ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
About Sammakka Saarakka Jaathara in Telugu, About Medaram Jatara in Telugu
ఆ జాతర అడవి తల్లులది. కానీ.. అంతర్జాతీయ ఖ్యాతి. ఆ ఉత్సవం కొండకోనల్లో జరుగుతుంది. అయితేనేం, తండోపతండాలుగా భక్తులు. తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఘనంగా జరుగనుంది. ఈ నేపథ్యంలో మేడారం జాతరపై ప్రత్యేక కథనం.
కాకతీయ సైన్యం లక్నవరం సరస్సు దగ్గర స్థావరం ఏర్పాటుచేసుకుని యుద్ధానికి దిగింది.
పగిడిద్దరాజు, అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి, పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న ఆత్మాభిమానంతో సంపెంగ వాగులో పడి ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి సమ్మక్క పరాశక్తి అవతారమెత్తింది. ఓటమి తప్పదని కాకతీయ సైనికులు దొంగచాటుగా బల్లెంతో పొడిచారు. సమ్మక్క యుద్ధభూమి నుంచి చిలుకల గుట్టకు వెళ్లి అదృశ్యమైంది.
విగ్రహారాధన లేదు, సమ్మక్క అదృశ్యమైన గుట్ట ప్రాంతంలో నాగవృక్షం దగ్గర ఒక కుంకుమ భరిణె లభించింది. ఆ భరిణెనే సమ్మక్కగా భావించి రెండేండ్లకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజున పండుగ జరుపుకొనేవారు. అదే కాలక్రమేణా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరగా రూపాంతరం చెందింది. పగిడిద్ద రాజు.. సారలమ్మ.. నాగులమ్మ.. జంపన్న.. గోవిందరాజు కూడా దైవ స్వరూపాలు అయ్యారు.
నాలుగు రోజులపాటు ఈ జాతర ఘనంగా జరుగుతుంది. తొలిరోజున సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరుకుంటారు. గిరిజన సంప్రదాయంలో విగ్రహారాధన ఎక్కడా కనిపించదు. వెదురుకర్ర, కుంకుమ భరిణె తదితర ప్రతీకలే ఇక్కడ ఉత్సవ మూర్తులు. అప్పట్లో నెమలినార చెట్టు ఉన్న ప్రాంతమే నేటి గద్దె అని చెబుతారు.
సారలమ్మ రాక, సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలోని చిన్న దేవాలయంలో సారలమ్మ కొలువై ఉంది. ఫిబ్రవరి 16 జాతరలో మొదటి రోజు. ఉదయాన్నే పూజారులు రెండు గంటలపాటు పూజలు నిర్వహించిన అనంతరం, సారలమ్మను కన్నెపల్లి నుంచి కాక వంశస్తులు గద్దె వద్దకు తీసుకొస్తారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి బయలుదేరి వస్తాడు. పగిడిద్దరాజును పెనక వంశీయులు తీసుకొస్తారు. సారలమ్మ భర్త గోవిందరాజులను కొండాయి నుంచి మేడారంలోని గద్దెకు తీసుకొస్తారు. గోవిందరాజులను కూడా పెనక వంశస్తులే తీసుకొస్తారు.
భక్తులు తడిబట్టలతో గుడి ఎదుట తల్లికి వందనం సమర్పిస్తారు. దేవతారూపాన్ని చేతబట్టుకుని బయటికి వచ్చిన పూజారులు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న వారిపై నుంచి నడిచి వెళ్తారు. సారలమ్మే తమపైనుంచి వెళ్తున్న అనుభూతితో భక్తులు తరించిపోతారు. మంగళహారతులు, కొబ్బరి కాయలతో పూజలు చేసి సారలమ్మను మేడారానికి సాగనంపుతారు. అక్కడినుంచి సారలమ్మను తీసుకుని బయల్దేరిన పూజారులు జంపన్న వాగునుంచి నేరుగా మేడారంలోని సమ్మక్క గద్దెల వద్దకు తీసుకొస్తారు. అంతకుమునుపే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్లలోని బృందం పగిడిద్దరాజుతో బయల్దేరుతుంది.
దాదాపు తొంభై కిలోమీటర్లు నడిచి జాతర నాటికి మేడారానికి వచ్చేస్తుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగిడిద్దరాజు ప్రత్యక్షం అవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజులు ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో కొలువై ఉంటాడు. జాతర రోజు ఉదయమే గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకుని ఊరేగింపుగా మేడారానికి బయల్దేరతారు. అలా ఒకే రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులస్వామి గద్దెలపైకి చేరుకుంటారు.
కుంకుమ భరిణే దేవత, రెండో రోజు అధికార లాంఛనాలతో పోలీసుల తుపాకీ కాల్పుల గౌరవ వందనం, ఎదురుకోళ్ల ఘట్టంతో భక్తులు సమ్మక్కను ఆహ్వానిస్తారు. ఉదయమే పూజారులు వనానికి వెళ్లి వెదురుకర్రలు తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. అనంతరం సమ్మక్క పూజా గృహం నుంచి వడ్డెలు పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. పోలీసు భద్రత మధ్య పూజారులు సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు.
మేడారానికి ఈశాన్యాన చిలకల గుట్టపై నారచెట్టుకింద ఉన్న కుంకుమ భరిణె రూపంలోని సమ్మక్కను తెచ్చేందుకు పూజారులు బయల్దేరుతారు. ఈ సమయంలో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంటుంది. ఆనవాయితీలో భాగంగా మేడారంలోని చిలుకల గుట్టపై ఉన్న సమ్మక్క దేవతను కొక్కెర వంశస్తులు కుంకుమ భరిణె రూపంలో మేడారంలోని గద్దెకు తీసుకొస్తుంటారు. జాతర మొత్తానికి ప్రధాన దేవత అయిన సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది భక్తులు చిలకల గుట్ట సమీపంలో పోగవుతారు.
తల్లిని కనులారా చూడాలని తపిస్తారు. మహిమాన్వితమైన కుంకుమ భరిణెను తాకేందుకు ప్రయత్నిస్తారు. చిటారుకొమ్మలెక్కి తల్లిరాకకోసం ఎదురుచూస్తారు. ప్రధాన పూజారి ఒక్కరే చిన్న కాలిబాటన నడుచుకుంటూ చిలకల గుట్టపైకి వెళ్తాడు.
తిరిగి వనంలోకి ఉత్సవ మూర్తులంతా గద్దెలపై కొలువై మూడో రోజు అందరికీ దర్శనం ఇస్తారు. మహాజాతరలో ఈ మూడో రోజే అత్యంత కీలకం. తర్వాతి రోజు… అంటే జాతరలో చివరి రోజు వన దేవతలను మళ్లీ వనంలోకి సాగనంపుతారు. పూజారులు దేవతలను వనప్రవేశం చేయించడంతో మహాజాతర పరిపూర్ణం అవుతుంది. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క, సారలమ్మలు మూడోరోజు అశేష జనావళికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం భక్తులు తల్లులను దర్శించుకుంటారు. కానుకలు, మొక్కులు సమర్పించుకుంటారు. తలనీలాలు, తులాభారాలు జరిపిస్తారు. మహిళలు ఒడిబియ్యం పోసి కొలుచుకుంటారు. చీరసారెలు పెట్టి పూజిస్తారు.
దర్శనానికి వచ్చిన లక్షలాది మందితో గద్దెల ప్రాంగణాలు జన సముద్రమవుతాయి. ఆస్తి, కుల, మత భేదాలు లేకుండా అన్ని వర్గాల భక్తులు సమ్మక్క సారలమ్మలకు మొక్కులు అప్పగించుకోవాల్సిందే. వన దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటినే మొక్కులుగా సమర్పిస్తారు. భక్తులు తమ ఎత్తు బెల్లాన్ని బంగారంగా అమ్మ వార్లకు సమర్పిస్తారు. సారలమ్మ రాకతో ప్రారంభమై అమ్మల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ జాతర గిరిజనుల హృదయావిష్కరణ. ప్రతి అడవిబిడ్డలో అమ్మ ఒడిని చేరిన ఆనందం. తిరిగి వెళ్తున్నప్పుడు.. ఆ కండ్లనిండా వెలుగు. ఆ వెలుగులో- సమ్మక్క, సారలమ్మలు!
ఎదురుకోళ్లతో స్వాగతం, చిలకల గుట్టపై రహస్య ప్రదేశంలో నిక్షిప్తమై ఉన్న సమ్మక్క దగ్గర సుమారు మూడు గంటలపాటు పూజలు నిర్వహిస్తారు. దేవత పూనిన పూజారి కుంకుమ భరిణె తీసుకుని అతివేగంగా కిందికి దిగుతాడు. గుట్ట మొదట్లో పోలీసులు రక్షణగా నిలబడతారు. సమ్మక్క ఆగమన సూచనగా పోలీసు అధికారులు గాలిలోకి మూడుసార్లు కాల్పులు జరిపి స్వాగతిస్తారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భక్తుల్లో దేవుడు పూనిన శివసత్తులు ఊగిపోతారు.
జయజయ ధ్వానాలతో మేడారం దద్దరిల్లుతుంది. గద్దెల వద్దే సమ్మక్కకు ఎదురుకోళ్లతో స్వాగతం పలుకుతారు. కోళ్లను అక్కడికక్కడే బలిస్తారు. మొదట పాముపుట్ట వద్ద, తర్వాత సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజల తర్వాత దేవతను కట్టుదిట్టమైన భద్రత మధ్య గద్దెలపైకి చేర్చుతారు. మాఘ పౌర్ణమి ఘడియలు ప్రవేశించిన వెంటనే లాంఛనంగా జాతర ప్రారంభం అవుతుంది. తల్లీబిడ్డలను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు బారులు తీరుతారు.