కలసివుంటే కలదు సుఖం – Neethi Kathalu
ఒక అడవిలో ఒక ఒంటె, ఒక ఎలుక వుండేవి. రెండూ ఇళ్ళకు రంగులు వేసే పని చేసేవి. ఆ రెండింటికీ ఒకటంటే ఇంకొకదానికి అస్సలు పడేది కాదు.
ఎలుక ఇళ్ళ లోపల చక్కగా రంగులు వేసేది. కానీ పై కప్పులు ఎత్తుగా వుండడంతో వేయలేక పోయేది. అలాగే ఒంటె ఇళ్ళ పై భాగంలో చక్కగా రంగులు వేసేది. కానీ లోపలవైపు వంగి సరిగ్గా వేయలేక పోయేది.
ఒక రోజు ఆ అడవికి ఒక కోతి పక్కవూరి నుంచి వచ్చింది. అది గూడా రంగులు వేసేది. కోతి చిన్నగా వుండడంతో ఇళ్ళలోపల బాగా రంగులు వేసేది. అలాగే పైకి చకచకా ఎక్కి పై కప్పులకు గూడా సులభంగా రంగులు వేసేది. . దాంతో అందరూ ఎలుకను, ఒంటెను పిలవడం మానేసి కోతినే పిలవసాగారు.
కొద్దిరోజుల్లోనే వాటికి పని దొరకడం ఆగిపోయి తినడానికి తిండి లేక అల్లాడసాగాయి. దాంతో ఒకరోజు రెండూ ఒకచోట కలుసుకున్నాయి. మనం ఇలా విడివిడిగా వుండడం వల్ల మూడోవాడు లాభపడుతున్నాడు. ఇప్పటినుంచి కలసి వుందాం. లోపలి గదులకు ఎలుక, పై కప్పులకు ఒంటె రంగులు వేయాలి అనుకున్నాయి. మరుసటి రోజు ఎలుక ఒంటె మీద కూచోని రంగుల డబ్బాతో బైలుదేరింది. అది చూసి అన్ని జంతువులు సంతోషించాయి.
మరలా వాటినే పనికి పిలవసాగాయి.
కనువిప్పు – Pitta Kathalu
ఒక అడవిలో ఒక ఎలుగుబంటి వుండేది. దానికి ఒంటినిండా వెండ్రుకలు వుండేవి. ఆ వెండ్రుకలంటే ఎలుగుబంటికి చాలా అసహ్యం. నీళ్ళలో తన రూపాన్ని చూసుకుంటూ చాలా బాధపడేది. ఎలుగుబంటి అడవిలోని రకరకాల రంగురంగుల పక్షులను, జంతువులను చూసేది. అబ్బ నాకు కూడా ఒళ్ళంతా వెండ్రుకలు లేకుండా ఇలా రంగులుంటే ఎంత బాగుండు అనుకునేది. నీటిలో ఈదే రంగురంగుల చేపలను చూసి తెగ బాధపడేది.
కొంత కాలానికి చలికాలం వచ్చింది. పక్షులు ఆ చలికి తట్టుకోలేక పోతున్నాయి. ఆహారం కోసం బైటికి రాలేక ఆకలికి బాధ పడుతా గూళ్ళలోనే వణుకుతూ కూర్చున్నాయి. జంతువులు ఆ చలికి బైట తిరగడం మానేశాయి. నీళ్లు గడ్డకట్టి చేపలు చనిపోసాగాయి. ఎలుగుబంటి మాత్రం హాయిగా తిరుగుతూవుంది. దానికి కొంచం గూడా చలివేయడం లేదు.
ఒక కుందేలు అది చూసి వణుక్కుంటా “ఎలుగుమామా! నీదే హాయి. నీ ఒంటినిండా దట్టమైన వెండ్రుకలున్నాయి కొంచంగూడా చలి వెయ్యకుండా. చూడు మేమంతా ఎలా వణికిపోతున్నామో, మాకు కూడా ఈ పనికిరాని రంగుల బదులు నీలాగా వెండ్రుకలు వుంటే ఎంత బాగుండేదో” అంది. ఆ మాటలకు ఎలుగుబంటి “నిజమే! ఈ వెండ్రుకల వల్లనే గదా నేను ఈ చలికి తట్టుకోగలుగుతున్నాను. హాయిగా తిరగ గలుగుతున్నాను. కడుపునిండా తినగలుగు తున్నాను” అనుకొంది. తనకు ఈ రూపం ఇచ్చినందుకు ఆ దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకొంది.
అనుభవం – Telugu Short Stories
ఒక ఊరి పక్కన ఒక చిన్న చెరువు వుంది. అందులో రెండు కప్పులు వున్నాయి. ఎండాకాలం రావడంతో ఆ చెరువు ఎండిపోయింది. అప్పుడు చిన్న కప్ప పెద్ద కప్పతో “ఇక్కడికి కొంచం దూరంలోనే ఒక పెద్ద బావి వుంది. అక్కడికి పోదామా. దానిలో నీళ్లు చానా ఉన్నాయి” అనింది. సరేనని పెద్దకప్ప దానితో పాటే బైలుదేరింది.
పెద్దకప్ప బావిని చూసింది. అది చాలా లోతుగుంది. దాంతోపాటు నీళ్ళు కూడా అడుగున కొంచమే ఉన్నాయి. “దీనిలోకి దూకుదామా” అడిగింది. చిన్నకప్పు. అప్పుడు ఆ పెద్దకప్ప “ఇందులోకి దూకడం సులభమే కానీ తిరిగి బైటకు రావడం మన వల్ల కాదు. నీళ్ళు గూడా ఎక్కువగా లేవు. ఎండిపోయిందనుకో చావడం తప్ప వేరే దారి ఉండదు” అనింది.
నువ్వు ఎప్పుడూ ఇంతే. ఏదీ ఒప్పుకోవు. అన్నీ అనుమానాలే. నీతో నేను రాను. నాకు ఈ బావే నచ్చింది అంటూ చిన్న కప్ప దాని మాటను వినకుండా దూకేసింది.
పెద్దకప్ప అలాగే వెదుక్కుంటూ, వెదుక్కుంటూ ఇంకో పెద్ద చెరువు చేరుకొంది. ఎండాకాలం మరింతగా ముదిరింది. బావిలోని నీళ్ళన్నీ ఆవిరయిపోయాయి. చిన్నకప్పకు దిక్కు తోచలేదు. ఎంత ఎగిరినా పైకి రాలేకపోయింది. “పెద్ద కప్ప ఆ రోజు అనుభవంతో చెప్పిన మాట వినకపోతిని కదా” అని బాధపడుతూ ఆ కప్ప చనిపోయింది.
సాధువు – తేలు – Stories in Telugu
ఒక సాధువు నదిలో నీళ్ళు పోసుకుంటూవుంటే ఒక తేలు కొట్టుకపోతా కనబడింది. ఆ సాధువు ఆ తేలును కాపాడుదామని దానిని చేతిలోనికి తీసుకున్నాడు. వెంటనే ఆ తేలు సాధువుని కసుక్కున కుట్టింది. చెయ్యి సురుక్కుమనేసరికి ఆ సాధువు తేలును వదిలేశాడు. మరలా ఆ తేలు నీళ్ళలో పడి గిలగిలా కొట్టుకోసాగింది.
“అరెరే….పాపం చచ్చిపోతావుందే” అని ఆ సాధువు ఆ తేలును మరలా చేతిలోనికి తీసుకున్నాడు. అంతే… మరలా ఆ తేలు సాధువును కసుక్కున కుట్టింది. చేయి సురుక్కుమనేసరికి మరలా ఆ సాధువు తేలును వదిలేశాడు. మరలా ఆ తేలు నీళ్ళలో పడి గిలగిలా కొట్టుకోసాగింది. ఈ సారి ఆ సాధువు తేలుని వేగంగా చేతుల్లోకి తీసుకోని, అంతే వేగంగా కుట్టక ముందే ఒడ్డుకి విసిరేశాడు. అదంతా చూసి ఒడ్డుమీద వున్న ఒకడు “సామీ… ఆ తేలు నిన్ను అంతగా కుడుతావున్నా ఎందుకు కాపాడావు” అని అడిగాడు. ఆ సాధువు నవ్వి “కుట్టడమనేది తేలు పని . ఇతరులకు మేలు చేయడం అన్నది నా పని. దాని పని అది చేసినప్పుడు నా పని నేనూ చేయాలి గదా” అన్నాడు.
గాయం మానినా మచ్చలు మానవు – Telugu Kathalu
ఒక పిల్లవాడు ఎప్పుడూ ఏదో ఒక తప్పు పని చేసి అందరినీ బాధ పెడుతుండేవాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ పిల్లవాన్ని తిడుతూ ఉండేవాళ్ళు. అది చూసి వాళ్ళ నాన్న చాలా బాధ పడేవాడు. వాళ్ళ ఇంటిలో ఒక చెక్క తలుపు ఉండేది. ఆ పిల్లవాడు తప్పు చేసినప్పుడల్లా వాళ్ళ నాన్న ఒక మేకు ఆ తలుపుపై కొట్టడం మొదలుపెట్టాడు. అలా కొద్ది కాలానికి ఆ తలుపంతా మేకులతో నిండిపోయింది.
కొడుకు ఒక రోజు అది చూసి… నాన్నా ఎందుకిలా తలుపుకు ఇన్ని మేకులు కొట్టావు అన్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసావో నీకు తెలియాలి గదా… అందుకే నీవు తప్పు చేసినప్పుడల్లా ఇలా ఒక మేకు కొడుతున్నాను అన్నాడు. నేను ఇన్ని తప్పులు చేశానా అని ఆ పిల్లవాడు బాధ పడిపోయాడు. ఇప్పటి నుంచీ మంచిపనులు చేయడం మొదలు పెడతాను. నేను ఒకొక్క మంచి పని చూసినప్పుడల్లా ఒకొక్క మేకు తీసివేయి అన్నాడు.
వాళ్ళ నాన్న సరే అని ఆ పిల్లవాడు మంచిపని చేసినప్పుడల్లా ఒకొక్క మేకు తీసివేయసాగాడు. అలా కొంతకాలం గడిచేసరికి ఆ తలుపుకున్న మేకులన్నీ తొలగిపోయాయి. అప్పుడు ఆ పిల్లవాడు సంబరంగా నాన్నా… ఇక నేను మంచివాన్ని అయిపోయినట్టే గదా అన్నాడు. దానికి వాళ్ళ నాన్న… అయిపోయినట్టే గానీ నువ్వు ఒకసారి ఆ తలుపును బాగా పరిశీలించి అది ఎలా వుందో చెప్పు అన్నాడు. పిల్లవాడు ఆ తలుపును బాగా గమనించి నాన్నా… మొదట ఈ తలుపు అందంగా, నున్నగా ఉండేది. మేకులు పీకేశాక ఇప్పుడు అంతా గుంతలు గుంతలుగా ఉంది అన్నాడు.
వాళ్ళ నాన్న నవ్వి… చూడు బాబూ… దెబ్బ మానినా గాయం తాలూకు మచ్చ ఎలా జీవితాంతం ఉంటుందో… అలా మనం చేసిన తప్పుల తాలూకు మరకలు మనలని అంత తొందరగా వదలవు. కాబట్టి అసలు తప్పు చేయకుండా చూసుకోవాలి. ఇంకా నువ్వు ఎన్నో మంచి పనులు చేయాలి. అప్పుడు గానీ ఈ మరకలు పోవు. చుట్టుపక్కల వాళ్ళు నిన్ను నమ్మరు అని చెప్పాడు.
తేనెటీగ – సీతాకోకచిలుక – Chanda Mama Kathalu
ఒక తేనెటీగకు బాగా ఆకలవుతుంటే తేనెకోసం వెదుకుతూ బైలుదేరింది. దానికి ఒకచోట ఒకతోట కనబడింది. ఆ తోటనిండా అందమైన రకరకాల రంగురంగుల పూలు వున్నాయి. తేనెటీగ ఆ పూలను చూచి ఆనందంగా వాటిపై వాలి తేనెను తాగబోయింది. అంతలో… ఒక సీతాకోకచిలుక అక్కడకు వచ్చింది. “ఏయ్… లే… ఇది నా తోట. ఇక్కడికెవరూ రాగూడదు” అంది. తేనెటీగ దాన్ని వేడుకుంటూ “ఓ సీతాకోకచిలుకా… చాలా ఆకలిగా వుంది. కొంచం తేనె తాగి వెళ్ళిపోతాను’ అని వేడుకొంది. ఐనా సీతాకోకచిలుక కొంచం గూడా దయ చూపించలేదు. దానిని తోటనుండి బయటికి తరిమేసింది.
తేనెటీగ ఆకలితో మరలా చాలా దూరం వెతుక్కుంటూ పోయి ఇంకోతోటను చేరుకుంది. కడుపునిండా తేనెతాగి ఆనందంగా ఇంటికి తిరిగి బైలుదేరింది. దారిలో మొదట చూసిన తోట కనబడింది. ఆ తోటను దాటుకుంటూ పోతూవుంటే అంతలో దానికి సీతాకోక చిలుక ఏడుపు వినిపించింది. “ఏమైందబ్బా… సీతాకోకచిలుక బాధ పడతావుంది” ఒక అల్లరి పిల్లవాడు నవ్వుతూ సీతాకోక చిలుకను పట్టుకొని కనబడ్డాడు. వాని చేతివేళ్ళ నడుమ దాని రెక్కలు నలిగిపోతున్నాయి. అది బాధతో విలవిలలాడుతూ వుంది. అది చూసి తేనెటీగకు “అయ్యో….. పాపం” అనిపించింది. వెంటనే ‘ఝం’ అని పెద్దగా చప్పుడు చేసుకుంటూ సర్రునపోయి వాని చేతిమీద గట్టిగా కుట్టింది.
చేయి సురుకు మనేసరికి పిలవాడు ఆదిరిపడి “అబ్బా” అంటూ చేతిలోని సీతాకోక చిలుకను వదిలివేశాడు. వెంటనే సీతాకోకచిలుక ఎగురుతూ అక్కడినుంచి తప్పించుకుంది. తనను కాపాడిన తేనెటీగతో “ఓ తేనెటీగా! నన్ను మన్నించు. ఆకలితో వున్న నిన్ను అకారణంగా తరిమేసినా… నువ్వు అదేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడావు. నీ మేలు ఎప్పటికీ అంది. తేనెటీగ చిరునవ్వు నవ్వింది. ఆరోజునుండీ ఆ రెండూ బాగా కలసిమెలసి ఆ తోటలోనే హాయిగా గడపసాగాయి.
ఎరక్కపోయి ఇరుక్కుపోయా – Telugu Stories Text
ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. అది చాలా వేగంగా పరుగెత్తేది. దానితో పోటీపడి ఏ జంతువూ గెలిచేది కాదు. దాంతో ఎలుగుబంటికి బాగా పొగరెక్కింది. కనబడిన జంతువునల్లా పోటీకి రమ్మంటూ ఎగతాళి చేసేది. ఇదంతా ఒక కుందేలు చూసింది. దానికి ఎలాగయినా సరే ఎలుగుబంటి పొగరు అణచాలని అనిపించింది.
“ఒక రోజు ఎలుగుబంటితో నేను ఎటువైపు పరుగెత్తితే నీవు కూడా అటువైపు నా వెనకాలే నా అంత వేగంగా ఆగకుండా అరగంట పరుగెత్తగలవా” అని సవాలు చేసింది. “ఓస్… అదెంత పని. సరే” అంది ఎలుగుబంటి. ముందు కుందేలు, వెనుక ఎలుగుబంటి పరుగెత్తడం మొదలు పెట్టాయి. కుందేలు పుట్టల చుట్టూ, గుట్టల చుట్టూ సర్రు సర్రుమని పరుగెత్తసాగింది. ఎలుగుబంటిగూడా అంతే వేగంగా సర్రుమని పరుగెత్తసాగింది.
కుందేలు అలా పరుగెత్తుతా… పరుగెత్తుతా… వేగంగా… ఒక గొట్టంలోకి దూరింది. ఆ గొట్టం కుందేలుకన్నా లావుగా, ఎలుగుబంటి కన్నా సన్నగా ఉంది. ఎలుగుబంటి అదేమీ చూసుకోకుండా కుందేలు వెంటే అది గూడా సర్రుమని గొట్టంలోకి దూరింది. అంతే దాని నడుం దగ్గర గొట్టంలో ఇరుక్కుపోయింది. అటు ముందుకు పోలేక, ఇటు వెనుకకూ రాలేక లబోదిబోమనసాగింది. అది చూసి జంతువులన్నీ ఒకటే నవ్వసాగాయి. ఆఖరికి ఎలుగుబంటి కాపాడమంటూ వాటిని వేడుకొంది. అవి జాలిపడి వెనక కాళ్ళు పట్టుకొని నెమ్మదిగా బైటకు లాగాయి. ఆరోజు నుంచి ఎలుగుబంటి వినయంగా అన్నిటితో కలసిమెలసి ఉండసాగింది.
టక్కరి కోతి – Inspiring Telugu Stories
ఒక అడవిలో ఒక కోతిపిల్ల వుండేది. అది చాలా తెలివైనది. ఒకరోజు ఆ కోతిపిల్ల ఆహారం కోసం వెదుక్కుంటా… వెదుక్కుంటా… ఒక గుహలోకి పోయింది. ఆ గుహ ఒక పెద్దపులిది. కోతిపిల్లకు ఆ విషయం తేలీదు. ఆహారం కోసం వెదుకుతావుంటే గుహలోపల పై భాగం నుండి ఏదో చెట్టు వేరు కిందికి వేలాడుతా కనిపించింది.
ఆ వేరుని లాగుతే ఏదైనా దుంప దొరుకుతుందేమోనని కోతి లాగసాగింది. అంతలో బైటకు పోయిన పెద్దపులి గుహలోకి తిరిగి వచ్చింది. కోతిని చూడగానే దానికి నోరూరింది. “ఆహా… ఈ రోజు మంచి విందుభోజనం దొరికింది” అనుకుంటూ మీదకు దూకబోయింది. కోతిపిల్ల ఆ పులిని చూసి అదిరిపడింది. పారిపోవడానికి వీలు లేదు. “ఎలా” అని ఆలోచించింది.
చేతులు పైకెత్తి వుంది గదా…వెంటనే గుహ పై భాగాన్ని అలాగే రెండు చేతులతో గట్టిగా అదిమి పట్టుకోని “పులిమామా… నువ్వు నన్ను చంపుతే… నాతోపాటు నువ్వు గూడా చచ్చిపోతావు” అంది. “నేనెందుకు చచ్చిపోతాను” పులి అనుమానంగా అడిగింది… కోతిపిల్ల కావాలనే ఆయాసపడుతూ “గుహ పైకప్పు కింద పడిపోతావుంటే చేతులు అడ్డం పెట్టి గట్టిగా పట్టుకున్నా, చేతులు తీశానంటే చాలు… పైకప్పు పడిపోతుంది. తొందరగా నువ్వుకూడా పట్టుకో, ఇప్పటికే నాకు చేతులు నొప్పి పెడుతున్నాయి” అంది.
పెద్దపులి అదిరిపడి అది గూడా పైకప్పును గట్టిగా పట్టుకొంది. “కోతిపిల్ల కాసేపు వున్నాక “నేను బైటికిపోయి ఏవయినా పెద్ద జంతువులు కనబడితే లోపలికి పంపుతా. కాసేపు అలాగే గట్టిగా పట్టుకో” అంటూ బైటికి పోయింది. ఆ పులి కప్పును పట్టుకోని అలాగే వుండిపోయింది. ఎంత సేపున్నా కోతి రాలేదు. పులికి చేతులు పీకసాగాయి. కాపాడమని గట్టిగా కేకలు పెట్టసాగింది. పులి అరుపులు విన్న ఒక నక్క మెల్లగా గుహలోకి వచ్చింది. “ఏం… పులి మామా! అలా పై కప్పు పట్టుకొని నిలబన్నావు. ఏమైంది” అని అడిగింది. పులి జరిగిందంతా చెప్పింది. నక్క పకపకమని నవ్వుతా “రాతితో తయారయిన గుహ కప్పు ఎక్కడయినా పడిపోతుందా. నీ పిచ్చిగానీ. ఆ కోతిపిల్ల చానా టక్కరిది. నిన్ను మోసంచేసి ఎప్పుడో పారిపోయింది” అని చెప్పింది. ఆ మాటలకు పులి అమ్మదొంగా అంటూ దాని తెలివికి ముక్కున వేలేసుకొంది.
చిన్న ఏనుగు తెలివి – Motivational Telugu Stories
ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగుకు ఒక చిన్న పిల్ల వుండేది. ఒకరోజు ఆ ఏనుగు తన పిల్లతో అడవిలో పోసాగింది. ఆ దారిలో ఒక చోట ఒక పెద్ద గుంత వుంది. వేటగాళ్ళు జంతువులను పట్టుకోవడానికి ఆ గుంత తవ్వి పైన కనబడకుండా చెట్ల కొమ్మలు వేశారు. తల్లి ఏనుగు ఆ గుంతను గమనించలేదు.
దాంతో… పాపం… దభీమని ఆ గుంతలో పడిపోయింది. అది చూసి పిల్ల ఏనుగు బాధతో ఆ గుంత చుట్టే తిరగసాగింది.
ఆ గుంత పక్కనే వున్న చెట్టు మీద కూచున్న చిలుకా గోరింకలు ఇదంతా చూశాయి. “ఆ పిల్ల ఏనుగు ఊడలు లోపలకేసి తల్లిని బైటకి లాగుతుందేమో” అంది చిలుక. ‘కానీ అది చిన్నపిల్ల గదా. అంత పెద్ద ఏనుగును లాగడం దానికేం చేతనవుతుంది” అంది గోరువంక. “అయితే గట్టిగా ఘీంకరిస్తూ సాయం కోసం ఎవరినన్నా పిలుస్తుందంటావా” అడిగింది చిలుక. “కానీ… ఆ అరుపు విని ఏ పులో… సింహమో వస్తే … అసలుకే మోసం జరగవచ్చు” అనుమానం వెలిబుచ్చింది గోరింక.
అవి అలా మాట్లాడుకుంటా వుంటే… వాటికి ఆ చిన్న ఏనుగు ఒక రాయిని తీసుకోని గుంతలో వేయడం కనబడింది. “ఏందబ్బా… ఆపిల్ల ఏనుగు అలా గుంతలోకి రాళ్ళు వేస్తావుంది” అని చిలుకా గోరింకలు మాటలాపి మౌనంగా చూడసాగాయి. ఆ బుజ్జి ఏనుగు అలా ఒకొక్క రాయి తీసుకొచ్చి గుంతలో వేస్తావుంటే… నెమ్మదిగా గుంత నిండసాగింది.
లోపల వున్న పెద్ద ఏనుగు ఎప్పటికప్పుడు ఆ రాళ్ళను తన కాళ్ళ కింద వేసుకోసాగింద… కాసేపటికి గుంత చాలా భాగం నిండిపోయింది. పెద్ద ఏనుగు బైటకొచ్చింది. తన బుజ్జిపిల్ల తెలివికి సంబరపడి దానిని ముద్దు పెట్టుకొంది. చిలుకా గోరింకలు గూడా ఏమో అనుకున్నాం గానీ ఆ బుజ్జి ఏనుగు మనకన్నా చాలా తెలివైంది అనుకుంటూ ఆనందంతో అక్కడినుంచి ఎగిరిపోయాయి.
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. contact@telugubucket.com
Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు