Telugu Moral Stories
అడవిలో పిచ్చుక ఒకటి ఒక చెట్టుకు గూడు కట్టుకుని ఆనందంగా ఉంది. దాని గుడ్లు రేపోమాపో పొదిగేట్లున్నాయి. ఒక రోజు ఒక ఏనుగు రెచ్చిపోయి, అడొచ్చిన చెట్లు పుట్టలు ధ్వంసం చేస్తూ పిచ్చుక గూడు కట్టుకున్న చెట్టును సమీపిస్తే, పిచ్చుక కాళ్ళావేళ్ళా పడి ఆ చెట్టును ఏమీ చేయొద్దని వేడుకొంది.
ఏనుగు వినకుండా చెట్టును, గూడును ధ్వంసం చేసి, పిచ్చుక గుడ్లను చిదిమేసింది. పిచ్చుక గుండె చెరువైంది. ఇది చూసిన ఒక వడ్రంగిపిట్ట పిచ్చుకను సముదాయించి, “ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు, ఏమీ సాధించలేం. జరిగిన నష్టాన్ని పూడ్చలేం. నీకు నేను సహాయం చేస్తాను.” అనింది.
వాళ్ళిద్దరూ ఒక ఈగకు జరిగినదంతా చెప్తారు. ఈగ అంతా విని, ఇద్దరినీ కప్ప దగ్గరికి తీసుకెళ్తే, కప్పకు కూడా వివరించింది పిచ్చుక. “ఏనుగు పెద్ద జంతువు. దాన్ని ఏమీ చేయలేరు. అయితే అందరం కలిస్తే దాని పొగరు అణచవచ్చు. నేనొక ఉపాయం చెప్తాను.” అనింది కప్ప.
అందరూ ఒప్పుకున్నారు. ” మంచి ఎండలో, ఈగ, ఏనుగు ఆనందించేలా చెవిలో దూరి పాడుతుంది. అప్పుడే వడ్రంగి పిట్ట దాని కళ్ళు పొడిచి గుడ్డిదాన్ని చేస్తుంది. ఏనుగుకు కళ్ళ నొప్పులతో పాటు, నోరెండి పోతుంది. కళ్ళు కనబడవు, చెరువు దగ్గరకు వెళ్లలేదు. అప్పుడు నేను దగ్గరగా ఉన్న గొయ్యి దగ్గర నుండి గట్టిగా బెకబెక మంటాను.
అక్కడ నీళ్ల కోసం వచ్చి ఏనుగు గోతిలో పడిపోతుంది. ఆ విధంగా పిచ్చుక కోసం ప్రతీకారం తీర్చుకోవచ్చు.”తరవాతి రోజు ప్లాన్ పక్కాగా అమలు పరిచారు. గుడ్డి ఏనుగు గోతిలో పడి గాయాల పాలౌతుంది.
ఎంత చిన్న వాళ్ళైనా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే గొప్ప ఫలితాలను పొందవచ్చు.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.
Telugu Moral Stories