ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఓ రైతు తన మూడు గాడిదలను అమ్మేయడానికి అంగడికి తీసుకెళ్తున్నాడు… మార్గమధ్యంలో ఓ నది కనిపించింది… అసలే నడిచీ నడిచీ ఒళ్లంతా చెమట చిటచిట… స్నానం చేస్తే పుణ్యం, శుభ్రత రెండూ దక్కుతాయని అనుకున్నాడు.
ఆ గాడిదల్ని కట్టేయడానికి తన దగ్గర రెండే తాళ్లున్నాయి… మరి మూడో గాడిదను కట్టేయడం ఎలా..?
ఓ సన్యాసి అలా నడిచిపోతున్నాడు… తనను పిలిచాడు… స్వామీ, నీ దగ్గర ఓ తాడు ఉంటే ఇవ్వవా…? కాసేపు నా గాడిదను కట్టేస్తా, నా స్నానం కాగానే నీ తాడు నీకు తిరిగి ఇచ్చేస్తా..
నా దగ్గర తాడు లేదు కానీ ఓ ఉపాయం చెబుతాను అన్నాడు ఆ సాధువు.. నీ దగ్గర ఉన్న తాళ్లతో ఆ రెండు గాడిదలను కట్టెయ్.. మూడోది చూస్తూనే ఉంటుంది.. తరువాత దీని వెనక్కి వెళ్లి తాడుతో చెట్టుకు కట్టేస్తున్నట్టు నటించు..
సాధువు చెప్పినట్టే చేశాడు.. నదీస్నానం పూర్తిచేశాడు.. వెనక్కి వచ్చి ఆ రెండు గాడిదల కట్లు విప్పేశాడు.. అదిలించాడు, తను ముందు నడుస్తున్నాడు.. కాసేపయ్యాక చూస్తే రెండు తనతో వస్తున్నాయి కానీ మూడో గాడిద మాత్రం ఆ చెట్టు దగ్గర నుంచి అస్సలు కదలడం లేదు.. అక్కడే ఉండిపోయింది..
తట్టాడు, కొట్టాడు, తిట్టాడు… ఊహూఁ… ఫలితం లేదు… అటూఇటూ చూస్తుంటే అదే సాధువు కనిపించాడు… స్వామీ, స్వామీ, ఇది మొరాయిస్తోంది, కదలనంటోంది..
అసలు నువ్వు కట్లు విప్పితే కదా, అది కదిలేది… అన్నాడు సాధువు.
అసలు నేను కట్టేస్తే కదా విప్పేది… అంటాడు రైతు.
అవునోయీ, అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ గాడిదకు తెలియదు కదా… తను ఇంకా కట్టేసి ఉన్నట్టే భావిస్తోంది.
అయ్యో, మరేం చేయాలిప్పుడు!?
కట్లు విప్పితే సరి! కదులుతుంది!
అసలు కట్టేస్తే కదా? మరి విప్పేది!
పిచ్చోడా… కట్టేసినట్టు ఎలా నటించావో, విప్పేసినట్టు కూడా నటించవోయ్! రైతు అలాగే చేశాడు! గాడిద ముందుకు కదిలింది, మిగతా రెండింటితో కలిసింది! రైతు సాధువు వైపు అయోమయంగా చూశాడు!
మనుషులు కూడా అంతేనోయ్! కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్టు వ్యవహరిస్తాం, కదలం, ఉన్నచోటు వదలం! నిజానికి అవన్నీ భ్రమాత్మక బంధాలు… అవేమీ లేవనే నిజం తెలిస్తే చాలు… ప్రపంచమంతా నీదే.
అర్థమయ్యీ కానట్టుగా ఉంది! అవును, మరి తత్వం, సత్యం ఎప్పుడూ సంపూర్ణంగా అర్థం కావుగా! రైతు కాసేపు బుర్ర గోక్కున్నాడు! సాధువుకు ఓ దండం పెట్టి తన గాడిదల వైపు కదిలాడు.
గమనిక : ఈ ఆర్టికల్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com