ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Short Stories
ఒక పట్టణంలో ఓ యువకుడు, తన మంచితనంతో, నిజాయితీతో, స్నేహభావంతో, చాతుర్యంతో అంచెలంచెలుగా ఎదిగి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని కొన్నేళ్ల పాటు కష్టపడి నిర్మించుకున్నాడు. అనుకోకుండా అతనికి జబ్బు చేసింది. డాక్టర్లు కూడా పెదవి విరిచారు.
ఆ వ్యాపారి తన ముగ్గురు కొడుకులతో మీలో ఒకరిని ఈ వ్యాపార సామ్రాజ్యానికి అధ్యక్షుడిని చేస్తాను. ‘ఎవరు సమర్థుడో నిర్ణయించడానికి మీకో పరీక్ష’ అంటూ, తలా ఒక ₹100/- ఇచ్చి, మీరేదైనా కొనుక్కొచ్చి సాయంత్రానికల్లా ఈ గదిని పూర్తిగా నింపాలి. ముగ్గురూ ఉత్సాహంగా బయలుదేరి, సాయంత్రానికి వచ్చారు.
“పెద్దాడా! నీవేం తెచ్చావురా” అని తండ్రి అడిగాడు. “ఇదుగో ఈ గడ్డి మోపు తెచ్చాను.” అంటూ గదంతా గడ్డిని వెదజల్లాడు. గడ్డి నేలమీద పరుచుకుంది కానీ, గది నిండలేదు. “రెండో వాడా! నీ సంగతి ఏమిటి ?” అన్నాడు. ” వంద రూ.లకు దూది కొనుక్కొచ్చాను.” అంటూ గదిలో వెదజల్లాడు. అది కూడా గదిని నింపలేక పోయింది.
“చిన్నోడా! నీవేం తెచ్చావురా !” అని అడిగాడు. “నాన్నా ! ఇరవై ఐదు చొప్పున రెండు స్వచ్ఛంద సంస్థలకు విరాళం. ఇంకో ఇరవై ఐదు గుడి హుండీలో వేసి, పది రూపాయలకు కొవ్వొత్తులు కొన్నాను. 15 రూ.లు మిగిలాయి, అంటూ గదిలో కొవ్వొత్తి వెలిగించాడు. గది అంతా వెలుతురుతో నిండి పోయింది. తండ్రి ఆనందించాడు. ” చాలా బాగా ఖర్చు చేసావురా చిన్నోడా! ఈ వ్యాపార సామ్రాజ్యానికి అధ్యక్షుడివి నీవే. పదిమందికి వెలుగును పంచడం అర్థమైంది నీకు. నాకు పరమానందంగా ఉంది.”
సేకరణ – V V S Prasad