Menu Close

ఏమి నీ కోరిక? అద్భుత కధనం-Telugu Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది. అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే ! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం ?
సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది. దాని క్రింద రాసి ఉంది ఒక్క రూపాయి మాత్రమే! అని.

ఆశ్చర్య పోయాడు పేదవాడు. అంత పెద్ద దీపం ఒక్క రూపాయే ఏమిటి అని ? దగ్గరకు వెళ్లి చూశాడు!
అది అల్లాఉద్దీన్ అద్భుత దీపం లా ఉంది! సుమారు ఒక కిలో బరువు ఉంటుంది! అయినా ఒక్క రూపాయేనా ?
అది అమ్మేసుకుంటే తనకు ఎక్కువ డబ్బులు వస్తాయిగా ! అనేదతడి ఆలోచన!
షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు.ఎందుకు అంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని ..!

ఆ షాప్ వాడు “బాబూ ! ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది.అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది.అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది.అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది! ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి! లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది! అదీ దాని కధ!! “

పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు.ఇంటికి తీసుకు వెళ్ళాడు.దానిని రుద్దాడు.భూతం ప్రత్యక్షం అయ్యింది.”ఏమి నీ కోరిక ?” అనడిగింది!
తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు! క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం సిద్ధం!భోజనం కాగానే…
“ఏమి నీ కోరిక ?” అడిగింది.పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది. నిద్రపోతూండగా
“ఏమి నీ కోరిక ?” అడిగింది.ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు.వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది.
“ఏమి నీ కోరిక ?” అడిగింది!

పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు. కోరికలు అడుగుతూనే ఉన్నాడు.అవి తీరుతూనే ఉన్నాయి.అతడికి విసుగు వచ్చేస్తోంది!
ఎన్నని అడగగలడు? అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతం తో పాటు సంపదలూ పోతాయి!ఎలా?
పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు . ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు!
తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి “ఏమి నీ కోరిక ?” అడిగింది.

భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం! అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు.
పాతేసి “ఏమి నీ కోరిక ?” అడిగింది.

ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు.నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని అదే అని చెప్పాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది!
అతను ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు. తనచుట్టూ ఉన్న వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు. తన సౌఖ్యం, తన వారి, చుట్టూ ఉండే వారి సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు!

కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు. భూతం స్థంభం ప్రక్కన నిద్రపోతోంది!!
ఈ విజయ గాధ తనకు మార్గం చూపిన ఆ వృద్ధ సన్యాసి దగ్గరకు కృతజ్ఞతలతో వెళ్లి చెప్పాడు.
ఇక్కడితో కధ కాలేదు!
ఈ కధ మనందరిదీనూ!
ఈ కధనుండి మనం ఏమి నేర్చుకుందాం ?
మన మనసే ఆ భూతం!

అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది.
ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని!
సన్యాసి చెప్పిన ప్రకారం భూతం నాటిన స్థంభం “మంత్రం” — ఎక్కడం దిగడం మంత్రపు జప సాధన!
అను నిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది.
అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది.మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది.
అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి, మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము!ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం!

మిత్రులారా !
మనం అంటే…
మనసు మాత్రమె కాదు!అంతకన్నా ఎక్కువ!
మనం అవినాశి అయిన ఆత్మలం!
మన మనస్సు అవిశ్రాంత స్థితిలో ఉన్నంత వరకూ మనం మన ఆత్మ దర్శనం చెయ్యలేము.చేయనీయదు.

మనసుకు విశ్రాంతిని ఇచ్చినపుడే మన ఆత్మ మనకు గోచరం అవుతుంది.అపుడే మనం ఇహపరలోకాల ఆనందాలను అనుభవించగలం.
మన మనసు మనకు ఆలోచననూ , విచక్షణనూ , కోరికలనూ , అవగాహననూ , విమర్శనాత్మక దృష్టినీ , న్యాయాన్యాయ నిర్ణయాలను తీసుకునే శక్తి, వంటి ఎన్నో బహుమతులను ఇచ్చింది.

దీనివలన మనం ఈ భౌతిక ప్రపంచం లోనే జీవనం సాగిస్తూ దైవీ స్థితికి చేరుకోగలం !
మన మనసు భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం ! ఆయన తన మనసును ఉపయోగించి ఈ సృష్టిని సృష్టించాడు!
మన మనసుకు సరిగా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలా చేస్తుంది!

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading