Menu Close

సంక్రాంతి ముందు రోజు జరుపుకునే భోగీ పండుగ విశిష్టత తెలుసుకోండి?

Bhogi

మనము సహజంగా పండగలన్ని చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసుకొవడం జరుగుతుంది.కాని ఈ సంక్రాంతి మాత్రం సూర్యున్ని ప్రధానంగా తీసుకుని నిర్ణయం చేయడం జరుగుతుంది.సంక్రాంతి పండగ అనేది మూడు రోజుల పర్వదినం.తిధితో సంబంధం లేని పండగ. ఈ మూడు రోజుల పండగలలో మొదటి రోజు భోగి పండగ. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేది భోగి. దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు ఈ రోజు.

భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం, ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇండ్లకు వచ్చే కాల సమయం. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానానంతరం ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలికి భోగి మంటలలో పాత పనికిరాని వస్తువులను వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటారు.

తెల్లవారకముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభం అవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొని ఉన్నజీవితాన్ని ప్రారంభిస్తున్నాము అని ఆత్మారామునికి మాట ఇచ్చి భవగత్ సన్నిదిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది.

ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు భోగి పండ్లను పోయడం వలన వారికి ఉన్న బాలారిష్టాలు, ఇతర దోషాలు తొలగి పోతాయి. పిల్లలకు భోగి పండ్లను సాయంకాల సమయంలో పోస్తారు. ఈ భోగి పండ్లలో రేగుపండ్లు, జీడిపండ్లు, కొన్ని చిల్లర నాణేములను, బియ్యం పిండితో చేసి నువ్వుల నూనేలో వేయించిన చిన్ని చిన్న వేపగింజల ఆకారంలో తాల్కలు, చెరుకుగడ ముక్కలను ఈ ఐదింటిని ఒకచోట కలిపి ఇంట్లో ఉన్న పిల్లలో ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన వారికి కొత్త బట్టలు వేసి కూర్చోవడానికి చాప, దుప్పటి లాంటిది వేసి తూర్పు వైపు ముఖం ఉండేలాగ కూర్చో బెట్టి నుదటన కుంకుమ బొట్టు పెట్టి ఇరుగు పోరుగు పిల్లలను పిలిచి భోగి పండ్లను రెండు చేతులతో పిల్లల తలపై నుండి క్రిందకు జారపడే లాగ పోయాలి. ఆ క్రింద పడిన భోగి పండ్లను పిల్లలు సరధా పడుతు, పోటి పడుతూ ఏరుకుని తింటారు.

రేగుపళ్లలో సి విటమిన్ రేగుపళ్లలో ‘సి’ విటమిన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగుపళ్లు ఉపయోగపడతాయి. అందుకే రేగు పళ్లని ఎండపెట్టి వాటితో వడియాలను, రేగుతాండ్రనూ చేసుకుని తినే అలవాటు ఇప్పటికీ తెలుగుప్రాంతాలలో ఉంది. ఇంకో కారణం భోగి ముగిసాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకరరాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు.

ఈ సంక్రాంతి భోగి రోజు కొన్ని ప్రాంతలలో ముత్యైదువలు కొత్త గాజులు వేసుకుంటారు. గాజులు తొడిగిన గాజుల వ్యాపారికి వారి పంట పోలాలలో పండిన కొత్త వడ్లను, ధాన్యములను అనవాయితిగా ఇచ్చి సంత్రుప్తిగా సాగనంపుతారు. ఇంటికి వచ్చిన కొత్త అళ్ళులు, కూతుర్లతో సరదాగా ఆనందగా ఉంటారు. ఈ రోజును కుటుబంలో ఎంతగానో ఆనంద ఆప్యాయతల మధ్య అనుభూతులు పొందుతారు. పేద గొప్ప అనే తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో ఆనందగా గడుపుతారు.

ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ధనుర్మాసంలో చివరి రోజు ఈ రోజు కావడం చేత దినమంతా దైవ చింతనతో గడుపుతారు. విష్ణుచిత్తుని కుమార్తె ఆండాళ్ ఈ ధనుర్మాసంలోనే కాత్యాయిని వ్రతం చేసి సాక్షాత్తు భగవంతున్ని మెప్పించింది.భవంతున్ని మనస్సు పెట్టి ఎవరైతే ద్యానిస్తారో వారి పట్ల దేవుడు వారి వారి కోరిన కొర్కేలను తప్పక తీరుస్తాడు అని మనకు పురాణ,ఇతిహాసాల ద్వార తెలుస్తుంది.

భోగి పండుగను ఎందుకు జరుపుకుంటారు?

భోగిపండుగ ఇంద్రుని గుణించి చేయబడే పండుగగా కనిపిస్తుంది. ఇంద్రుడు మేఘాధిపతి. మేఘాలు లోకానికి వర్షాలు ఇస్తాయి. పంటలు పండడానికి వర్షాలు అవసరం. కాగా సకల వర్షాల కోసం ఇంద్రుని పూజించే ఆచారం ఏర్పడింది. ఇట్టి పూజల వలన ద్వాపరయుగంలో ఇంద్రుడికి గర్వం హెచ్చిపోయింది. అందుచేత అతనికి గర్వభంగం చేయాలని కృష్ణుడికి తోచింది. ఇంతలో ఒకానొక భోగిపండుగ వచ్చింది.

యాదవులందరూ ఇంద్రపూజకు ఆయత్తులయ్యారు. అప్పడు ఆ గొల్లలతో కృష్ణుడు ఇట్లా చెప్పాడు. “మనం గోవులను మేపుకొనే గొల్లలం. కర్షకులకువలె మనకు వర్షాలు అంతగా అక్కరలేదు. మన గోవులకు మేత ఇచ్చేది గోవర్ధన పర్వతం మిది పచ్చికబయలు. కాబట్టి మనం ఈనాడు గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాము. వర్షాధిపతి ఇంద్రపూజ జోలికి మనం పోవద్దు.

కృష్ణుని ఈ మాటలకు గొల్లలు అంగీరించారు. ఇంద్రపూజకు స్వస్తి చెప్పారు. గోవర్ధనగిరిని పూజించడానికి ప్రారంభించారు. ఇంద్రుడు ఇది తెలిసికొన్నాడు. అతనికి కోపం వచ్చింది. తన మేఘాలను వదిలి పెద్ద వర్షం కురిపించాడు. ఆ జడివానలో తడిసి మద్దయి గొల్లలు శ్రీకృషునితో తమ గోడు చెప్పకున్నారు. అప్పడు శ్రీకృష్ణుడు గోవర్ధనపర్వతాన్ని ఎత్తి పట్టుకుని యాదవుల అందరికీ వారి గోవులతో దాని క్రింద ఆశ్రయం కల్పించాడు. తన వద్ద ఉన్న ఏడు రకాల మేఘాలను వదిలి కూడా ఇంద్రుడు యాదవులను ఏమిూ చేయలేకపోయాడు. అంతటితో ఇంద్రుడికి గర్వభంగమై బుద్ధి వచ్చింది. కృష్ణుని మహత్తు తెలిసికొని ఇంద్రుడు అప్పడు పాదాక్రాంతుడయ్యాడు. అందుమిూద కృష్ణుడు అతనిని మన్నించి భోగిపండుగనాడు మామూలుగా మళ్లీ ఇంద్రపూజ జరిగేటట్టు ఆనతి ఇచ్చాడు.

Like and Share
+1
0
+1
1
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading