ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఏంటి సార్.. అమెరికా ప్రయాణం ఎప్పుడు ‘స్టేడియంలో ఉదయపు నడకలో రోజూ కలిసే నా వృద్ధమిత్రుడు మోహన్ రావు గారిని అడిగాను’. ఏం చెప్పను ఆనంద్ మా అబ్బాయి నన్ను తీసుకువెళ్లడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నాకు ప్రయాణం పడటం లేదు అని సమాధానం ఇచ్చారు. మోహన్ రావు గారి వయస్సు 70 సంవత్సరాలు. ఇటీవలే భార్య చనిపోయింది.
ఉన్న ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. తండ్రిని తన దగ్గరకు తీసుకువెళ్లి పోయే ప్రయత్నం చేస్తున్నాడు. కోవిడ్ నిబంధనలతో వీసా సమస్య వల్ల ప్రయాణం ఆలస్యమవుతున్నట్లు ఉంది. నాకు మోహన్ రావు గారికి మధ్య దాదాపు 30 సంవత్సరాల వయస్సు తేడా ఉన్నప్పటికీ 6 నెలలు గా ఉదయపు నడకలో స్నేహం కుదిరింది.
ఒక రకంగా తన కొడుకు వయస్సున్న నన్ను కొడుకులాగానే భావిస్తారు. ఒక్కరోజు వాకింగ్ కి రాకపోయినా ఊరుకోరు. ఆయన కూడా వాతావరణం తో పనిలేకుండా వాకింగ్ కి వచ్చేస్తుంటారు. ‘అవును ఆనంద్.. నిన్న నేను నీకు వాట్సాప్ లో పెట్టిన గుడ్ మార్నింగ్ మెసేజ్ చూడలేదే’ అని అడిగారు. నాకు మోహన్ రావు గారితో ఉన్న ఒకే ఒక సమస్య ఇది.
ప్రతిరోజు ఉదయం 5.30 కల్లా రకరకాల పువ్వులతో, మంచి కొటేషన్ల తో ఉన్న గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతారు. ఇలా గుడ్ మార్నింగ్ మెసేజ్ లు పెట్టే వాళ్లంటే నాకు ఒకింత నచ్చదు. ఇటువంటి వాళ్ళు నాకు దాదాపు 20 మంది దాకా ఉంటారు. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ మెసేజ్ లతో నా మెమరీ నిండిపోతూ వాటిని డిలీట్ చెయ్యడానికి విసుగొచ్చేది. వీరిలో కొంతమంది గుడ్ నైట్ మెసేజ్ లు పెట్టేవారున్నారు. ఒకరిద్దరు పని పాట లేనివారు ఈ మధ్య గుడ్ ఈవెనింగ్ లు కూడా పెట్టేస్తున్నారు.
ఒక ప్రభుత్వరంగ సంస్థలో క్లర్కు గా పనిచేస్తూ ఉద్యోగ సంఘంలో ఒక చిన్నపాటి నాయకుడిగా ఉన్న నాకు యూనియన్ కి సంబంధించిన మెసేజ్ లతోనే సరిపోతుంది. మధ్యలో ఈ గుడ్ మార్నింగ్ మెసేజ్ లు ఒకటి.. తెగ విసుగు తెప్పిస్తాయి. ‘ఆ.. ఏమి చూస్తాం సార్. ఒక్కటా, రెండా ఎన్నని చూస్తాం’ అన్నాను. ‘అదికాదయ్య నీమీద ఎంతోఅభిమానం తో పెట్టే ఒక చిన్న మెసేజ్ కి జవాబు ఇవ్వకపోతే పోయే, కనీసం చూడాలి కదా’ అన్నారు మోహన్ రావు గారు.
ఆయన అన్న మాటలకు కొంచెం మనస్సు చివుక్కుమని ‘అలాగే సార్ ఇక నుంచి తప్పక చూస్తా అన్నాను. అన్నట్లు మీ కేర్ టేకర్ రోజూ వస్తుందా’ అని అడిగాను. ఆ కేర్ టేకర్ ని నేనే మాట్లాడిపెట్టాను. ‘ఆ వస్తుంది.. వస్తుంది కానీ ఈ రెండు రోజులు వాళ్ళ అమ్మాయి కి ఒంట్లో బాగోలేదని ఊరుకి పోయింది’. అన్నారు.
‘అంటే వంట పని అదీ మీరే చేసుకోవాలన్న మాట’ అన్నాను . ‘అవును ఆనంద్ నాకూ కాలక్షేపమేలే’ అన్నారు. ‘సరే సార్ ఇక వెళదాం చాలా సమయమైంది’ అని ఎవరిళ్లకు వాళ్ళం బయలుదేరాం. మోహన్ రావు గారి ఇల్లు, మా ఇల్లు ఇద్దరివి స్టేడియం కు దగ్గరలోనే ఉంటాయి. ఆయనకు స్టేడియంకు దగ్గరలోనే ఉన్న ఖరీదయిన అపార్ట్మెంట్ లో ఒక డబుల్ బెడ్రూం ఫ్లాట్ ఉంది.
అప్పుడప్పుడు ఆయన నన్ను కాఫీ కి పిలుస్తూ ఉండేవారు. నేను కూడా ఈ ఆరునెలల కాలం లో ఓ రెండుసార్లు వెళ్లి ఉంటాను. అమెరికా లో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఐశ్వర్యానికి లోటు ఉండదు. కానీ ఆత్మీయతకు మాత్రం ఎప్పుడూ వెంపర్లాడుతూనే ఉంటారు. ఆ రోజంతా గుడ్ మార్నింగ్ మెసేజ్ గురించి మోహన్ రావు గారు అన్న మాటలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
మర్నాడు ఉదయం 5.30 గంటలకు నిద్రలేచిన నాకు నిన్న ఉదయం మోహన్ రావు గారి మాటలు గుర్తొచ్చి వెంటనే నా మొబైల్ లో వైఫై ఆన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేశా. దాదాపు రోజూ పెట్టేవారి నుండి వచ్చే గుడ్ మార్నింగ్ మెసేజ్ లు అన్ని వచ్చాయి ఒక్క మోహన్ రావు గారి నుంచి తప్ప. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
నాకు పరిచయం అయిన ఈ 6 నెలల్లో ఏ ఒక్క రోజు ఆయన దగ్గర నుండి గుడ్ మార్నింగ్ మెసేజ్ రాని రోజు లేదు. ఒకవేళ నేను ఆయన మెసేజ్ లను పట్టించుకోవడం లేదని కోపం వచ్చిందేమో అన్న అనుమానం కలిగింది. సరేలే వాకింగ్ లో మాట్లాడుకోవచ్చులే అని స్టేడియం కు బయలుదేరా.. ఆశ్చర్యంగా ఈరోజు మోహన్ రావు గారు వాకింగ్ కు కూడా రాలేదు.
మనస్సులో ఏదో వెలితితో ఆయనకు కాల్ చేశా. రింగ్ అవుతుంది. కానీ లిఫ్ట్ చేయలేదు ఆయన. ఏదో తెలియని దిగులు తో నా వాకింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చేసా. టిఫిన్ చేసి ఆఫీసుకు బయలుదేరుతూ టైమ్ చూసా 9 గంటలయ్యింది. ఇంకా గంట టైం ఉందిగా.. ఒకసారి మోహన్ రావు గారి ఇంటికి వెళదాం అనిపించింది.
ఆయన ఉండే అపార్ట్మెంట్ మా ఆఫీసు కు వెళ్లే దారిలోనే ఉంది. వాళ్ళ అపార్ట్మెంట్ బయట బైక్ పార్క్ చేసి 4 వ ఫ్లోర్ లో ఉన్న మోహన్ రావు గారి ఫ్లాట్ వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కా. రెస్పాన్స్ లేదు. అలా మూడు సార్లు నొక్కి లాభం లేదని ఆయనకు కాల్ చేశా. రింగ్ అవుతుంది. గానీ లిఫ్ట్ చేయడం లేదు. శ్రద్ధగా వింటే ఇంట్లోనుంచి ఆయన ఫోన్ రింగ్ సౌండ్ వినిపిస్తున్నది. వెంటనే తలుపు తట్టాను. అయినా సమాధానం లేదు.
అనుమానం వచ్చి మరింత గట్టిగా తలుపులు బాదాను. అటువైపు నుండి సమాధానం లేదు గానీ అటుప్రక్క ఇటుప్రక్క ఫ్లాట్ ల వాళ్ళు వచ్చారు. అందులో ఒకాయన ఆ అపార్ట్మెంట్ కార్యదర్శి కూడానట. ఏంటని అడిగారు. విషయం చెబితే వాళ్ళు కూడా తలుపులు కొట్టారు. కానీ సమాధానం లేదు. వెంటనే అందరం కూడా బలుక్కుని తలుపులు బద్దలు కొట్టాం.
లోపల హాల్లో దృశ్యం చూసి నాకు నోరు పెగలడం లేదు. గొంతు తడారి పోయింది. సోఫాలో మోహన్ రావు గారు కట్టెలా బిగదీసుకుపోయి ఉన్నారు. ఎప్పుడు పోయిందో ప్రాణం, ఎంత వేదన అనుభవించారో. నా మనసంతా బాధతో నిండిపోయింది. తండ్రిలాంటి మనిషిని ఆ పరిస్థితిలో చూసి కన్నీళ్లు ఆగటం లేదు. ఇంతలో కార్యదర్శి మోహన్ రావు గారి అబ్బాయికి కాల్ చేసి చెప్పారు.
వెంటనే బయలుదేరతానని చెప్పినట్లు ఉన్నాడు వాళ్ళబ్బాయి. అప్పటివరకు చేయవలసిన కార్యక్రమాలను కార్యదర్శి గారు ఎవరెవరికో ఫోన్ లోనే పురమాయిస్తున్నారు. అచేతనంగా ఉన్న నన్ను ఆలోచనలు చుట్టు ముడుతున్నాయి. గుడ్ మార్నింగ్ మెసేజ్ అనేది కేవలం పనీ పాటా లేని వాళ్ళు పంపేది కాదని, అందులో ప్రేమ , అభిమానం, ఆప్యాయతతో పాటు ఒక మనిషి యొక్క ఉనికి కూడా ఇమిడివుందని నాకు అప్పుడే అర్ధం అయ్యింది.
రోజూ గుడ్ మార్నింగ్ పెట్టే వ్యక్తి ఒక్కరోజు పెట్టకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆనుపానులు, ఆరోగ్య విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, అందులో ఇలా వయసు మళ్లి ఒంటరిగా ఉంటున్న వ్యక్తుల పట్ల మరింత అప్రమత్తం గా ఉండాలని అర్ధమైంది. గుడ్ మార్నింగ్ మెసేజ్ యొక్క నిజమైన అర్ధం నాకు బోధ పడింది. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక పై ప్రతి గుడ్ మార్నింగ్ మెసేజ్ కు తప్పనిసరిగా రిప్లై ఇవ్వాలని, నా అనుకున్న వారందరికీ నేను కూడా ‘గుడ్ మార్నింగ్’ మెసేజ్ పెట్టాలని.
తాప్పకుండా షేర్ చేయండి మిత్రులారా ..