Menu Close

సంక్రాంతి తరవాత రోజు జరుపుకునే కనుమ పండుగ విశేషాలు..

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

వ్యవసాయ పద్ధతులలో ఎన్నో యంత్రాలు చోటు చేసుకున్నప్పటికీ, ఇప్పటికీ చాలాచోట్ల పశువుల మీదే మన సాగు ఆధారపడి ఉంది. అలాంటి పశువుల కోసం కేటాయించిన ప్రత్యేకమైన పండుగే కనుమ! తెలుగువాడి పెద్ద పండుగ అయిన సంక్రాంతి, కనుమతోనే పూర్తవుతుంది. అందుకే ఇంటికి వచ్చిన చుట్టాలని ఈ రోజున పంపడానికి ఒప్పుకునేవారు కాదు. ఇప్పటికీ కనుమ రోజు ప్రయాణాలని వీలైనంతగా నిరుత్సాహపరుస్తారు పెద్దలు. అలా వచ్చినదే ‘కనుమ రోజున కాకి కూడా కదలదు’ అన్న సామెత.

sankranti kanuma

పొలాన్ని దున్నడం మొదలుకొని, పండిన ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడం వరకూ… రైతులకి వ్యవసాయంలో తోడుగా నిలిచిన పశువులకి కనుమ ఒక ఆటవిడుపు. అందుకే పశువులు ఉన్న ఇళ్లలో ఈ రోజు జరిగే హడావుడి అంతా ఇంతా కాదు. పండుగ రోజు ఉదయాన్నే వాటికి శుభ్రంగా స్నానాలు చేయిస్తారు. ఆపై మనసారా వాటిని అలంకరిస్తారు. బొట్టు పెట్టడం దగ్గర్నుంచీ కొమ్ములకు ఇత్తడి తొడుగులు తొడగడం వరకూ ఎవరికి తోచిన రీతిలో వారు అలంకరిస్తారు. వాటికి పందేలు కూడా నిర్వహిస్తారు. తమిళనాడులో అయితే ఈ రోజు పూర్తిగా ఎడ్ల పండుగే. వాళ్లు ఈ రోజుని ‘మట్టు పొంగల్‌’ అని అంటారు. మట్టు అంటే ఎద్దు అని అర్థమట.

కనుమకి సంబంధించిన తమిళనాట ఒక కథ ప్రచారంలో ఉంది. అనగనగా ఆ పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి, భూలోకంలో ఉన్న ప్రజలకి ఓ సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడట. ‘రోజూ చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమనీ, నెలకి ఓసారి మాత్రమే ఆహారం తీసుకోమన్న’దే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారుపడిపోయి ‘రోజూ చక్కగా తినమనీ, నెలకి ఓసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమనీ’ చెప్పాడట! నంది చేసిన నిర్వాకానికి ఒళ్లు మండిన శివుడు ‘మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా! అందుకని ఆ ఆహారాన్ని పండించడంలో నువ్వే పోయి సాయపడు’ అని శపించాడట. అప్పటి నుంచీ రైతులు ఆహారాన్ని పండించడంలో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయంటోంది ఈ గాథ.

తెలుగునాట కనుమనాడు తప్పకుండా గారెలను చేసుకుంటారు. ‘కనుమనాడు మినుములు తినాల’న్న సామెత కూడా ఈ ఆచారాన్ని స్పష్టం చేస్తోంది. గతించిన పెద్దలకు ప్రసాదంగా ఈ గారెలని భావించడమూ ఉంది. ఈ సమయంలో గారెలను తినడం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. మినుములు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి. చలికాలం తారస్థాయిలో ఉన్న ఈ సమయంలో మినుములు తినడం వల్ల, మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది.

కనుమనాడు వరి కంకులని ఇంటి చూరుకి వేలాడదీసే ఆచారం కూడా ఉంది. పిచ్చుకలు, పావురాళ్లు వచ్చి తినేందుకే ఈ ఏర్పాటు. మనిషి నాగరికతని నేర్చిన తరువాత అతనికీ మిగతా ప్రాణులకీ ఒక అడ్డుగోడ ఏర్పడిపోయింది. పిచ్చుకలు, కాకులు, పావురాళ్లు వంటి కొద్దిపాటి పక్షులు మాత్రమే ఇంకా మనతో కలిసి మనగలుగుతున్నాయి. తన చుట్టూ ఉన్న ఇలాంటి జీవరాశుల ఆకలి తీర్చినప్పుడే మనిషి జీవితానికి సార్థకత. పంచుకోవడం అంటే సాటి మనుషులతోనే కాదు, సాటి జీవులతో కూడా అన్న విలువైన జీవిత సత్యాన్ని అందిస్తోంది కనుమ.

Like and Share
+1
2
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading