ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Latest Telugu Stories, Telugu Moral Stories, Best Telugu Stories, తెలుగు కథలు, Telugu Kadhalu
కాకికి పిండం పెట్టి రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నారు కానీ..
ఒక్క కాకి కూడా వచ్చి ముట్టడం లేదు. కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు ముంచుకొస్తోంది.
“పంతులుగారు! ఒకవేళ కాకిముట్టకుంటే ఎలా?” ప్రశ్నించారు వచ్చిన బంధువుల్లో ఒకరు.
“ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం” అని ఉంది. ఒకవేళ కాకి ముట్టకుంటే నీళ్లలో కూడా వేయొచ్చు జలచరాలకోసం. చెప్పారు పంతులుగారు.” లేదు కాకి వచ్చిముడితేనే ఆత్మకుశాంతి కలిగినట్లు! అప్పటివరకు ఇక్కడి నుండి జరిగేదే లేదు. వేచి చూడవలసిందే!!” ఖచ్చితంగా చెప్పింది ఒక పెద్దావిడ. ఆమె చనిపోయిన వ్యక్తి తరుపున వచ్చిన అతిదగ్గరి బంధువు. అతని పెద్దమ్మ కూతురు.
మిగతా బంధువులు చనిపోయిన వ్యక్తి కోడలు తరుపు బంధువులు. “ఇంకెక్కడి కాకులు! కాకులు కనిపిస్తున్నాయా అసలు!! కాకులన్నీ లోకులై పుడుతేనూ!!” హాస్యమాడాడు వచ్చిన బంధువుల్లో ఒకరు. ఇద్దరు నవ్వారు. “సమయం కానీ సమయంలో హాస్యాలేమిటి?” వాళ్ళవైపు తీక్షణంగా చూసిందా పెద్దావిడ.
“అబ్బా! ఈ ముసలాడు బతికి ఉన్నన్నినాళ్ళు సాధించాడు..చచ్చిన తర్వాత కూడా సాధిస్తున్నాడు” అన్నాడు కర్మకాండ చేస్తున్నవ్యక్తికి స్వయనా పిల్లనిచ్చిన మామ, చనిపోయిన వ్యక్తికి వియ్యంకుడు.
“అవును” అన్నట్లుగా తలూపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు (పుత్రరత్నం)….తన మామ అన్న మాటలకు..
ఈ మమాఅల్లుళ్ళ ప్రవర్తనకు పెద్దావిడకి ఒళ్లుమండి బాగా కోపమొచ్చింది..
చనిపోయిన వ్యక్తంటే ఆమెకి బాగా గౌరవం. పేదరికంలో పుట్టినా కష్టపడి పైకివచ్చాడు. కొడుకు 10వతరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా తామెంతమంది చెప్పినా మళ్ళీ పెళ్లిచేసుకోలేదు. తన సుఖాల్ని పక్కన పెట్టి మంచి ఉద్యోగం కోసం కొడుకును పెద్దచదువులు చదివించి ప్రయోజకుడ్ని చేశాడు. కొడుకు పెద్దఉద్యోగంలో ఉండి ఊర్లు తిరుగుతుండడం వల్ల…కొడుకును కస్టపెట్టడం ఇస్టంలేక కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒక్కడే ఉండేవాడు. కొడుక్కి కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి ఇచ్చాడు. 3 సంవత్సరాల క్రిందటి నుండి మంచం పట్టాడు. చేసేది లేక తండ్రిని తీసుకెళ్లి తనదగ్గరే ఉంచుకున్నాడు కొడుకు….
అందమైన ఆలి మాట అమృతలా భావించి అడుగులకు మడుగులు లొత్తే కొడుకు, తన భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలనుకున్నాడు.
తండ్రిని ఎక్కడ ఉంచాలనే ప్రసక్తివచ్చింది.
తిరిగివచ్చే10 రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు సడ్డకుడు(తోడల్లుడు).
“లేదు!ఇలా మంచంమీదనే ఉండేవాళ్ళని వృద్ధాశ్రమంలో తీసుకోరు! అదీగాక ఇతరులదృష్టిలో బావుండదు కూడా. అంది భార్య.
చివరకు అనేక చర్చల తర్వాత ముందర ప్రత్యేకంగా ఉన్న ఒక ఇరుకు గదికి తండ్రిని షిఫ్ట్ చేసి ఇల్లుకు తాళం వేసుకుని 10 రోజులవరకు తండ్రిని చూడడం కోసం ఒక వ్యక్తిని కిరాయి మాట్లాడి టూర్ కు బయలుదేరారు.
ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కాని, అదే రోజు రాత్రి తెల్లరేటప్పుడు గుండెపోటుతో మరణించాడు తండ్రి.
టూర్ వెళ్లిన అందరూ అర్ధాంతరంగా రావలసి వచ్చింది. అంత్యక్రియల కోసం స్వగ్రామం వచ్చారు. అంత్యక్రియలకు ఊరుఊరంతా హాజరయ్యారు. తర్వాత జరిగే కర్మకాండలో దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారు.
“బతికిఉన్నన్నినాళ్ళు ఏం కష్టపెట్టాడ్రా మీ నాన్నా !!” కోపంగా అడిగింది పెద్దావిడ.
“నీకేం తెలుసే అత్తమ్మా! 3 సంవత్సరాల నుండి ఎంత నరకం చూస్తున్నామో!!
ఈ ఆరునెలల నుండి మరీనూ!! అన్నీ మంచం మీదే!!
వాటికోసం పెద్దజీతానికి మనిషిని మాట్లాడవలసి వచ్చింది. వాడు రాత్రికి ఉండడు కదా!..”రాత్రంతా మేమే సేవ చేయవలసి వచ్చేది!” అన్నాడు కొడుకు సమాధానంగా…
“అదొక్కటేనా!!!!
చాలా రాత్రివరకు కూడా కాళ్ళు నొక్కించుకుంటూనే ఉండేవాడు..తొందరగా వదిలిపెట్టేవాడు కాదు!!” చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి సపోర్ట్ గా!!
“ఓహో అంతేనా!”
నీకు చిన్నప్పుడు రెండు సంవత్సరాల పాటు ఆల్బమినో..గిల్బమినో ఎక్కువై రోగం పడితే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు..అదేకదా !! మీ నాన్న నిన్ను సాధించడమంటే…..
నీకు వినికిడి సమస్య వస్తే చెవి ఆపరేషన్ చేయించి రాత్రంతా హాస్పిటల్లో నీ దగ్గరే నిద్రమానేసి పడుకుని సేవ
చేసాడే… అదేకదా!! మీ నాన్న నిన్ను సాధించిడమంటే….
మీ అమ్మ చనిపోయిన తర్వాత బెంగతో మానసికంగా కృంగిన నీకు ఫీట్స్ వస్తుంటే..సంవత్సరం పాటు నిన్ను కనిపెట్టుకుని సేవచేస్తూనే ఉన్నాడే!!..అదేకదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే…..
మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళిచోసుకోరా!! అంటూ మేమెంత పోరినా “వచ్చేదేలాంటిది వస్తుందో నా కొడుకు దిక్కులేనివాడౌతాడే!! “అంటూ నీ కోసం తన సుఖాలన్నీ వదులుకున్నాడుగా!!..అదేకదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే…..
“నేను దరిద్రంలో పుట్టి పెరిగాను..నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా దారపోసి జాగాలు.. భూములు.. నగా నట్రా అన్నీ జమచేసి ఇచ్చాడుగా!!
..అదేకదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే…
నువ్వెప్పుడు బిజీగా ఉంటావు..ఫోన్ చేస్తే నీకెక్కడ ఇబ్బంది కలుగుతుందేమోనని ఫోన్ చెయ్యడానికి కూడా వెనుకాముందయ్యేవాడు.. అదేకదా మీ నాన్న నిన్ను సాధించడమంటే…
నీతో మాట్లాడుదామనుకున్న మాటలన్ని ఒక డైరీలో రాసేవాడు.. మీ నాన్నమీద నీకు కొంచెమైనా ప్రేముంటే ఇంట్లో వెతికి చదువురా దాన్ని!!
పగలనకా రాత్రనకా కష్టపడి నీకోసం ముప్పై ఏండ్లు సేవచేసినోడికి మూడేండ్ల సేవ చేయడం “సాధించడం” క్రిందకైంది కదూ నీకు!!!
అయినా ఎలా తెలుస్తుందిలే!! మీ నాన్న విలువ నీకు !!ఎప్పుడూ హాస్టల్లోనే ఉన్నాడివాయే!! తండ్రి కష్టం విలువా
..బంధం చూస్తేనే కదా నీకు తెలిసేది!!
చూసినా తెలుసుకునే కాలం కూడా కాదిది!!
పెద్దసంబంధం!! సుఖపడతావని….పెళ్లిచేసాడు..
ఎవరో మహాకవి అన్నాట్టా!!
“సముద్రం వద్దకు ముత్యాలేరుకుందామనే ఆశతో వెళ్ళాను! చివరకు ఆ సముద్రమే మింగివైచినది!!” అని.
అలా అయింది మీ నాన్న పరిస్థితి.
ఏమయ్యా పెద్దమనిషి !నువ్వైనా చెప్పొద్దూ!!
ఎన్నడూ కొడుకుని కష్టపెట్టనివాడు అంతసేపు కాళ్ళు ఎందుకు నొక్కిచ్చుకున్నాడో!!!….
ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద సుఖం “పుత్రపరిష్వంగమేనయ్యా”!!! ..పెద్ద పెద్ద గ్రంథాలు కూడా చెబుతున్నాయావిషయం. కొడుకుని కావలించుకోవడం వల్ల పొందే సుఖం ఇంకెక్కడా దొరకదయ్యా!!
ఆ వయస్సులో భార్య..ప్రియురాలు.. ఎవరి స్పర్శ సుఖమనిపించదు.. ఏ వయస్సులోనైనా సుఖాన్నిచ్చేది తన సంతానం స్పర్శనేనయ్యా!!
ఇదికూడా తెలియక పేద్ద.. చెప్పొచ్చావ్!!
తన చివరి వయస్సులోనైనా కొడుకుతో ప్రేమసుఖం పొందడానికేనయ్యా!! వాడు కాళ్ళు నొక్కించుకున్నది!!
నీకూ వయసొస్తుంది! అప్పుడర్థమైతుందిలే ఇదంతా!!””
తల్లిలేదు! తండ్రిలేడు!!
ప్రేమలేదు!బంధం లేదు!!
కాలమా!! ఎలా అయిపోతివే!!!””
అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది పెద్దావిడ !!!!!
అప్పుడేడ్చాడు కొడుకు
నిజంగా…..
గుండె పగిలేలా……
మనుసునిండా…..
తండ్రి గుర్తొచ్చి..
తండ్రిప్రేమ గుర్తొచ్చి..
తండ్రి తన కోసం చేసిన త్యాగాలు గుర్తొచ్చి..
తండ్రితో తన జీవితమంతా కళ్ళముందు కదిలి..
…పశ్చాత్తాపం తో…
అతన్ని చూసి కోడలూ..వియ్యంకుడు.. బంధువులు.. ఇలా అందరూ ఏడవసాగారు.
కొందరికి తమ తమ తండ్రి గుర్తుకురాగా!..
మరికొందరికి తమ తండ్రితనం..పిల్లలకోసం పడిన కష్టం గుర్తుకురాగా!!
ఇంకా కొందరికి ఆ పెద్దావిడ”కాలమా!! ఎలా అయిపోతివే అంటూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తూ తమ కాలం ఎలా ఉండబోతోందో అనే వేదన కలగడం వల్ల…..
అప్పుడొచ్చాయి…. పుత్రధర్మాన్ని కావుమంటూ (రక్షించమంటూ) కావు.. కావు మంటూ ఒక్కసారిగా కాకులు. “కాకిపిండాన్ని” తినడానికి.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com