ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కుటుంబ ప్రశాంతత కోడళ్ల సఖ్యత, సభ్యత, సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది – Moral Stories in Telugu
అది రామాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో దశరథ రామయ్య అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. ఆయనకు రత్నాలాంటి నలుగురు కొడుకులు ఉండేవారు. వారి పేర్లు కూడా వరుసగా రామన్న, లక్ష్మన్న, ధర్మన్న, భీమన్న అని నామకరణం చేశాడు దశరథ రామయ్య. ఆ నలుగురు అన్నదమ్ములు కూడా వారి పేర్లకు తగినట్లుగానే వారు తమ చిన్నతనం నుండి కూడా ఎంతో ప్రేమానురాగాలతో, అన్యోన్యంగా, ఆప్యాయంగా ఉంటూ, అన్ని విషయాలలో ఒకరికి ఒకరు సహకరించు కొంటూ, గౌరవించు కొంటూ, ఒకరికి ఒకరు చేదొడు వాదోడుగా ఉంటూ, ఊరిలోని మిగతా అన్నదమ్ములందరికీ ఆదర్శవంతంగా ఉండేవారు.
ఆ ఊరి రచ్చబండ దగ్గర విశ్రాంతి కోసం వచ్చిన ఆఊరి లోని వారంతా దశరథ రామయ్య గురించి అతని కొడుకుల ఆప్యాయతానురాగాల గురించి, వారి అరమరికలు లేని జీవన విధానం గురించి గొప్పగా మాట్లాడు కొనేవారు. కుటుంబం అంటే అలా ఉండాలి, అన్నదమ్ములంటే అలా ఉండాలి అంటూ గొప్పగా చెప్పుకొనేవారు. అలా కాలం గడుస్తున్నది. రాను రాను పిల్లలు పెద్దవారయ్యారు. అందరికీ వివాహాలు జరిగాయి. పెళ్ళిళ్ళు అయిన కొత్తలో బాగానే ఉన్న ఆ అన్నదమ్ములు రాను రాను చిన్న చిన్న విషయాలకు కూడా ఒకరికి ఒకరు సహకరించు కోకపోగా ఒకరిపైన మరొకరు చాడీలు చెప్పుకుంటూ, వాదనలతో మొదలైన వారి పోరు చివరికి బంధాలను అనుబంధాలను తెంచుకొని వేరు కాపురాలు పెట్టుకొనే పరిస్థితికి వచ్చారు.
తండ్రి ఎంత నచ్చజెప్పినా వినకుండా చివరికి వారంతా వేరు పడి వేరే కాపురాలు పెట్టుకొని ఒకరికి ఒకరు సంబంధం లేకుండా అయిపోయారు. చివరికి ఒకరికి ఒకరు ఎదురు పడినా ఒకరి మొఖం ఒకరు చూసుకోకుండా, నీవెవరో నేనెవరో అనే విధంగా మొఖం పక్కకి తిప్పుకుని పలకరింపులు లేకుండా తయారయ్యారు. ఇదంతా గమనించిన ఆఊరి వారంతా రచ్చబండ దగ్గర చేరి అంత అన్యోన్యంగా ఆప్యాయంగా ఉన్న ఆ నలుగురు అన్నదమ్ములు పెళ్ళిళ్ళు కాకముందు అంతటి ప్రేమాభిమానాలతో అంత బాగున్నవారు పెళ్ళిళ్ళు అయ్యాక ఎందుకిలా వేరుపడి ఎడమొహం పెడమొహంగా తయారయ్యారు, దీనంతటికి కారణమేమిటని ఆఊరిలో అందరికంటే వయసులో పెద్దవాడైన రంగయ్యను అడిగారు.
ఆయన ఒక చిన్న నవ్వు నవ్వి చూడండి నాయనలారా మనలో ప్రతి ఒక్కరు తాము జీవించే జీవన విధానాలను మన పురాణాలలోని ఆదర్శ వంతులైన మహానుభావుల జీవాతాలను ఆదర్శవంతంగా తీసుకొని అందుకు అనుగుణంగా నడుచుకొంటూ మనందరం జీవించాలి. ఉదాహరణకు ధర్మానికి ఆదర్శంగా ధర్మరాజును, స్నేహానికి ఆదర్శంగా కృష్ణ కుచేలులను, అన్నదమ్ముల అనుబంధాలకు ఆదర్శంగా రామలక్ష్మణులను, ప్రేమకు చిహ్నంగా రాధాకృష్ణులను ఆదర్శంగా తీసుకోవాలి.
లంకలో యుద్ధం ముగిసిన తర్వాత విభీషణుడు అందరినీ పుష్పక విమానంలో అయోధ్యకు తీసుకొని వచ్చాడు.సీతారాములు పుష్పక విమానంలోంచి దిగుతుంటే భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి రాముల వారికి పాదాభివందనం చేసి ఆయన పాదాలకు పాదుకలు తొడిగి వారిని కిందకు దింపుతుంటే.. రాముడు వారిరువురినీ ప్రేమగా తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన విభీషణుడు పక్కకు తిరిగి తన కళ్ళనుండి కారుతున్న కన్నీటిని తుడిచు కుంటూ.. “నా అన్న రావణుడు కూడా మహాను భావుడే. సమస్త శాస్త్రాలను చదువు కున్నవాడే.
పది తలలున్నవాడే. ఘోరమైన తపస్సులు చేసినవాడే. పుత్తడితో తయారు కాబడిన లంకకు అధిపతే. ముల్లోకాలను గడగడ లాడించిన వాడే. కానీ నేనే నాచేజేతులారా చంపించేసాను. ఇక కుంభకర్ణుడు కూడా సామాన్యుడు కాడు. నేనే చంపించేసాను. ఇప్పుడు అన్నయ్య కనపడితే అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పలకరించి, ఆయన పాదాలకు నమస్కరిద్దామంటే ఏడీ? అన్నయ్యా! నీ పాదాలకు పాదరక్షలు వేసుకో అని అంటూ భరతుని లాగా అన్నయ్య కాళ్ళదగ్గర పెడదామంటే ఏడీ? ఎక్కడ? అయ్యో నేనే చంపించేసానే.” అని తలుచుకుంటూ ఆవేదన చెందాడు.
ఇక సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి తన కళ్ళనుండి కారుతున్న కన్నీటిని తుడిచు కుంటూ.. “నా అన్న వాలి ఎదుటివారి బలాన్ని లాగగలిగే గొప్ప పరాక్రమ వంతుడు. నాలుగు సముద్రాలలో ఒకేసారి సంధ్యావందనం చేయగల సామర్థ్యమున్న బలవంతుడు. నేనే రాముడితోటి బాణం వేయించి చంపించేసాను. నాకు అన్న లేడు.. నేనిలా పాదుకలు తొడగలేనే. నేనిలా నా అన్నను ఆప్యాయంగా కౌగిలించుకోలేనే. అన్నయ్యా! అంటూ ఆప్యాయంగా ఎదురెళ్లి చెయ్యందించ లేనే.. అన్నను పోగొట్టుకున్న దురదృష్ట వంతుణ్ణి ” అని వేదన చెందాడు.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ చెయ్యి చెయ్యి పట్టుకుని జీవితాంతం ఎలాంటి అరమరికలు లేకుండా బతికారంటే ఆ గొప్ప వాళ్ళది మాత్రమే కాదు.. వాళ్ళు అలా బతికేటట్టుగా అవకాశాన్ని కల్పించిన వారు శాంతి స్థాపనంలో ఉన్న వారి భార్యలు. “మీనాన్న దశరథ మహారాజుగారి ఆజ్ఞ వలన మీ అన్న రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెడుతున్నాడు. ఇక మీవదిన ఆయనకు సహధర్మచారిణి కాబట్టి ఆయన వెంట వెడుతోంది.. కానీ నువ్వెందుకయ్యా వారి వెంట వెళ్ళడం” అని లక్ష్మణ స్వామిని భార్య ఊర్మిళ తన భర్తను ఆపి ఉండవచ్చు కదా! లేదే ఎందుకంటే లక్ష్మణుడితో పాటు ఆయన భార్య ఊర్మిళ కూడా ధర్మబద్ధంగా జీవించేవారు కాబట్టి, అన్నగారి కోసం ఆయన వెంట వెళ్ళిపోయాడు.
ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి ఈ నలుగురు తోడికోడళ్ళు వారి వారి భర్తలకు అన్ని విషయాలలో సహకరిస్తూ వారి ఉన్నతికి చేయూత నిచ్చేవారు. నిజానికి ప్రతి వివాహమయిన స్త్రీ తాను ఎంతో సహన శీలవతిగా ఉంటూ తన కుటుంబ క్షేమం కోసం అత్తమామలకు భర్తకు అనుకూలంగా ఉంటూ ఆదర్శవంతమైన, ఆచరణాత్మకమైన జీవితాన్ని గడుపుతూ పదిమందికి ఆదర్శంగా జీవించేవారు.
ఒక కుటుంబంలోని వారంతా ప్రశాంతమైన జీవనాన్ని గడప గలుగుతున్నారు అంటే అది ఆ ఇంటి కోడళ్ళ సఖ్యత, సభ్యత, సంస్కారాలపైన ఆధారపడి ఉంటుంది. ఆ తోడికోడళ్ళు వచ్చింది వేరే వేరే కుటుంబాల నుండైనా, వారంతా సఖ్యతతో ఉన్నపుడే అన్నదమ్ములు కూడా సఖ్యతతో ఉండగలుగుతారు.అలా కాకుండా అహంకారంతో నేను చెప్పిందే వేదమంటూ నా భర్త నా మాటే వినాలి అంటూ కుటుంబంలో మనస్పర్థలు తీసుకొచ్చి బేధాభిప్రాయాలు సృష్టిస్తే ఆ కుటుంబాలు చిన్నాభిన్నమై చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా విడిపోయి చెల్లాచెదురుగా అయి పోతారు.
ఇప్పుడు దశరథ రామయ్య కుటుంబంలో జరిగింది కూడా అదే. చూడండి అలాంటి భార్యలున్న అన్నదమ్ములు అన్నయ్య ఇంటికి తమ్ముడెళ్ళలేడు, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళలేడు. కానీ ఈ జన్మకు ఒక్క తల్లి కడుపున పుట్టిన వాళ్ళమనే భావన వారు కలిసి ఉన్నప్పుడే కదా కలిగేది. 55 ఏళ్ళు ఉన్న నువ్వు మహా బతికితే 70 ఏళ్లు వచ్చేవరకే కదా బతికేది. ఆ తరువాత నీవు స్వతంత్రంగా తిరగలేవు. ఆ తరువాత బతికితే మహా మరో రెండు మూడేళ్ళు బతుకగలవేమో.
కనీసం అప్పుడప్పుడైనా ఒకరింటికి ఒకరు వెళ్ళాలి. ఒకవేళ అలా వెళ్ళేది లెక్క పెట్టుకున్నా ఈ శరీరం ఉండగా మహా అయితే బహుశా ఏ కార్యాలకో వెళ్ళినా కొన్నిసార్లు మాత్రమే నీ తమ్ముడింటికి వెళ్ళగలవు. ఆ మాత్రం దానికి ఎందుకు ఇలా శతృవులుగా తయారై శతృత్వంతో కొట్టుకు చస్తారు? అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడెంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యి చెయ్యి పట్టుకుని, పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సంతోషంగా కలిసి మెలగలేరా.. నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుందా.. పోగొట్టుకున్న తరువాత ఏడ్చి ఉపయోగం ఏమిటి?
కాబట్టి నాయనలారా ! మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే “కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి వచ్చిన అదృష్టం ” అన్న పెద్దల మాటలను అనుసరించి అన్నదమ్ములు అందరూ కలిసి మెలిసి జీవిస్తూ మీరందరూ కూడా మీ జీవితాలను సుఖమయం చేసుకొంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్..
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com