ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.
భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.
భక్తులు ఈరోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులూ చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే “భక్తవశంకర” అన్నారు.
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలూ పట్టవు. దుర్గుణాలన్నీ అలవరచు కుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహా శివరాత్రి నాడు కావాలని కాకున్నా, అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆవిధంగా ముక్తి పొందుతాడు. అదీ సంగతి. శివరాత్రి మహత్యం అంతటిది.