ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Fundamentals of Marriage in Hindu Culture – మాంగళ్య బంధం యొక్క ప్రాథమిక అంశాలు మరియు ప్రాముఖ్యత
కొన్ని దశాబ్దాల పూర్వం వరకు తెలుగు కుటుంబాలలో పెళ్లి జరగడం ఒక సాంప్రదాయ, సాంస్కృతిక, సాంఘిక క్రతువు. వయసొచ్చిన వెంటనే జరిగే సందడి. పెళ్లిలో చెప్పే మంత్రాల అర్థం ఏమాత్రం తెలియక పోయినా అది ఒక వేడుకలా, వేడుకగా పెద్దల ఇష్టానుసారం చేసికొని వాళ్ళ గురుత్వంలో యువతీయంవకులు, స్త్రీ పురుషులు భార్యా భర్తలు గా ఒదిగిపోయి గార్హస్థ్య ధర్మాలు నిర్వర్తించేవారు.
కాని అబ్బాయికి ఉద్యోగం ఉండడం లేదా తర తరాలుగా కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉండటంతో పాటు మంచి కుటుంబం నుంచి రావడం అర్హతలుగా ఉండేవి. వరకట్నం ఇచ్చే ఆచారం ఉండేది. అది వారి వారి మాటల్లో అంతస్థులను బట్టి నిర్ణయించుకునేవారు. కయ్యానికైనా, వియ్యానికైనా సమాన స్థాయి ఉండాలి అనేవారు. అలా నిర్ణయించుకునేవారు. దాని వల్ల కలిగే లాభనష్టాలు, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ప్రారబ్ధం అని సర్దుకుపోతూ
జీవితాలు గడిపేసేవారు.
అంతక్రితం ఉన్న కన్యాశుల్కాన్ని తోసిరాజని ప్రవేశించిన వరకట్నాన్ని ఆదరించారు. ఈ సాంఘిక పరిణామానికి కారణం తెలియదు. అంత క్రితం గురజాడ వారి ఆధ్వర్యంలో కన్యాశుల్కం నిరసించబడినట్టే కాలక్రమేణా వరకట్నం కూడా నిరసించబడింది, కాళ్ళకూరి వారి నాటికతో. తరువాత నిషేధించబడింది కూడా.
కానీ బడా బడా నాయకులు, డబ్బున్నవారు వరకట్నాలను ఇస్తున్నారు, స్వీకరిస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలలో వరకట్నం అడగడం, ఈయడం తగ్గింది, కాని పూర్తిగా పోలేదు. కాని పెళ్లి ఖర్చు పేరుతో ఖర్చు బాగా అవుతోంది, కాని పెళ్ళి కొడుక్కి కాని, పెళ్లి కూతురికి కాని తల్లిదండ్రుల ఆదాయంలోంచి పైసా రావటం లేదు. మిగలటం లేదు.
అంత డబ్బూ మేరేజ్ హాల్స్ కి, అలంకరణ చేసే వారికి, కేటరర్స్, ఫొటోగ్రాఫర్లకి పంచబడుతోంది. వరకట్నం ఇవ్వనవసరం లేకపోవడంలోని ఆర్ధిక రిలీఫ్, వెసులుబాటు కన్యాదాతకి దక్కడం లేదు. మరి ఈ విషయం గురించి మేధావులు కాని, సాహితీ స్రష్టలు కాని పట్టించుకోవటం లేదు.
ఆస్తుల్లో కూతురికి వాటా లేనప్పుడు తండ్రి సంపాదనలో వారి భాగంగా వరకట్నం కూతురికి మంచి, వడిదుడుకులు లేని జీవితం కోసం ఈయబడేది. తర్వాత్తర్వాత కయ్యానికైనా, వియ్యానికైనా సమాన స్థాయి పాటించకుండా అమ్మాయి తల్లిదండ్రులు తమ స్థాయిని, స్తోమతనీ మించి డబ్బు లేకపోయినా అప్పులు చేసి వరకట్నం సర్దటంతో సంఘంలో కలకలం బయలుదేరింది.
ఎవరెంత ఆదర్శంగా కబుర్లు చెప్పినా, పెళ్లి అనేది ఒకవిధమైన ఆర్ధిక ఒప్పందం. డబ్బు ప్రసక్తి లేకుండా అమ్మాయికి కాని, అబ్బాయికి గాని పెళ్లి కాదు. మనం రోజూ, ఉద్యోగం లేని అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు అస్సలు రాకపోవడం గమనిస్తూనే ఉన్నాం. అబ్బాయి అందగాడైనా, ఆరోగ్యవంతుడైనా, గుణవంతుడైనా, సౌజన్యశీలి అయినా ఉద్యోగం లేకపోతే ఎవరూ పిల్లనిస్తామని రారు. ఇది కఠోర సత్యం. అబ్బాయిల పాలిటి ఘోర వాస్తవం. దీనిపై ఓ కన్యాశుల్కమో, వరకట్నమో లలా నాటకాలు రావటంలేదు.
ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న జవరాళ్ళకి పెళ్లి ఆఫర్లు దండీగా రావడానికి కారణం వారు సంపాదిస్తున్న డబ్బే. అంచేత తరం తరానికి ఆర్ధిక కారణాల వల్ల పెళ్లి సంబంధాలు వచ్చే తీరు, పెళ్ళిళ్ళు జరిగే తీరు మారుతూ ఉంటాయి. మారిపోతాయి.
దశాబ్దాల క్రితం కూడా ఆర్ధిక స్థాయి పెళ్లి జరగడంలో పెద్ద పాత్ర వహించినా, పెళ్ళయ్యాక వారి ఆర్ధిక స్థాయి
ఏదైనా పెళ్ళికి, గార్హస్థ్య జీవితానికి సాంప్రదాయ కళ,
సాంస్కృతిక శోభ ఉండేవి. పెళ్లి అనే బంధాన్ని స్త్రీ పురుషులు గౌరవించేవారు. చాలా మంది నిబద్ధతతో ఉండేవారు. వారి వారి కుటుంబ బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించేవారు.
ఇళ్ళల్లో ఎన్ని గొడవలు జరిగినా, పోట్లాడుకున్నా, మాటలు అనుకున్నా కుటుంబం క్షేమం కోసం సర్దుకుపోయేవారు. బయటపెట్టే వారు కారు. సహనం చూపిస్తూ ప్రేమను పంచుతూ, భరించ
లేనప్పుడు మాటలు అనుకుంటూ, భరిస్తూ బంధాన్ని గౌరవిస్తూ గడిపేసుకునేవారు. ఇంటి పెద్ద, ఆయన మాట అందరూ వినడం వంటి సాంప్రదాయాలు ఉండేవి. అందరూ ఆ సాంప్రదాయానికి అణిగిమణిగి, ఒదిగి ఉండేవారు.
తమ తమ వ్యక్తిత్వాలను కుటుంబ సంక్షేమం కోసం
త్యాగం చేసేవారు. ఇప్పుడు భార్యాభర్తలే ఒకళ్ళకోసం ఒకళ్ళు వ్యక్తిత్వాలను త్యాగం చేసే స్థితిలో లేరు. ఇంక అత్త మామలు, ఇతర కుటుంబసభ్యుల విషయంలో చెప్పాలా?
ఇప్పుడు పెళ్లి సాంప్రదాయం, సంస్కృతి ఛాయలను కోల్పోయి, పరస్పర బాధ్యతా నిర్వహణ లను కూడా నిర్లక్ష్యం చేసికొని, వట్టి ఆర్ధిక సంబంధంగా మారిపోయింది. మారిపోతోంది.
పెళ్లి ఇప్పుడు తన కళ, శోభలను కోల్పోతోంది. బాధ్యతలు తీసికునే విధంగా యువతీ యువకులను మలచలేకపోతోంది. వివాహ బంధం సన్నని దారంగా మారిపోయింది. ఎప్పుడు పుటుక్కున తెగుతుందో తెలియదు. పెళ్ళి బంధం ఏర్పరచలేక పోతోంది. బందీలుగా ఉన్నాం అనే నిస్పృహను పెంచుతోంది.
పెళ్లి చేసుకోవడం వ్యక్తి నిర్వహించవలసిన సామాజిక బాధ్యతలలో ఒకటి అని యువతీయువకులు గమనించడం లేదు. పెళ్ళిని రతి సుఖం కోసమే చేసుకుంటే ఆ పెళ్లి నిలవదు. ఆస్తుల కోసం చేసుకుంటే కొంత వరకు నిలుస్తుంది. పెళ్ళి చేసుకోవడం ఎవరికోసమో మాత్రమే అనుకుని, మనకోసం కూడా అనుకోకపోతే వెంటనే పెటాకులవడం తథ్యం.
నచ్చితే లైక్ చెయ్యండి, తప్పకుండా షేర్ చెయ్యండి.
Fundamentals of Marriage in Hindu Culture, Importance Hindu of Culture, Hindu Life Style, Greatness of Hinduism