ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
తాపత్రయ విమోచనం గురించి చక్కని కథ – Best Stories in Telugu
అయిదేళ్ళ వయసులో ఒక కుర్రవాడు హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద ఉండే బౌద్ధారామాలకి విద్యాభ్యాసం కోసం పంపబడ్డాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంవత్సరాల తరబడి సిద్ధాంత మూలసార జ్ఞానాన్ని సముపార్జించుకున్న తరువాత, ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్న గురువు ఆదేశంతో, ఆ భిక్షువు పర్వతశ్రేణుల మధ్య నుంచి దిగి మొట్ట మొదటిసారి నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడు.
అప్పటి వరకూ ఆశ్రమం దాటి బయటకురాని ఆ పద్దెనిమిదేళ్ళ యువకుడికి అంతా కొత్తగా ఉంది. బౌద్ధసాధువులకు సాంప్రదాయకమైన భిక్షాటన నాశ్రయించి, ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష అర్థించాడు. ఇంటి యజమాని యువ సాధువు కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి ఆహ్వానిoచి, భిక్ష వేయమని కూతుర్ని ఆదేశించాడు.
ఒక పదహారేళ్ళమ్మాయి లోపల్నుంచి ఏడు రోజులకి సరిపడా బియ్యాన్ని తీసుకొచ్చి అతడి జోలెలో నింపింది. ఆమెని చూసి యువకుడు చకితుడయ్యాడు. అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ని చూడలేదతడు. ఆమె గుండెల కేసి చూపించి తామిద్దరి మధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మనుష్యుల మధ్యకి తొలిసారి వచ్చిన సన్యాసి అని తెలుసు.
స్త్రీ పురుషుల తేడా గురించి చెపుతూ, వివాహం జరిగి తల్లి అయిన తరువాత పాలు ఇచ్చి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది కాబట్టి ప్రకృతి ఆమెకు ఆ విధమైన అవయవాలను సమకూర్చింది’ అని వివరణ ఇచ్చాడు.
సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆ రోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజుల దినుసులు వెనక్కి ఇచ్చి, తిరిగి తన గురువు దగ్గరకు చేరుకున్నాడు. ‘అలా ఎందుకు చేశావ’ని అడిగాడు గురువు.
“తర్వాతెప్పుడో కొద్ది కాలం తరువాత ప్రపంచంలోకి అడుగిడబోయే బిడ్డ కోసం తగు ఏర్పాట్లన్నీ ప్రకృతి ముందే సమకూర్చినప్పుడు, రేపటి ఆహారం గురించి ఈ రోజు తాపత్రయపడటం ఎంత నిష్ప్రయోజనమో నాకు అర్థమయింది స్వామీ!” అన్నాడా భిక్షువు.
“బౌద్ధం గురించీ, బంధం గురించీ సంపూర్ణమయిన జ్ఞానం నీకు లభించింది నాయనా” అంటూ శిష్యుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు బుద్ధ భగవానుడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
తాపత్రయ విమోచనం గురించి చక్కని కథ – Best Stories in Telugu