Menu Close

ఋణానుబంధము-గొప్ప కథ తప్పక చదవండి-Telugu Stories


ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు. ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది.

ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవితకాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే…

*మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.

*ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలోని మన మీదగల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.

*మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.

*మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులుగానో ఎదురవుతారు .

*ఉదాహరణకు ఒక జరిగినకథ:- **కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఈ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు… “పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు . అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు.

* అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ: *ఒకసారి సత్యసాయిబాబా బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, “స్వామీ ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి?” అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు స్వామి.

**ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడిగితే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు *”నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తె వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది!”* అన్నారు. *ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి.

* కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం. అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము.

*ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు. కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ఈ కర్మబంధాల నుంచి ఎన్ని జన్మలెత్తినా మనం తప్పించుకో గలమా…….!

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Like and Share
+1
0
+1
1
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading