మనసు మీద నిగ్రహం ఉంటే వచ్చే ఫలితం ఎక్కువగా ఉంటుంది – Moral Stories in Telugu
ఒకరోజు అక్బర్ బాదుషా ఒక అడవిలో తపస్సమాధిలో ఉన్న రుషివర్యుణ్ణి చూసి ఆకర్షితుడయాడు. ఆ జ్ఞానసంపన్నుడి దారిద్ర్యాన్ని చూసి బాధపడ్డాడు. ఏదైనా సాయం చేయాలనుకొన్నాడు. స్వామీ మీరు మా నగరానికి పావనం చేస్తే సకల సౌకర్యాలున్న మంచి భవంతి నిర్మించి ఇస్తాను అన్నాడు.
రాజా! ఈ మనోహరమైన వనసీమను వదిలి నేను ఆ రాళ్లమధ్య ప్రశాంతంగా జీవించలేను. క్షమించండి! అన్నాడు. పోనీ.. శరీరం మీద కౌపీనంతో అనునిత్యం మారే వాతావరణంలో బాధలు పడటమెందుకు? దయచేసి పట్టు పీతాంబరాలు స్వీకరించి మమ్మల్ని పావనం చేయండి! అని ప్రాదేయపడ్డాడు చక్రవర్తి.
దైవం ప్రసాదించిన దుస్తులు కదా ఆత్మమీది ఈ శరీరం. ఆ దుస్తులకు మరిన్ని దుస్తులా! మన్నించండి! నాకు ఇలా ఉండటమే సౌకర్యంగా ఉంటుంది అన్నాడు రుషివర్యుడు చిరునవ్వుతో. కనీసం మీరు తాగేందుకైనా ఈ స్వర్ణపాత్రను గ్రహించి మమ్మల్ని సంతోషపెట్టండి సాధుమహారాజ్! అన్నాడు అక్బర్.
దోసిలి ఉండగా వేరే పాత్రలు ఎందుకు? దండగ్గదా! అన్యథా భావించకండి రాజా! అని మహర్షి సమాధానం. పోనీ.. సుఖంగా శయనించేందుకు ఒక పర్యంకం అయినా తెప్పించమంటారా? రాజుగారి ప్రార్థన. సాధువుది మళ్ళా అదే సమాధానం. ప్రకృతి ప్రసాదించిన ఇంత చక్కని పచ్చిక బయలుండగా వేరే శయ్యాసుఖాలు నాకెందుకు మహారాజా! అని నిరాకరించాడు రుషివర్యుడు.
రుషి నిరాడంబర సాధు జీవనానికి విస్మయం చెందాడు అక్బరు మహారాజు. సాధు మహారాజుకి ఏదైనా సరే ఒకటి సమర్పించి తీరాలని పంతం పెరిగింది అక్బరు చక్రవర్తికి. ఇప్పుడంటే ఇలా ఉన్నారు. భవిష్యత్తులో తమరికి ఏది కావాలన్నా నిస్సంకోచంగా మాకు కబురు చేయండి! అడగడానికి మొహమాటమైతే ఈ అగ్రహారం మీకు రాసి ఇస్తున్నాం. యధేచ్చగా అనుభవించండి అంటూ రాజుగారు రుషికి సమాధానం ఇచ్చే వ్యవధానం కూడా ఇవ్వకుండా నిష్క్రమింఛారు.
స్వామీ! సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో నాకు ఇప్పుడర్థమయింది అన్నాడు అప్పటిదాకా అక్కడే నిలబడి అంతా చూస్తున్న శిష్యపరమాణువు భక్తి ముప్పిరిగొనగా.
సర్వసంగ పరిత్యాగమా నా బొందా! రాజుగారి మొదటి కోరికనే మన్నించి ఉంటే నాకేమి మిగిలేదిరా శిష్యా! మన్నుతో కట్టిన నాలుగ్గోడల భవనం. ఇప్పుడు అలాంటి భవనాలు వంద కట్టించగలను. పట్టు పీతాంబరాలు, స్వర్ణమయ పాత్రలు, హంసతూలికా తల్పాలు ఎన్నైనా ఏర్పాటు చేసుకోగలను ఒకరిని యాచించకుండా! చివరి కోరిక వరకు మనసు మీద అదుపు సాధించానే .. దీన్నే అంటారు. నువ్వు అ అనుకొంటున్న ‘ఆత్ననిగ్రహం‘.
అర్థమయిందా?’ అన్న గురువు బోధను విని నోరువెళ్లబెట్టాడు శిష్యపరమాణువు.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.