ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Bhasha Goppadanam Lyrics in Telugu – Neeku Nenu Naaku Nuvvu
పల్లవి:
తెలుగు భాష తియ్యదనం తెలుగు భాష గొప్పతనం
తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
చరణం: 1
అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదములోన అభిమానం జనిస్తుంది
మమ్మీడాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుందీ
మామ అన్నమాట మనసు లోతుల్లో నిలుస్తుంది
అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుందీ
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ల రుణం తీర్చరా
చరణం: 2
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతను మార్చుకోవు
భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు
మనుషులమై మనభాషకు ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగు రాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మనభాషకు అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది భాషా ఆచారాలను మింగెయ్యెద్దు
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా…
వెనక్కి తగ్గమాకురా
తెలుగు భాష తియ్యదనం తెలుగు భాష గొప్పతనం
తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
మమ్మీడాడీ అన్నమాట మరుద్దామురా
అమ్మానాన్నా అంటూ నేటి నుండి పిలుద్దామురా
ప్రతిజ్ఞ పూనుదామురా