Sri Ramanujacharya Story in Telugu
రామానుజులు గారు మరణించి వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉంది. రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు.
ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. వేంకటేశ్వరుడి పరమభక్తుడు తిరుమల నంబి వారు రామానుజాచార్యులకు మేనమామ. విశిష్టాద్వైతాన్ని, ఆళ్వారుల వైభవాన్ని, భక్తి మార్గాలను మేనల్లుడికి పరిచయం చేసింది ఆయనే. భక్తి, పాండిత్యం, సంస్కరణ తత్వం కలిగిన తల్లి కాంతిమతి నుంచి రామానుజాచార్యులు అభ్యుదయ భావాలను అలవరచుకున్నారు.
అందుకే ఆయన మూఢాచారాలను వ్యతిరేకించేవారు.ఆత్మప్రబోధంతో కొన్నిసార్లు గురువులకు కూడా కనువిప్పు కలిగించారు. ఒకసారి ఆయన గురువు గోష్ఠిపూర్ణ ‘ఓమ్ నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి, ‘దీన్ని గోప్యంగా ఉంచాలి! ఎన్నడూ, ఎవరికీ చెప్పకు’ అన్నారు. కానీ ఆ మహామంత్ర జపంతో లభించే ఆధ్యాత్మిక ఫలం కొద్దిమందికే పరిమితం కాకూడదు అనుకున్నారు రామానుజులు.
మర్నాడు స్థానికులందరినీ సౌమ్యనారాయణ ఆలయం వద్దకు ఆహ్వానించి, అష్టాక్షరీ మంత్రాన్ని వినిపించారు. గురువు ఉపదేశించిన విజ్ఞానాన్ని దాపరికం లేకుండా ప్రకటించారు. అందుకు గోష్ఠిపూర్ణులు ఆగ్రహించి, ఫలితంగా నరకానికి వెళతావంటూ మందలించారు. దానికి రామానుజులు ‘గురువర్యా! ఇదిగో, ఇంతమంది ఆధ్యాత్మికోన్నతి సాధించారు. నేనిక నరకానికి వెళ్లినా చింతలేదు’ అన్నారు వినయంగా.
గురువు పశ్చాత్తాపంతో రామానుజులను ఆలింగనం చేసుకుని, ‘నువ్వు నాకు శిష్యుడివి కాదు, గురువువి!’ అన్నారు.సమాజంలో రావాల్సిన సంస్కరణలు తొలుత మతాలు, ఆలయాల నుంచే ఆరంభం కావాలని రామానుజులు ఆకాంక్షించారు. అందుకే ఆలయాల్లోని అస్తవ్యస్త పరిస్థితులను, అక్రమాలను సరిదిద్దారు. ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్న ఆగడాలను అరికట్టారు.
తన నిర్వహణలోని శ్రీరంగనాథ దేవాలయం నుంచే సంస్కరణలు ఆరంభించారు. మూఢాచారాలకు స్వస్తి పలికారు. కుల వివక్ష లేకుండా భగవంతుణ్ణి దర్శించుకునేలా, పెరుమాళ్ల ఉత్సవంలో అందరూ పాల్గొనేలా విధి విధానాలను సవరించారు.ఏడు ప్రాకారాలతో నిర్మితమైన శ్రీరంగనాథ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకలున్నాయి.
వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. సామాన్య శకం 11 – 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా, అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు.
పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల వారి శరీరానికి పూస్తారు.
అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయంటారు.
సమానత్వం విగ్రహం – Statue of Equality in Telugu
సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. ‘సమానత్వం విగ్రహం’గా పిలువబడే రామానుజాచార్య 216 అడుగుల భారీ విగ్రహాన్ని ఫిబ్రవరి5 – 2022 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 45 ఎకరాల సువిశాల స్థలంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఈ విగ్రహావిష్కరణకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం. కాగా భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని గతేడాది అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం. దీని ఎత్తు 182 మీటర్లు. కాగా నేడు ముచ్చింతల్‌లో ఆవిష్కృతం కానున్న రామానుజ విగ్రహం ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం కానుంది. థాయిలాండ్‌లోని బుద్ధ విగ్రహం (301 అడుగులు) కూర్చున్న భంగిమలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది.
45 ఎకరాల సువిశాల స్థలంలో తెలంగాణలోని రంగారెడ్డి శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 45 ఎకరాల స్థలంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుకు 2014లోనే శంకుస్థాపన చేశారు చిన్నజీయర్ స్వామి. ప్రవేశద్వారం రూపకల్పన తెలంగాణలోని ప్రసిద్ధ ‘కగాడియా’ శైలిలో రూపొందించారు. ప్రధాన ద్వారం వద్ద 18 అడుగుల ఎత్తైన హనుమాన్, గరుడ విగ్రహాలను కూడా ఉంచారు.
ఆలయ గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఇది రామానుజాచార్యుల జీవితపు 120 సంవత్సరాలను పురస్కరించుకుంటుంది. ఈ విగ్రహానికి రోజూ అభిషేకం, పూజలు, రాజభోగ సమర్పణ వంటి అన్ని రకాల సేవలు జరుగుతాయి. ఈ సమతామూర్తి మహా విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తామర పువ్వుపై కూర్చున్న రామానుజాచార్యుని విగ్రహం ఐదు లోహాలతో తయారు చేశారు. 42 అడుగుల ఎత్తులో రాగి ఫౌంటెయిన్ కూడా ఏర్పాటు చేశారు. లోపల 54 అంగుళాల ఎత్తులో 120 కిలోల బంగారంతో చేసిన మరో శ్రీరామానుజాచార్యుల విగ్రహం ఉంటుంది.
రామానుచార్య విగ్రహం చుట్టూ నల్లరాతితో చెక్కబడిన 108 చిన్న ఆలయాలు ఉన్నాయి. వీటిని దివ్య దేశం అంటారు. ఇవి బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, తిరుమల ఆలయాల తరహాలో రూపొందించడం జరిగింది. లోపల, ఆ ఆలయంలో దేవాగ్రహం కూడా పూజ్యమైన దేవత రూపంలో ఉంటుంది. ఇక మహా విగ్రహం చుట్టూ 8 పుణ్య క్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో ఏకంగా 108 ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాలను అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు.
మరోవైపు దివ్య క్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఫౌంటెయిన్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫౌంటెయిన్ పద్మ పత్రాలు విచ్చుకొనేలా రూపొందించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలిగేలా తీర్చి దిద్దారు. అలాగే, రామానుజులు ప్రభోధించిన సమానత్వ ఘట్టాలను సూర్యాస్తమయం తరువాత మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించనున్నారు.
రాజస్థాన్‌లో మాత్రమే లభించే పింక్ గ్రానైట్‌తో తయారు చేసిన పలు ఆకృతులు క్షేత్రం ఆవరణలో కనువిందు చేస్తున్నాయి. సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంఖు, చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు. రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియంను కూడా నిర్మించారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు, రెండు లక్షల మొక్కలు ఆధ్యాత్మిక శోభను మరింత పెంచేలా దర్శనమిస్తున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమయ్యే సహస్రాబ్ది ఉత్సవాల్లో దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు పాల్గొననున్నారు. దీనికోసం 120 యాగశాలల్లో ఒక వెయ్యి 35 హోమగుండాలను సిద్ధం చేశారు.
13 రోజుల పాటు ఉత్సవాలు రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల సందర్భంగా 13 రోజుల కార్యక్రమం నిర్వహించనున్నారు. ముచ్చింతల్ క్షేత్రంలో ఫిబ్రవరి 2 న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సమతా మూర్తి భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా.. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్న భంగిమలో ఉన్న 216 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. అలాగే, ఫిబ్రవరి 13న 120 కిలోల బంగారు రామానుజాచార్య బంగారు విగ్రహాన్నిరాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.