ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అవి నేను ఒకటవ తరగతి చదువుకునే రోజులు. ఒకరోజు తరగతిలో ఒక అందమైన పాప రెండు జడలు వేసుకుని అందంగా ముద్దుగా బొద్దుగా చక్కగా ముస్తాబై మా క్లాస్ లో జాయిన్ అయింది. అప్పటిదాకా అంత అందమైన పిల్లని చూడలేదేమో వెంటనే మనసుపారేసుకున్నాను. ఎందుకంటే బొద్దుగా ఉంటే బలే ఇష్టం నాకు.
దేవుడు నాయందు ఉండి లక్కీగా ఆ పాపని టీచర్ నా పక్కనే కూర్చోబెట్టారు. నా ఆనంధానికి అవధులు లేవసలు. భుజంమీద చెయ్యేసి ఏం పేరు అని అడిగాను. పద్మ అని చెప్పింది. ఇంకేముంది ఆ పిల్ల మాట్లాడిన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోయాను. అప్పట్నుంచీ మా అమ్మకి తెలియకుండా వెచ్చాలు తెమ్మన్న దాంట్లోంచి చిల్లర నొక్కేసి, నాన్నగారితో గోల చేసి చిల్లర పట్టేసేవాడిని.
ఆ డబ్బులతో తనకి చిరుతిల్లు కొనిపెట్టేవాడిని. అప్పుడప్పుడు కల్లోకి కూడా వచ్చేది. ఏమైందో ఏమో తన కనిపించడం మానేసింది. స్కూల్ కి రావడంలేదు. అప్పట్లో ఫోన్ లు లేవు కదా కనుక్కుందామంటే వాళ్ళ ఇంటిముందే టచ్చాడేవాడిని. ఎప్పుడు తనింటికెళ్లినా గుండేసుకుని బండగా పందిలా ఒక బుడ్డాగాడు కనిపించేవాడు.
తనకి అన్నయ్యేమోలే అని లైట్ తీస్కున్నాను. నా చిన్ని గుండెలో ఒకటే గుబులు. వారం అయింది ఏమైందో ఎలా ఉందో తిన్నదో లేదో ఇదే ఆలోచన. ఆ ఆలోచనలతోనే స్కూల్ కి బయలుదేరాను. క్లాస్ కి ఆలస్యం అయింది. టీచర్ గారితో తిట్లు తిని నా బెంచ్ దగ్గరకు వెళ్లాను. తను కూర్చునే చోట, బండగా పందిలా ఉన్నాడన్నాకదా వాడు కూర్చుని ఉన్నాడు. నాకు ఎక్కడో మండిపోయింది.
బుర్ర మీద గట్టిగా ఒక్కటిచ్చాను. వెంటనే వాడు ఏడుపులంకించుకున్నాడు. ఏమైందని టీచర్ అడిగేసరికి ఆ బండోడు మొత్తం చెప్పేసాడు. టీచర్ గారు ఏమైంది రోజూ వాడితో బాగానే ఉండేవాడివికదా ఈరోజు ఏమైంది వాడిని అంతలా కొట్టావ్ అన్నారు. అప్పుడు అర్ధమైంది వాడి గొంతు అప్పుడు గుర్తుపట్టాను. ఇది మన పాప గొంతు కదా అని. రియలైజ్ అయ్యాను వాడు అమ్మాయ్ కాదు అబ్బాయి అని. వాడిపేరు పద్మారావు అని. మొక్కుబడి తీర్చుకోవడం కాస్త ఆలస్యం అయి జుట్టు అంతలా పెరిగితే, ఆడపిల్లల ముచ్చట తీరక వాళ్ల అమ్మగారు వీడినిలా ముస్తాబు చేసిందని. ముద్దుగా వాడిని పద్మ అని పిలుస్తారని. అలా తొలిప్రేమలో భంగపడ్డ నేను, మరలా అమ్మాయిల జోలికి వెలితే ఒట్టు. అమ్మాయిల ఊసెత్తితే ఒట్డు.