకుండా పాత్ర నీడనే చూపించేవారు. మన దేశం గర్వించదగ్గ ‘మెథడ్ ఆర్టిస్ట్స్’లో గుమ్మడికి సైతం ప్రత్యేక స్థానం ఉంది. అనేక విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా నటించిన గుమ్మడికి ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రం ఎనలేని పేరు సంపాదించి పెట్టింది. ఈ చిత్రం ద్వారా ఆయనకు రాష్ట్రపతి బహుమతి కూడా లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. రాష్ట్రప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తో గౌరవించింది. సాత్వికాభినయంలో తనకు తానే సాటి అనిపించుకున్న గుమ్మడి పేరు తలచుకోగానే ఆయన ధరించిన అనేక వైవిధ్యమైన పాత్రలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. అదీ గుమ్మడి అభినయంలోని ప్రత్యేకత!
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గుమ్మడి వెంకటేశ్వరరావుకు బాల్యం నుంచీ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలనే తపన ఉండేది. ఎస్.ఎస్.ఎల్.సి. దాకా చదువుకున్న గుమ్మడికి పుచ్చలపల్లి సుందరయ్య ఉపన్యాసాలు భలేగా నచ్చేవి. దాంతో గుమ్మడి కూడా కమ్యూనిస్టు భావజాలాన్ని ఒంటపట్టించుకున్నారు. కాలేజీలో చేరితే చెడిపోతాడని భావించిన గుమ్మడి కన్నవారు ఆయనకు 17 ఏళ్ళ వయసులోనే పెళ్ళి చేశారు. చివరకు ఎలాగోలా హిందూ కళాశాలలో చేరి ఇంటర్ చదివారు. ఇంటర్ పాస్ కాకపోవడంతో వ్యవసాయంలో దింపారు పెద్దలు. వ్యవసాయం చేస్తూనే పుస్తకాలను విపరీతంగా చదివేవారు గుమ్మడి. ఆ సమయంలోనే ఆయన మనసు నటనవైపు మళ్ళింది. మెల్లగా నాటకాలు వేయసాగారు. తరువాత మిత్రుల ప్రోత్సాహంతో మదరాసు చేరి, సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘అదృష్టదీపుడు’ చిత్రంలో తొలిసారి గుమ్మడి తెరపై కనిపించారు.
‘అదృష్ట దీపుడు’ తరువాత గుమ్మడి నటించిన చిత్రాలేవీ అంతగా ఆయనకు పేరు సంపాదించి పెట్టలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ స్వస్థలం పోదామని నిర్ణయించిన గుమ్మడికి, యన్టీఆర్ తమ ఎన్.ఏ.టి. సంస్థ నిర్మించిన చిత్రాలలో మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. అలా రామారావు సొంత చిత్రాలు – “పిచ్చి పుల్లయ్య, తోడుదొంగలు, జయసింహ” లో గుమ్మడి కీలక పాత్రలు పోషించారు. ఆ తరువాత గుమ్మడి మరి వెనుదిరిగి చూసుకోలేదు. ‘తోడుదొంగలు’లో గుమ్మడి వయసు మీరిన పాత్ర ధరించడం చూసిన పి.పుల్లయ్య తన ‘అర్ధాంగి’ చిత్రంలో ఏయన్నార్, జగ్గయ్యకు తండ్రిగా నటించే పాత్రను గుమ్మడికి ఇచ్చారు. తన కన్నా వయసులో పెద్దవారయిన నటులకు తండ్రిగా నటించడంతో అప్పటి నుంచీ గుమ్మడికి అధికంగా తండ్రి పాత్రలే పలకరించసాగాయి. ఒకే రకం పాత్రలు ధరించినా, వాటిలో తనదైన బాణీ ప్రదర్శించడానికి గుమ్మడి ప్రయత్నించేవారు. గుణచిత్ర నటునిగా గుమ్మడి తిరుగులేని వైభవం చూశారు. ప్రతినాయక పాత్రల్లోనూ తేనె పూసిన కత్తిలా నటించడంలో గుమ్మడి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కడదాకా తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలనే తపించారు గుమ్మడి. ఆయన చివరి చిత్రంగా ‘అవధూత కాశినాయన చరిత్ర’ నిలచింది.
గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. హైద్రాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో 2010, జనవరి 26 న ఆరోగ్యం క్షీణించి మరణించాడు. అతను చివరిగా మాయాబజార్ (రంగులలోకి మార్చిన) ప్రదర్శించినప్పుడు ప్రజల మధ్య గడిపాడు. “ఆ గొప్ప సినిమాను రంగులలో చూడటానికేమో, నేను ఇంత దీర్ఘకాలం బ్రతికి వున్నాను” అని సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం. 1998 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డు నిచ్చి సత్కరించింది. 1982 : మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం చేత గౌరవించబడ్డాడు.