Menu Close

చేసే సహాయం కూడా ఆలోచించి చెయ్యాలి- Telugu Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Stories, Telugu Kadhalu, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu

పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు.
అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు.


“ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి” అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది.


‘అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు.
అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో ‘స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి’ అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని ‘స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.


అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. ‘నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది. ఇదేనా!! ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా, సన్యాసి అతనికొక సూది ఇచ్చి ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.
ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. ‘నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను’ అని అరిచాడు.
ఆ సాధుపుంగవుడు శాంతంగా ‘నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది.


ఆసన్యాసి కాళ్లపై బడి ‘స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను’ అన్నాడు.


ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు.
ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.


గుమాస్తా చదవడం ప్రారంభించాడు.
1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!
2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా.
3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?
అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయాడు.


సాధువతనిని ఓదార్చి ‘బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు’ అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.


1వ వాడు: అన్నదాతా సుఖీభవ!
2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.
3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు వారి బిడ్డలు అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.
దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.
కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు.
ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading