ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి చేత్తో విఐపి బ్యాగు పట్టుకుని దిగిన తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు సూర్యం.
ఎదురు వెళ్లి చేతిలో బ్యాగు అందుకుని “అదేవిటమ్మా! కబురు కాకరకాయలేకుండా, హఠాత్తుగా వచ్చేసావు! స్టేషనుకి వచ్చేవాడ్నిగా!” అంటూ ఇంట్లోకి దారితీసాడు.
ఆ మాటలు వింటూనే వంటింటిలోంచి బయట కొస్తూ “రండత్తయ్యగారు! అక్కడంతా బావున్నారా?” అంటూ సుందరి అత్తగార్ని చూస్తూ పలకరించింది.
అందర్నీ పలకరించి “కాఫి పెట్టు తల్లీ! కాళ్ళు కడుక్కుని వస్తా!” అంటూ సుభద్రమ్మ పెరట్లోకి దారితీసింది.
సుభద్రమ్మకి ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు. పెద్దమ్మాయి హైస్కూల్ చదువు ముగిసేసరికే సుభద్రమ్మ భర్త పోయారు. ఏ ఆధారం లేకపోయినా సరే, నోటి మంచితనం, భర్త చేసిన మంచి పనులతో, పిల్లలని పెంచి, పెద్ద చేసి యోగ్యులను చేసింది.
అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాలలో బాగానే స్థిరపడ్డారు. ఉద్యోగరీత్యా అందరు వేరు వేరు ఊళ్లల్లో ఉంటారు.
“నీకు ఎక్కడ బాగుంటే, అక్కడే స్థిరంగా ఉండొచ్చుగా! మేమే అక్కడికి వచ్చి నిన్ను చూస్తుంటాం!” అంటూ పిల్లలందరు అంటుంటారు.
“రెక్క ఆడుతున్నంత వరకు ఇలా చాంద్రాయణం చేస్తుంటానర్రా! మంచం పట్టకుండా వెళ్ళిపోతే, మీరూ, నేను ఇద్దరం అదృష్టవంతులమే! లేదా అప్పుడే ఎక్కడో అక్కడ మంచం వేద్దురుగాని!” అంటూ నవ్వుతూ అనేది.
సుభద్రమ్మకి ఫోన్లు చెయ్యడం ఇష్టం ఉండదు. ఏమైనా విషయాలుంటే ఉత్తరం రాస్తుంది. ఎవరి దగ్గరకైనా వెళ్ళలంటే వాళ్ళకి ఓ వారం ముందుగానే ‘ నేను ఫలాన తేదీన, ఫలానా బండికి వస్తున్నానంటూ’ ఓ ఉత్తరం రాసి పడేస్తుంది.
అలాంటిది ఏ ఉత్తరం రాయకుండా వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది. అలా అని సూటిగా ఆడగాలంటే సూర్యానికి భయమే!
“అదేమిటి..నీపెట్టెఏమైంది!” కాఫీతాగుతున్నతల్లినిఅడిగాడుసూర్యం.
“ప్రపంచం అంతా మారిపోయినా సరే నేను మారటం లేదని అంటారుగా మీరందరునూ! అందుకే ఆ ట్రంకు పెట్టె మార్చి, అదిగో ఆ తోలు బ్యాగు తీసుకొచ్చాను. మీ పెద్దబావ కొనిచ్చాడు!” తల్లీ మాటలకి సూర్యానికి నవ్వొచ్చింది.
“మీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ పెట్టె వయసులో నా కంటే పెద్దది. మా అమ్మ కాపురానికి వెళ్తున్నప్పుడు కొని ఇచ్చారుట! నాకు మా అమ్మ ఇచ్చింది! పెళ్ళైన కొత్తలో కాపురానికి రావడానికి రాజమండ్రిలో రైల్లో ఎక్కాం. కూర్చోడానికి చోటు లేదు. ఈ పెట్టె కింద పెట్టి, మా అమ్మ, నేను దానిమీదే కూర్చుని విజయనగరం వరకు ప్రయాణం చేసాం. ఆ పెట్టె ప్రయోజనం ఆ రోజే తెలిసింది.
ఈ షోకుల బ్యాగు మీద కూర్చోగలమా.. చెప్పు! మీ చిన్నప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డారు. ఇల్లాంతా గాలించి వెళ్ళిపోయారు. గదిలో మూలనున్న ఈ పెట్టెని ముట్టుకోలేదు. మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన వెండి కంచం, గ్లాసు, ఒంటిపేట గొలుసు అందులోనే ఉన్నాయి. వాళ్ళేం అనుకున్నారో గాని అ పెట్టెని ముట్టుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే దీని చరిత్ర చాలనే వుంది” అందుకే సూర్యానికి తల్లి అంటే ఇష్టం
“ఈ కాలం మనుషుల ఆరోగ్యాలు చెడిపోవడానికి, మీ మెదళ్లే కారణం నాయనా!” అంటూ కాఫీ ముగించి వంటింట్లోకి దారితీసింది.
సుభద్రమ్మ ఫ్రిజ్లో ఉన్న కూరలు తీసుకుని, కత్తిపీట ముందేసుకుని కింద కూర్చుని కూరలు తరుగుతూ అంది.
“మీ పెద్ద తోటి కోడలికి అప్పుడే కాళ్ళు నెప్పులు వచ్చేసాయి!”
“అయ్యో.. అలాగా! అప్పుడే కాళ్ళ నొప్పులా?” అంటూ సుందరి కాఫి గ్లాస్ అత్తగారికి అందించింది.
“రోగాలు రాక చస్తాయా! వాటికి వయసు, వేషలతో సంబంధం ఉండదు! ఇప్పడు అందరూ వంటింట్లో నించుని వంట చేయటం, టేబులమీద భోజనం.. వంటి అలవాట్లు చేసుకుంటే ముప్పై ఏళ్ళకే ఆ రోగం రాక చస్తుందా!”
సుందరి ఏమి మాట్లాడలేక పోయింది.
“మనం చేయగలిగే పనులను మనమే చేసుకోవాలి తల్లి! అవి మనసుకి తృప్తిని ఇవ్వడమే కాదు, శరీరానికి వ్యాయామాన్ని కూడా ఇస్తాయి! వంటింట్లో మూడొంతుల పని మీరు చేయడం లేదు. మిషన్లు చేస్తున్నాయి! టైము కలిసోస్తుందని అంటారు గాని, అది మన జీవితకాలాన్ని హరిస్తుందనే విషయం ఏవరు అర్దం చేసుకోవటం లేదు! నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరింటికి వెళ్ళినా, నాక్కూడా పనుండటం లేదు! ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఆ మధ్య వరకు కనీసం వత్తులు చేసుకునేదాన్ని. చేతివేళ్ళకి వ్యాయామం అయ్యేది. ఈ మధ్య వాటిని కూడా నెల సామానుతో తెచ్చెస్తున్నారు!” అంది సుభద్రమ్మ
బయటనుండి ఆ మాటలు వింటున్న సూర్యానికి ఎందుకో తల్లి ఎప్పటిలాగా లేదనిపించింది.
అక్కావాళ్ళతో గొడవ ఏదైనా జరిగిందిమో! మెల్లగా సమయం చూసి అడగాలి అని మనుసులోనే అనుకున్నాడు.
రెండ్రోజులు గడిచాయి.
సుభద్రమ్మ బట్టలు మడతపెట్టి బ్యాగులో సర్దుతూ, ఆఫీసు నుంచి అప్పుడే వచ్చిన కొడుకుతో అంది.
“రేపు విజయనగరం మీ అన్నయ్య దగ్గరకి వెళ్తాన్రా! ఉదయం బస్సుకి వెళ్తే సరిపోతుంది!”
ఆ మాటలు వింటూనే సూర్యం ఒక్కసారి కంగారు పడ్డాడు
ఎప్పుడొచ్చినా, మూడు, నాలుగు నెలలు ఉండే తల్లి ఇలా మూడు రోజులకే ప్రయాణం అవుతుంటే, ఏం జరిగిందో అని భయపడ్డాడు.
తన గదిలోకి వెళ్లి, భార్యని పిలిచి అదే అడిగాడు.
“ఏం జరగలేదండి! ఇక్కడికి వచ్చిందగ్గర్నుంచి ఆవిడ ముభావంగానే ఉన్నారు. ఎప్పుడూ అలా ఉండలేదు. అందుకే అడగాలంటే భయం వేసింది కూడా!”
భార్య మాటలు వింటూనే సూర్యం ఆలోచనల్లో పడిపోయాడు. తల్లికి కోపం రావడం గాని, ముభావంగా ఉండటం గాని, ఎప్పడూ చూడలేదు. అందరితో ఆప్యాయంగానే ఉంటుంది. అలాగే అందరు ఆవిడ్ని బాగా ఆభిమానిస్తారు. అలాంటిది తల్లి అలా సీరియస్‌గా ఉండటానికి కారణం.. ఎదో జరిగి ఉంటుంది. సమయం చూసి అడగాలి.
రాత్రి భోజనాలైన తర్వాత తల్లి పక్కన కూర్చుని మెల్లగా అడిగాడు.
“అప్పుడే వెళ్ళిపోతున్నావేమిటమ్మా? ఏవరైనా ఏమైనా అన్నారా!”
“అబ్బే… ఏవరూ ఏం అనలేదురా! నాకే టైము గడవటం లేదు. పెద్దవాడి దగ్గరకి వెళితే, అక్కడ కాలాక్షేపం బాగానే ఉంటుందిలే!”
“అదేమిటి! ఏప్పుడూ ఉండే ఇల్లు, ఆ మనుషులమే కదా! ఇంతకుముందు లేని సమస్య ఇప్పుడేమొచ్చిందామ్మా!”
“అవున్రా! సమస్య ఇప్పుడే వచ్చింది. భవిష్యత్తులో అది మరింత పెరిగిపోతుంది! రాను రాను అందరిళ్లల్లో ఉండవలసిన వాతావరణం కనిపించటం లేదురా!”
“ఏవైందమ్మా? ఏవరైనా ఏమైనా అన్నారా?” తల్లి మాటలు అర్దంకాక సూర్యం మళ్ళీ అడిగాడు.
“అవేం లేదురా! ఒకప్పుడు నా చుట్టూ చేరి, నా మనమలు కథో, కబుర్లు చెప్పమనేవారు. గుర్తుందిగా! ఇప్పుడు చూడు, వాళ్ళు ఆ పోన్లు పట్టుకుని మాటలు, ఆటలు కూడా మరిచిపోయారు. మీరా ఆ టీవి పెట్టుకుని, ఎవరి ధ్యాసలో వాళ్ళు ఉంటున్నారు! నాకే టైము గడవడం కష్టంగా ఉంది!”
‘అమ్మయ్య’ అనుకుంటూ ఊపిరిపిల్చుకుని సూర్యం అన్నాడు ” వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారుగా… ఈ కాలంలో పిల్లలు ఇలాగే ఉంటారు. వాళ్ళ లోకం వాళ్ళది! కంప్యూటర్ యుగం కదా!”
“నిజమేరా! కాని మనిషి మేథస్సు కంటే కంప్యూటర్ గొప్పది కాదు. అసలు ఆ కంప్యూటర్ని కనిపెట్టింది మనిషే కదా! పరిస్థితి ఇప్పుడు భస్మాసుర హస్తంల తయారైంది!”
తల్లిని ఆశ్చర్యంగా చూసాడు సూర్యం.
“మన పురాణాల్లో ఓ రాక్షసుడికి, వాడి హస్తం ఏవరి తలమీద పెడితే వాడు భస్మం అయ్యే వరాన్ని, శివుడు ఇస్తాడు.
చివరికి ఆ వరాన్ని శివుడిమీదే ప్రయోగిస్తానంటాడు! ఆ కథ తెలుసుగా! ఆలోచిస్తుంటే ఇప్పుడు భస్మాసురుడే కంప్యూటరుగా అవతరించాడనిపిస్తుంది!”
“అబ్బా! నీ థీరి అమోఘంగా ఉందమ్మా!” సూర్యం నవ్వుతూ అన్నాడు.
“మొన్న మీ అక్క బావ కూడా నీలాగే నవ్వారు! నువ్వు కూడా ఆలోచించు నాయనా! మీరు కనిపెట్టిన ఈ కంప్యూటర్లు, ఫోన్లు కొంతమేర ఉపయోగపడి ఉండొచ్చును. కాదనను! కాని అవసరానికి మించి వాడుతున్నారు! ఆ అనర్ధాలు మీ ముందే ఉన్నాయి!”
తల్లి ఇలాంటి విషయాలు చెపుతుందని సూర్యం ఊహించలేదు. ఏదో తన పని తాను చేసుకుంటూ, కృష్ణా రామా అనుకుంటూ, చీకు చింతా లేకుండా ఉంటున్నాదని అనుకున్నాడు. కాని ప్రస్తుత పరిస్థితులని ఇలా కాచి వడపోస్తుందని ఊహించలేదు.
“అసలు ఇంట్లో వాళ్ళందరు కూర్చుని ఎప్పుడైనా కబుర్లు చెప్పుకుంటున్నారా? ఒకసారి ఆలోచించు! ఇంట్లో అందరం కలసి ఒకేసారి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్లం. రాత్రుళ్లు వెన్నెల్లో మంచాలేసుకుని అందరం వరసగా పడుకుని మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకునేవాళ్లం! పగలు మగళ్ళందరూ ఆఫీసులకి వెళ్ళిపోయిన తర్వాత వీధిలో ఆడాలందరం ఓ దగ్గరకి చేరి, పత్రికలు చదువుకోడమో, కబుర్లు చెప్పుకునేవాళ్లం! అవన్నీ మనుషుల మధ్య బంధాలని ఏర్పచేవి! ఇప్పుడు ఆ వాతావరణం కనబడటం లేదు. ఇక బంధాలు ఎక్కడనుంచి వస్తాయి?” సుభద్రమ్మ
పిల్లలకి నడకొస్తే చాలు, వాళ్ళని స్కూల్లకి తరిమెస్తున్నారు. అక్కడ వాళ్ళ సున్నితమైన మెదడులో పెద్ద విషయాలని నూరి పోస్తున్నారు. వాళ్ళకి అ వయసులో కావలసిన కథలు, ఆటలకి దూరమవుతున్నారు! పిల్లలకి ప్రేమ, ఆదరణ, అభిమానాలని అందించడానికి మీకు టైము చిక్కటంలేదు! అసలు మీకా ఆలోచనలే రావటం లేదు. మనుషుల మధ్య దూరం రోజు రోజుకి పెరిగిపోతున్నాది! వీటన్నిటిని కారణం ఆ భస్మసుర హస్తమే!
అతి సర్వత్రా వర్జయేత్ అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పటికే మనిషి అవసరానికి మించి ఈ యంత్రాలను వాడుతున్నాడు. తాను కనుక్కున్న కంప్యూటరు చెప్పుచేతల్లో మనిషి నడుస్తున్నాడు! తన పనిని తాను చేసుకోలేక పోతున్నాడు. తన నైపుణ్యాన్ని కొల్పోయి, మిషన్లు మీద ఆదరపడిపోయాడు. శరీరానికి కావలసిన శ్రమ లేక పాతికేళ్ళకే ఆరోగ్యాలు క్షీణీస్తున్నాయి! ఈ పరిస్థితులు ఇలా కొనసాగితే మనిషి ఊనిక్కే ప్రమాదం వస్తుంది!”
సూర్యం తల్లీ ఆలోచనలకి ఆశ్చర్య పోయాడు. ఇంత లోతుగా విషయాలని చదివి, పరిస్థితులని పరిశీలించి భవిష్యత్తుని విశ్లేషణ చేస్తుంటే చాలా ఆనందం వేసింది.
“మా రోజుల్లో కష్టాలంటే…. జీతాలు సరిపోక పోవడం, పెద్ద సంసారం, పెద్దవాళ్ళకి ఒంట్లో బాగా లేకపోవడం, తిండి సరిపడా లేకపోవటం, అప్పులు చేసి వాటిని తీర్చడానికి కష్టపడటం.. వంటివి ఉండేవి.
మరిప్పుడు కష్టాల రూపురేఖలే మారిపోయాయి. అమ్మ తిడితే కష్ఠం, నాన్న దెబ్బలాడితే కష్టం, స్కూల్లో మాష్టారు కొడితే కష్టం, కరెంటు పోతే కష్టం, టివి బందైయితే ఇబ్బంది, ఆ దిక్కుమాలిన ఫోన్ లైన్లు రాకపోతే అంతా ఇంత కష్టం కాదు! వీటికోసం తల తాకట్టు పెట్టయినా కొనిపారిస్తున్నారు. మీకు మానసిక బలం తగ్గిపోబట్టి, మీకన్నీ కష్టంగానే ఉంటాయి! ‘ మేం కష్టాలు పడి, పెరిగాం, ఆ కర్మ వాళ్ళకెందుకని’
పిల్లలని కష్టం తెలియకుండా పెంచుతున్నారు! అదే వచ్చే రోజుల్లో భస్మాసుర హస్తంగా తయారై కూర్చుంటుంది!”
“నిజమేనమ్మా! కాని లోకం తీరే అలాగుంది! మేం చేయగలం చెప్పు?” సూర్యం దగ్గర అంతకంటే జవాబు లేదు.
అందుకేరా.. నేనో నిర్ణయానికి వచ్చాను!”
తల్లి మాటలు వినేసరికి ఒక్కసారి కంగారు పడ్డాడు.
“అదేం పెద్ద విషయం కాదులే! లోపం ఎక్కడ మొదలయిందో అక్కడే దాన్ని బాగు చెయ్యాలి! నాకింకా ఓపిక ఉంది. రోగాలు రొచ్చులు లేవు! నేను పెద్దగా చదువుకోలేదు గాని, పిల్లలకి మంచి విషయాలు చెప్పగలనులే! అందుకే ఓపిక ఉన్నంత వరకు మనవూరిలో మీరు చదివిన అరటిచెట్ల బడి లేదూ, అందులో కనీసం వారానికోసారి పిల్లలకి కథలు, మంచి, చెడ్డ, నీతి నిజాయితీల గురించి చెప్పాలనీ అనుకుంటున్నాను. వాళ్ళకి ఓ ఉత్తరం రాసాను. అందుకు కలెక్టరుగారే స్పందించి జవాబు రాసారు. నన్ను చూడాలనిపించి నప్పుడు మీరే అక్కడికి రండి!
మాట్లాడుతూనే పంచతంత్రకథలు, పేదరాసి పెద్దమ్మకథలు, విక్రమార్కుడు కథల పుస్తకాలని బ్యాగులో సర్దుతున్న తల్లిని చూసేసరికి సూర్యం నోటంటా మాట రాలేదు, కళ్ళంటా ఆనందబాష్పాలు రాలాయి!!
సూర్యానికి మోహినీ అవతారంలో ఉన్న తల్లి కనిపించింది.
జయంతి ప్రకాశ శర్మ.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.