ధారానగరములో యజ్ఞవర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు పేదవాడు. తనకున్న
ఒక ఎకరా భూమిలో పండిన వాటితోనే సంతృప్తి తో నిత్యాగ్నిహోత్రుడై జీవించు చుండెను. అతనికి ప్రతిగ్రహణమన్న ఇష్టముండెడిది కాదు. ప్రతిగ్రహణ మనగా
ఎవరిదగ్గరంటే వాళ్ళ దగ్గరకి వెళ్లి యాచించుట. వారిది అన్యాయార్జిత ధనమైనచో
తనకు పాపము వచ్చునని అతని అభిప్రాయము.
. మనుచరిత్రలో కూడా ప్రవరుడు కూడా ప్రతిగ్రహణ మన్న యిష్టము లేనివాడే.
యజ్ఞవర్మ భార్య చాలా గడసరి మరియు ధనాశ కలది. ఆమె రోజూ భర్తను భోజరాజు దగ్గరకు వెళ్లి ధనము తీసుకొని రమ్మని వేధించు చుండెడిది. దానికి యజ్ఞవర్మ రాజుల ధనము క్రూర క్రియార్జితము అది తీసుకొన రాదు అనెడివాడు. ఆ విషయమున
భార్యాభర్తలిద్దరూ తరుచు గొడవ పడుచుండెడి వారు.
.
భార్య: భోజరాజు అందరికీ దానములు ఇస్తుంటాడు కదా! మీరు కూడా
వెళ్లి మీ పాండిత్యముతో ఆయనను మెప్పించి ధనము తీసుకొని రండి.
యజ్ఞ : నా హోమక్రియలకు నీవు అడ్డు రావద్దు. మనకు అగ్నిదేవుడే రక్షకుడు. నేను
యితరులను వేడను. ఉన్నదానితో మనము సంతృప్తి పడి జీవిద్దాము.
భార్య:- అలాగంటే ఎలా? వచ్చేపోయే కొంప చేతిలో చిల్లిగవ్వ లేకుంటే ఎలా? నేనీ
సంసారము చెయ్యలేను . నేను పుట్టింటికి వెళ్ళిపోతాను.
యజ్ఞ:- సరేలే రేపు వెళ్ళెదనులే
భార్య:- ఎప్పుడూ రేపు రేపు అంటారు. ఇవ్వాళ తప్పక వెళ్ళిరండి.
యజ్ఞ:- సరేలే సాయంత్రం వెళ్తాను. నీ పోరు పడలేకున్నాను.
మరుదినం ఆవిడ వెళ్లి వచ్చినారా?రాజేమైనా యిచ్చినారా? అని ఆతృతగా అడిగింది.
యజ్ఞ:- నిన్న వెళ్లి వచ్చాను. రాజును దర్శించి ముందు ఆశీర్వదించాను. రాజు తమరి కోరిక యేమని అడిగాడు. నేను మీరు అక్షరలక్షలు ఇస్తున్నారు. కానీ నాకు అవన్నీ అక్కరలేదు.
రాజుల సొమ్ము క్రూర క్రియార్జితమైనది. అది నాకక్కరలేదు.మీరు కష్టపడి
సంపాదించిన ధనమేదైనా ఉంటే ఎంత కొంచెమైనా ఇప్పించండి అని అడిగాను..
ఆయన రేపు రమ్మన్నారు , ఇవ్వాళ వెళ్ళితే ఆయన స్వార్జితమైన డబ్బు యిచ్చారు..
ఇవ్వాళ ఆయనకు స్వార్జిత ధనమెక్కడినుండి వచ్చినది?
యజ్ఞ:- రాజుగారు నిన్నరాత్రి మారువేషములో వెళ్లి లోహశాలలో సమ్మెట కొట్టి సంపాదించారట. అవి పదహారు రూకలు ఇచ్చినారు. అని అవి ఆవిడ చేతిలో పెట్టినాడు.
భార్య:- భోజరాజు దగ్గరకు వెళ్లి లక్షలు తెస్తారనుకుంటే ఈ ముష్టి పదహారు రూకలా మీరు
తెచ్చినది. అంటూ ఆ రూకలను కోపంగా అక్కడే వెలుగుతున్న అగ్నిహోత్రం లోకి విసిరి వేసింది.
యజ్ఞ:–అయ్యో అయ్యో అదేమే అగ్నిలోకి విసిరి వేశావు? ఏదో వచ్చిన దానితో తృప్తి
పడాలి కానీ దురాశ పడకూడదు. ఉండు స్నానము చేసి వచ్చి బయటికి తీస్తాను
అని వెళ్లి స్నానం చేసి వచ్చి మెల్లిగా నిదానంగా ఆ రూకలను ఒక్కొక్కటిగా
బయటికి తియ్యసాగాడు.
ఆ రూకలు బంగారు నాణాలుగా మారి వస్తున్నాయి. అలా ఎన్ని తీసినా అక్షయముగా వస్తూనే వున్నాయి.
అప్పుడు యజ్ఞవర్మ చూచితివా? కష్టార్జితమునకు ఎంతటి మహిమ వున్నదో అన్నాడు..
తర్వాత వారు సుఖముగా జీవించిరి.
ఇందులోని నీతి ఏమంటే కష్టార్జితముతో సంతృప్తిగా జీవించ వలయునని . అంతే కానీ
మనమూ అలా అగ్నిలో విసరి వేస్తే బంగారు నాణాలు వస్తాయని అర్థం కాదు.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.