Menu Close

సంక్రాంతి గొప్ప పండుగ..మనందరికీ పెద్ద పండుగ.

సూర్యడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణం అని పిలుస్తాం. ఇలా సూర్యడు ఏడాదిలో పన్నెండు రాశులలోనూ సంచరిస్తాడు. అయితే ఆయన ధనూరాశి నుంచి మకరరాశిలోకి అడుగుపెట్టే సమయానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటివరకూ దక్షిణదిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, తన దిశను మార్చుకుని ఉత్తరదిక్కుగా సంచరిస్తాడు. అందుకనే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుచుకోవడం కద్దు. ఇలా సూర్యడి గమనం మారడం వల్ల ఇప్పటివరకూ ఉన్న వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది. సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి, ఎప్పుడూ ఈ పండుగ తేదీ పెద్దగా మారదు.

సంక్రాంతినాడు కొత్త బియ్యంతో పిండివంటలని చేసుకోవడంలో అర్థం, పరమార్థం రెండూ కనిపిస్తాయి. సంక్రాంతినాటికి పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో గాదెలే కాదు, రైతుల మనసులూ నిండుగా ఉంటాయి. అయితే ఇలా కొత్తగా చేతికి వచ్చిన బియ్యంతో ఎవరూ అన్నం వండుకోరు. ఎందుకంటే కొత్త బియ్యం అజీర్ణం చేస్తుంది. అందుకని వాటిని బెల్లంతో జోడించి పరమాన్నంగానో, అరిసెలుగానో చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల అటు పిండివంటా చేసుకున్నట్లవుతుంది, ఇటు జీర్ణసమస్యలూ తలెత్తవు. తమిళనాట సంక్రాంతినాడు ఇలా పొంగలి చేసుకోవడమే ముఖ్యమైన ఘట్టంగా ఉంటుంది. అందుకే అక్కడ ఈ పండుగకి పొంగల్‌ అన్న పేరు స్థిరపడింది. మరోవైపు కొత్త బియ్యంతో వండిన పిండివంటలని నైవేద్యంగా అర్పించడం వల్ల, పంట చేతికి అందినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞత తెలిపినట్లవుతుంది.

సంక్రాంతినాడు చేసే పిండివంటలన్నిటిలోనూ నువ్వులను ధారాళంగా వాడతారు. అరిసెలకీ, సకినాలకీ నువ్వులు దట్టిస్తారు. బిహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో అయితే కేవలం నువ్వులతోనే పిండిపదార్థాలని చేసి ఒకరికొకరు పంచుకుంటారు. సంక్రాంతి సమయంలో ఇలా నువ్వులని వాడటంలో ఒక ఆరోగ్య రహస్యం ఉంది. నువ్వులు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే నువ్వుల నుంచి నూనె తీసిన తరువాత ఆ తెలక పిండిని సైతం పారేయకుండా పశువులకి పెడతారు. అయితే నువ్వులలో ఉండే అధికపోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తాయి. అందుకనే మన ఆహారంలో నువ్వులని పెద్దగా వాడరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి నిదానంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులని తినడం వల్ల, మారుతున్న వాతావరణానికి శరీరం అలవాటు పడుతుంది.

Limited Offer, Amazon Sales
Fire-Boltt Smart Watch at Lowest Price
Buy Now

సంక్రాంతినాడు పెద్దలకు తర్పణం విడువటం ఆచారంగా వస్తోంది. మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో తమ పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ ఇలా తర్పణాలను విడుస్తారు. తమకు చక్కటి జీవితాన్ని అందించి, మార్గదర్శకులుగా నిలిచిన పెద్దలకు ఇలా కృతజ్ఞతలను చెప్పుకుంటారు. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ మాత్రమే కాదు, పెద్దల పండుగగా కూడా నిలుస్తుంది.

మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ అని చెబుతోంది సంక్రాంతి. కానీ ఒకరికి ఇచ్చేందుకు ముందు మన దగ్గర ఉండాలి కదా! పంటలు పండి ధాన్యం ఇళ్లకి చేరుకునే సంక్రాంతి సమయం, దానం చేసేందుకు సరైన సందర్భంగా నిలుస్తుంది. హరిదాసులు, బుడబుక్కలవారు, పగటివేళగాళ్లు, గంగిరెద్దులవారు… ఇలా రకరకాల వాళ్లు తమ విన్యాసాలతో పండుగ శోభను పెంచుతారు. తమ స్తోమతని అనుసరించి వచ్చినవారికి వచ్చినట్లు బియ్యాన్ని కొలిచి పోయడం రైతు కుటుంబాలకి అంత భారంగా ఉండదు.

ఇక సృజనకి సూచనగా నిలిచే సంక్రాంతి ముగ్గులు, నట్టింట్లో ఠీవిగా నిలిచే బొమ్మల కొలువులు, పిల్లల ఊహల్లా గాల్లోకి ఎగిరే గాలిపటాలు… ఇలా సంక్రాంతిని ఆలంబనగా చేసుకుని ఒకటా రెండా… పదుల కొద్దీ ఆచారాలు అసలైన పండుగకు నిర్వచనంగా నిలుస్తాయి.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Limited Offer, Amazon Sales
Boult Earbuds at Just Rs.799
Buy Now

Subscribe for latest updates

Loading