Menu Close

‘ఆతిథ్యం’ అంటే భోజనం పెట్టడం మాత్రమే కాదు


అతిథి దేవోభవ, ‘ఆతిథ్యం’ అంటే భోజనం పెట్టడం మాత్రమే కాదు

ఆత్మీయంగా ఆదరించడం ఆతిథ్యంలోని ప్రధానాంశం. ఇంటి ముందుకొచ్చి అర్థించిన ముష్టివాళ్ళక్కూడా ఆహారం పెడతాం. కానీ, అది ఆతిథ్యం కాదు.

ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదంటుంది యోగవాసిష్ఠం.

సకలమూ బ్రహ్మస్వరూపమే. ఇచ్చేవాడు, పుచ్చుకొనేవాడు… రూపంలో భేదాలే తప్ప ఇద్దరిలోనూ ఒకే అంతర్యామి కొలువున్నాడు కదా ! కనుక భేదం లేదు.

ప్రపంచంలో చెట్ల కన్నా మించిన ఆతిథ్య ధర్మం చూపగలవారు ఉండరు!ఎవరో నాటుతారు. ఇంకెవరో నీరు పోస్తారు. అవి కాలంతోపాటు చెలిమి చేస్తూ ఎదిగి వృక్షాలవుతాయి. పువ్వులు పూస్తాయి. కాయలు కాస్తాయి. పక్షులకు ఆశ్రయం, ఆహారం సమకూరుస్తాయి. బాటసారులకు నీడనిస్తాయి. చివరకు కట్టెలుగా మారి మనిషికి అక్కరకొస్తాయి.

ఇంతటి సేవాధర్మం నిర్వర్తిస్తూ, మౌనంగా జీవితం ప్రారంభించి, మౌనంగానే నిష్క్రమిస్తాయి.

దత్తాత్రేయ గురుచరిత్రలో ఒక అవధూత, ప్రకృతిలో ఎందరో తనకు గురువులుగా చెబుతాడు.

ప్రతి ప్రాణీ జీవితంలో ఉండే మౌన సందేశాలను అవధూత ఆకళింపు చేసుకుంటాడు. అంతకంటే గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వత చూడలేం.

ప్రాపంచిక దృష్టితో చూస్తే ఏదీ గొప్పగా అనిపించదు. వస్తువుల్ని, వ్యక్తుల్ని మన కొలబద్దతోనే కొలుస్తాం. మన దృష్టిని బట్టే అంచనాలు వేస్తాం.

శిలను శిల్పంగా మార్చినప్పుడు విలువ పెరుగుతుంది. బంగారం నగగా రూపొందినప్పుడూ అంతే. కొందరు సామాన్యులుగానే కనిపిస్తారు. కానీ, వారిలో అసమాన ప్రజ్ఞ దాగి ఉంటుంది.

వివేకానందుడు అమెరికా వెళ్లినప్పుడు ఆయన రూపం, వేషంకేసి అందరూ చులకనగా చూశారట. ఒక మహిళ ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. వివేకానందుడి తొలి సంబోధనతోనే సభ హర్షధ్వానాలతో దద్దరిల్లి పోయిందని చెబుతారు. ఆయన జ్ఞాన జ్యోతి. కొన్ని తరాలకు సరిపడా జ్ఞాన సంపదను ఆయన జిజ్ఞాసువులకు వదిలి వెళ్ళాడు.

ప్రపంచంలో జీవితావసరాలు లభిస్తాయి. కానీ, జ్ఞానం అంత సులువుగా లభించదు.

నచికేతుడి కథలో యముడు ఎన్ని విధాల ప్రలోభపెట్టినా, పట్టుదలగా అతడు జ్ఞానభిక్షనే కోరుకున్నాడు. అంతవరకు నిరాహారంగా, అతిథి మర్యాదలను తిరస్కరించాడు.

ప్రాణాధారమైన అన్నపానాలను గృహస్థు అతిథికి భక్తిశ్రద్ధలతో సమర్పించడాన్నే అతిథి యజ్ఞం అంటారు. అంటే, అతిథిని సంతృప్తిపరిస్తే యజ్ఞఫలం దక్కుతుందని అర్థం చేసుకోవాలి. అతిథి రూపంలో ఇంద్రుడు వచ్చి బీదగృహస్థు రంతిదేవుణ్ని పరీక్షించిన కథ సుప్రసిద్ధం.

కుచేలుడికి కృష్ణుడు కేవలం స్నేహ వాత్సల్యమే చూపలేదు. అనితర సాధ్యంగా ఆతిథ్యమిచ్చాడు. స్వయంగా పాదాలు కడిగాడు. తన అష్టదేవేరుల చేత సేవలు చేయించాడు. అష్టైశ్వర్యాలూ అనుగ్రహించాడు.

ఇక్కడ మనం గమనించాల్సింది- ఆతిథ్యంలోని ఆత్మీయ భావనకున్న విలువ.

ఆదిశంకరులకు గృహిణి ఒక్క ఉసిరికాయను భక్తితో సమర్పించి, కనకధారా స్తోత్రానికి ప్రేరణనిచ్చింది. అదే ప్రపంచానికి కల్పవృక్షమైంది.

అతిథి తృప్తిపడినప్పుడు “అన్నదాతా సుఖీభవ” అన్న ఒక్క మాటకున్న విలువ అమూల్యం. ఆ మాటను అంతర్యామి ఆశీస్సుగానే భావించాలి.

అతిథికి ఆకలి, దాహం తీర్చగల ఆహార పానీయాలు సమకూర్చగలిగితే చాలు. అవి ఖరీదైనవా, సామాన్యమైనవా అనే ప్రసక్తి తలెత్తదు.

సర్వదేవతా స్వరూపిణిగా గోమాతను భావించినట్లే అతిథిని దైవ స్వరూపంగా భావించి ఆదరించడమే భారతీయ సంప్రదాయం.

అతిథికి కులమతాలతో, జాతితో ఎలాంటి దుర్విచక్షణా చూపకూడదుఅప్పుడే అది అసలైనఆతిథ్యం అవుతుంది !

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Share with your friends & family
Posted in Telugu Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading