దేవుని పాప (ఒత్తులు లేని కథ) – Telugu Moral Stories
ఒక ఊరిలో ఒక పాప వుండేది. ఆ పాప రోజూ గుడికి పోయేది. పూలతో దేవుని కొలిచేది. దేవుడు ఆ పాపను చూచి ఎంతో సంతోషించేవాడు.
ఒక రోజు దేవుడు ఆపాపకు కనబడి పలకరించాడు. ఆ రోజు నుండి ఆపాప గుడికిపోయి పిలవగానే కనబడేవాడు. పాపతో బాగా ఆటలు ఆడేవాడు. మంచి మంచి పాటలు పాడేవాడు.
ఒకరోజు ఆపాప దేవునికోసం మామిడిపండు తీసుకొని గుడికి పోసాగింది. దారిలో ఒక ముసిలామె తిండిలేక కిందపడి మూలుగుతూ కనబడింది.
ఆ ముసిలామె పాప చేతిలోని పండు వంక ఆశగా చూసి “పాపా… పాపా… మూడు రోజులుగా తినడానికి తిండిలేదు, ఆకలితో నీరసంగా వుంది. ఏదయినా సాయం చేయవా” అని అడిగింది. కానీ ఆపాప “ఊహూ… ఈపండు దేవుని కోసం. నీకోసం కాదు” అంటూ అలాగే ముందుకు పోయింది.
పాప గుడికి పోయి మామూలుగానే ‘దేవా’ అని పిలిచింది. కానీ దేవుడు రాలేదు. “ఏమైంది ఎందుకు రావడం లేదు” అని బాధతో ఆపాప మరలా మరలా పిలిచింది. కానీ ఎంత పిలిచినా దేవుడు రాలేదు. దాంతో ఆపాప ఏడవసాగింది. పాప బాధ పడతూవుంటే దేవుడు చూడలేక పోయాడు. వెంటనే పాపకు కనబడి తల నిమురుతూ “చూడు పాపా… నాకు నీవు కాకపోతే ఇంకొకరు… అడిగినా అడగకపోయినా ఏదో ఒకటి పెడుతూనే వుంటారు.
కానీ దారిలో పాపం… ఆ ముసిలామె ఆకలితో బాధపడుతూ సాయం చేయమని అడిగినా నీవు చేయలేదు. అందుకే చాలా బాధవేసి నీముందుకు రాలేదు. పేదవారికి చేతనయిన సాయం చేయాలి. వారికి సేవ చేసినా, నాకు సేవ చేసినా ఒకటే, సరేనా” అని కారణం వివరించాడు. దాంతో ఆపాప ఆరోజు నుండి అందరికీ సాయం చేసి మంచి పేరు సంపాదించుకొంది.
దురాశ – Telugu Short Stories
ఒక అడవిలో ఒక ఏనుగు వుండేది. దానికి తీయని చెరుకులు తినాలని ఒకటే కోరిక. అడవంతా తిరిగింది గానీ ఎక్కడా ఒక్క చెరుకు దొరకలేదు. అలా తిరుగుతా తిరుగుతా ఒక చేను దగ్గరికి వచ్చింది. చేనంతా చెరుకులతో కళకళలాడుతోంది. ఏనుగు ఆ చేను వేసిన రైతు దగ్గరికి పోయి “రైతూ… రైతూ… చెరుకులు చూసి నోరు వూరుతోంది. ఓ నాలుగు చెరుకులు ఈయవా. నీకు కావలసిన పని చేసి పెడతా” అంది.
రైతు సరే అని నాలుగు చెరుకులు ఇచ్చి అడవి నుంచి ఒక పెద్ద మోపు కట్టెలు దానితో తెప్పించుకున్నాడు. అవి అమ్మే సరికి రైతుకు చాలా లాభం వచ్చింది.
దాంతో రైతుకు బాగా ఆశ పుట్టింది. ఏనుగుతో “నేను చెప్పినట్టు చేయి. నీకు పంట కోసే రోజు కడుపు నిండా పెడతా” అన్నాడు. ఏనుగు చెరుకుల మీది ఆశతో సరే అంది. రైతు ఏనుగుతో రోజూ ఒక పెద్ద చెట్టు పడగొట్టించి తెప్పించుకోసాగాడు. నెల తిరిగేసరికి బాగా సంపాదించి పెద్దమేడ కట్టేశాడు.
రైతు పంట కోసే రోజు వచ్చింది. ‘ఏనుగు అమాయకమైంది. మోసం చేయొచ్చులే అనుకోని అన్నీ కోసి అమ్మడం కోసం ఇంటిలో దాచి పెట్టాడు. తరువాత రోజు ఏనుగు వచ్చింది. తోటలో ఒక్క చెరుకూ లేదు. రైతు దానితో “ఏం లేదు. చెరుకులంతా బాగా పురుగు పట్టాయి. అందుకే అన్నీ కోసి చెరువులో పడేసి వచ్చా. ఏమీ బాధపడకు. ఈసారి పంట వచ్చాక నీకు కడుపు నిండా పెడతాలే.
నీవు ఇలాగే నాకు సాయం చేయి” అన్నాడు. ఇంటి లోపలి నుంచి కమ్మని చెరుకుల వాసన దాని ముక్కు పుటాలకు సోకింది. ఏనుగుకు రైతు దురాశ తెలిసిపోయింది. కోపంతో రైతును విసిరి పాడేసి కొత్త ఇంటికి చేరుకుంది. కనబడినవన్నీ పగులగొట్టి, ఇళ్ళంతా కూలగొట్టింది. లోపల దాచి పెట్టిన చెరుకులన్నీ తీసుకొని వెళ్ళిపోయింది.
ముందు చూపు – Pitta Kathalu
ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒక రోజు వేటకు పోతావుంటే దారిలో ఒక ముసిలాయన కనబడ్డాడు. ఆ ముసిలాయన ఒక మొక్క నాటుతా వున్నాడు. రాజు అది చూసి నవ్వుతా “ఒరే ముసిలోడా… మొక్క ఎప్పటికి పెద్దగవుతాది. నువ్వెప్పటికి కాయలు తింటావు. అసలు అంతకాలం నువ్వు బతుకుతావా” అన్నాడు.
ముసిలాయన నవ్వి “రాజా… ఈ మొక్క నాటుతా వున్నది నా కోసం కాదు. నా పిల్లల కోసం, మనవళ్ళ కోసం. ఇప్పుడు మనకు కాయలు ఇచ్చేవన్నీ ఒకప్పుడు మన తాతలు నాటినవే కదా. నాకెందుకులే అని వాళ్ళు అనుకొనింటే ఇప్పుడు మనం ఇవన్నీ తినేవాళ్ళమా” అన్నాడు. ఆ మాటలకు రాజు సిగ్గుతో తలదించుకొన్నాడు.
తీయని జిలేబీ (ఒత్తులు లేని కథ) – Neethi Kathalu
ఒక పాప అంగడిలో జిలేబీ తీసుకొని సంబరంగా ఇంటికి పోసాగింది. పాప చేతిలోని తీయని జిలేబీని దూరం నుంచి ఒక గాడిద చూసింది.
అది పాపను కిందకు తోసివేసి పాప చేతిలోని జిలేబీని గుంజుకొని పారిపోయింది. పాపం… పాప బాధతో ఏడవసాగింది. రెండు పావురాలు మేడ మీద నుంచి ఇదంతా చూశాయి. వాటికి పాపపై చాలా జాలి కలిగింది.
వెంటనే పైనుంచి గాడిదను వెంబడించ సాగాయి. గాడిద ఎవరూ లేనిచోట ఆ జిలేబీని ఉంచి తినబోయింది. అంతలో ఒక పావురం వేగంగా వెనుకనుంచి గాడిద తోకపై బలంగా పొడిచింది. గాడిద అదిరిపడి కోపంగా వెనుకకు తిరిగి చూసింది. అది అలా వెనుకకు తిరగగానే రెండవ పావురం గాడిద ముందు వైపు గల జిలేబీని తీసుకొని ఎగిరిపోయింది. తిరిగి ఆ జిలేబీని పాప చేతికి అందించింది. పాప సంబరంగా తాను సగం తిని మిగతా సగం పావురాలకు తినిపించింది.
తేలు తాబేలు – Chandamama Kathalu
ఒక తేలుకు నీటిలో తిరగాలని చాలా కోరిక. కానీ ఆ తేలుకు ఈతరాదు. దాంతో ….. ఒక తాబేలు కనబడితే “తాబేలు మామా ….. తాబేలు మామా … నన్ను నీ మీద ఎక్కించుకోని అటూయిటూ నీళ్ళలో తిప్పవా” అని అడుక్కొంది. తాబేలు జాలిపడి “దానిదేముందిలే అల్లుడూ … దా” అంటూ మీదికి ఎక్కిచ్చుకొంది.
చెరువంతా ఆ మూల నుండి ఈ మూలకు, ఈ మూల నుండి ఆ మూలకు తిప్పసాగింది. తేలుకు వుండబుద్ది కాలేదు. తాబేలు డిప్ప గట్టిగా వుంటాది కదా ….. ‘నేను కుడితే దీనికి సుర్రుమంటాదా … అనదా …’ అని సందేహం వచ్చింది.
వెంటనే తాబేలును కుట్టసాగింది. నొప్పికి తట్టుకోలేక ఆ తాబేలు “అల్లుడూ …. అల్లుడూ … ఎందుకలా కుడుతా వున్నావు” అని అడిగింది. తేలు నవ్వుతా “సంబరంగా వున్నప్పుడు కుట్టడం నా అలవాటు” అనింది. తాబేలుకు కోపం వచ్చింది. నీటిలో మునగసాగింది. తేలు అదిరిపడింది. “తేలు ఊపిరి అడక ఉక్కిరిబిక్కిరి అయింది. తాబేలు మామా … తాబేలు మామా … ఎందుకలా మునుగుతా వున్నావు” అని అడిగింది. తాబేలు నవ్వుతా “సంబరంగా వున్నప్పుడు మునగడం నా అలవాటు” అంటూ నీటిలోకి మునిగిపోయింది.
తగిన శాస్త్రి – Telugu Kathalu
ఒక ఊరిలో ఒక రైతు వుండేవాడు. అతను పేదవాడు. కానీ చాలా మంచివాడు. ఉన్న రెండు ఎకరాల్లో కష్టపడి పని చేసుకుంటూ పొట్టపోసుకునేవాడు. ఊరిలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ ఎవరు ఏ పని చెప్పినా చిరునవ్వుతో చేసేవాడు. అందరికీ సహాయపడేవాడు. ఆ రైతు గుడిసె పక్కన కొంచం ఖాలీ స్థలముంది. ఆ స్థలంతో ఒక గుమ్మడి తీగను నాటాడు. కొన్ని రోజులకు ఆ గుమ్మడి తీగకు మంచి గుమ్మడి కాయలు కాశాయి. బాగా ఎరువులు వేస్తూ, కలుపు తీస్తూ పసిపిల్లోని లెక్క చూసుకున్నాడు.
ఆ గుమ్మడికాయలు బాగా లవయ్యాయి. కానీ వాటిలో ఒక కాయ మాత్రం పది మంది మోసేంత పెరిగి పెద్దగయింది. ఊరంతా వచ్చి ఆ గుమ్మడికాయను చూసి అబ్బ… ఎంత లావుంది ఇది. మా జన్మలో ఎప్పుడూ చూడలేదు ఇలాంటి కాయను అని మెచ్చుకోసాగారు. ఆ పేదవానికి ఆ గుమ్మడి కాయను ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఆ ఊరి గ్రామాధికారి దాన్ని ఎవరికీ ఇవ్వొద్దు. అమ్మొద్దు. తినొద్దు. మన రాజుకు గుమ్మడికాయ కూరంటే చాలా ఇష్టం. పోయి ఆయనకు ఇవ్వు అన్నాడు. ఆ రైతు సరేనని దానిని పెద్దబండి మీద వేసుకోని రాజు దగ్గరికి తీసుకు పోయి బహుమానంగా ఇచ్చాడు.
రాజు ఆ గుమ్మడికాయను చూసి అబ్బ… ఎంత లావుగా ముచ్చటగా వుంది ఈ కాయ అంటూ చాలా సంతోషించాడు. వెంటనే గుమ్మడికాయంత బంగారం తెప్పించి రైతుకు బహుమానంగా ఇచ్చాడు. ఆ రైతు ఆ బంగారం అమ్ముకొని పెద్ద మేడ కట్టుకొని హాయిగా కాలుమీద కాలేసుకొని బతకసాగాడు. ఆ రైతు పక్కింటిలో ఒక సోమరిపోతు ఉన్నాడు. వానికి తాను కూడా ఎలాగైనా రాజు వద్ద బహుమానం సంపాదించాలి అనుకున్నాడు. కానీ వానికి వ్యవసాయం చేయడానికి ఒళ్ళు ఒంగలేదు.
ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తావుంటే ఇంట్లో వున్న ఎద్దు కనబడింది. దాంతో ఆ రోజు నుంచీ దానికి కొంచం గూడా పని చెప్పకుండా మూడు పూటలా బాగా మేపసాగాడు. అది పనీపాటా లేక తినీ తినీ బాగా కొవ్వుపట్టి కొండంత బలిసింది. అంత లావు ఎద్దు ఎక్కడా లేదని వూరంతా అనడం మొదలు పెట్టారు.
దాంతో వాడు సంబరంగా ఆ ఎద్దును తీసుకొని రాజు దగ్గరికి పోయాడు.
రాజా… మన రాజ్యంలో ఇంత లావు ఎద్దు ఎక్కడా లేదు. కాబట్టి దీనిని తీసుకొని దీని బరువంత బంగారం నాకివ్వండి’ అన్నాడు. రాజుకి వాని దురాశ అర్థమైంది. “ఒరేయ్… ఎద్దు పని దున్నడం. ఏవీ దున్ననంత వేగంగా ఎక్కువ ఎకరాలు దున్నితే నీ ఎద్దు గొప్పదవుతాది గానీ పోరంబోకు మాదిరి తిని కొవ్వు పట్టి లావయితే ఎట్లా గొప్పదవుతాది. చూడు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఎలా అల్లాడిపోతా వుందో, పనికొచ్చే జంతువును కూడా నీ తెలివి తక్కువతనంతో ఎందుకూ కొరగాకుండా చేశావు ” అంటూ వాన్ని బాగా తిట్టి, వీన్ని తీసుకుపోయి ఒక సంవత్సరం పాటు మన తోటలో అన్ని పనులు చేయించి, పని విలువ తెలిసేలా చేయండి అని ఆజ్ఞాపించాడు.
సింహంపిల్ల – తాబేలు – Telugu Short Stories
ఒక అడవిలో ఒక సింహం పిల్ల షికారు కొడతా వుంది. ఆ సింహంపిల్లకు ఒక తాబేలు కనపడింది. ఆ సింహంపిల్ల అంతకుముందు ఎప్పుడూ తాబేలును చూడలేదు. అదే మొదటి సారి. ఆ సింహం పిల్ల తాబేలు దగ్గరికి పోయి “ఎవరు నీవు” అని అడిగింది. “నేనూ నీలాగే జంతువును. నా పేరు తాబేలు” అని చెప్పింది.
ఆ మాటలు వింటానే ఆ సింహంపిల్లకు చాలా కోపం వచ్చింది. “నేను ఈ అడవికి కాబోయే రాజును. నేనూ నువ్వూ ఒకటేనా” అంటూ కొట్టబోయింది. వెంటనే ఆ తాబేలు తన తలను, కాళ్ళను డిప్ప లోనికి లాగేసుకొంది. సింహంపిల్లకి ఇంకా కోపం పెరిగిపోయింది. ఆ తాబేలును కట్టెట్టె తీసుకొని కొట్టింది. దానికేమీ కాలేదు.
దాంతో రాయి తీసుకొచ్చి రపారపా పెరికింది. ఐనా తాబేలుకేమీ కాలేదు. అంతలో ఆ తాబేలు “ఓ సింహం రాజా… నువ్వు దేనితోనయినా కొట్టు పరవాలేదు. కానీ దయచేసి నన్ను నీళ్ళలోకి పారెయ్యొద్దు” అంది. ఆ తాబేలుకి నీళ్ళంటే భయమనుకున్న ఆ సింహంపిల్ల “నిన్ను వదులుతానా, చంపకుండా” అంటూ ఆ తాబేలుని తీసుకొనిపోయి పక్కనే వున్న చెరువులోనికి విసిరి పాడేసింది. నీళ్ళల్లో పడిన తాబేలు నవ్వుతా “ఓ పిచ్చి రాజా… నేను బతికేది ఈ నీళ్ళలోనే” అంటూ వెళ్ళిపోయింది. పిల్ల సింహం దాని తెలివికి నోరు ఎల్లబెట్టింది.
అమ్మ మాట – Short Stories in Telugu
ఒక అడవిలో ఒక కోతి వుండేది. దానికో పిల్ల వుండేది. అది చాలా అల్లరిది. అమ్మమాట అస్సలు వినేది కాదు. ఒక రోజు పిల్ల, తల్లి రెండూ ఒక నది ఒడ్డుకు పోయాయి. అక్కడ ఒక చెట్టు ఎక్కి పళ్ళు తినసాగాయి. నది ఒడ్డులో ఒక చిన్న పడవ వుంది. దానిలో ఒక చిలుక, ఒక తాబేలు ఎక్కి కూచున్నాయి.
అవి కోతిపిల్లను “మాతోబాటు షికారుకురా… నదిలోకి పోదాం” అని పిలిచాయి.
తల్లి కోతిపిల్లతో “వద్దమ్మా పడవకు ఏదైనా జరిగితే చిలుక ఎగిరిపోతుంది. తాబేలు నదిలో ఈదుకుంటూ పోతుంది. మనకు ఏదీ చేతగాదు. వద్దు” అంది. కానీ పిల్లకోతి అమ్మమాటను లెక్కచేయలేదు. చిలుక, తాబేలుతో కలసి షికారుకు పోయింది. పడవ మధ్యలోకి పోయినపుడు ఒక పెద్దచేప వచ్చి పడవను ఢీ కొట్టింది.
అంతే దానికి చిల్లుపడింది. నెమ్మదిగా నీళ్ళు లోపలికి రాసాగాయి.
అది చూసి చిలుక పడవ మునిగిపోతా వుందని భయపడి ఎగిరిపోయింది. తాబేలు నీళ్ళలోకి దుంకి ఈదుకుంటా వెళ్ళిపోయింది. కోతిపిల్లకు ఏం చేయాలో తోచక కేకలు పెడుతా ఏడవసాగింది. ఇది చూసి తల్లికోతి ఒక పెద్ద తాడు తీసుకోనొచ్చి పడవలోకి విసిరింది. ఆ తాడును పిల్లకోతి గట్టిగా పట్టుకోగానే నెమ్మదిగా బైటకి లాగింది. ఆ రోజు నుంచీ పిల్లకోతి అమ్మమాటను ఎప్పుడూ జవదాటలేదు.
చిన్న చింత చెట్టు పెద్ద చింత చెట్టు – Neethi Kathalu
ఒక ఊరి పక్కనే ఒక అడవి వుంది. ఆ అడవిలో ఒక చిన్న చింతచెట్టు, ఒక పెద్ద వేపచెట్టు ఉన్నాయి. పెద్ద చెట్టుకు చానా పొగరు. చిన్న చెట్టు అలాకాదు అందరితో కలసి మెలసి వుండేది. ఒక రోజు గండు చీమల గుంపు ఒకటి వాటి దగ్గరికి వచ్చింది. “తాతయ్యా….. తాతయ్యా…. మీ కొమ్మల్లో ఇళ్ళు కట్టుకుంటాము” అని పెద్ద వేపచెట్టును అడిగగాయి.
“ఏయ్….పోతారా లేదా ఈన్నించి. మీకు ఇళ్ళు కట్టుకోడానికి నాకొమ్మలే దొరికినాయా” అంటూ తిట్టింది పెద్దచెట్టు. చీమలన్నీ చిన్న చెట్టు దగ్గరికి పోయాయి. “అనా…… అనా… మీ కొమ్మల్లో ఇళ్ళు కట్టుకొంటాము” అని అడిగాయి. చిన్న చింతచెట్టు నవ్వుతా “దానిదేముంది తమ్ముళ్ళూ… రండి… వచ్చి హాయిగా ఇళ్ళు కట్టుకోండి” అనింది.
చీమలన్నీ చింతచెట్టు మీద ఇళ్ళు కట్టుకొన్నాయి. ఒకరోజు ఇద్దరు కట్టెలు కొట్టుకునేటోళ్ళు అక్కడికి వచ్చారు. “ఈ చిన్న చెట్టును కొడదాం” అన్నాడు ఒకడు. “వద్దురా… దానినిండా చీమలున్నాయి. ఎక్కడం అంత సులభం కాదు. అదిగో ఆ పెద్ద చెట్టుమీద ఏమీలేవు చూడు. దాన్ని కొడదాం” అన్నాడు రెండోవాడు. ఇద్దరూ కలసి పెద్ద చెట్టును కొట్టేశారు.
కలసి వుంటే కలదు సుఖం – Telugu Moral Stories
ఒకసారి రంగయ్య చేతికుండే ఐదు వేళ్ళకూ గొడవ వచ్చింది. ‘అందరికంటే లావుగా, బలంగా వుండేది నేనే, నేను లేకుంటే ఏ పనీ జరగదు కాబట్టి నేనే గొప్ప’ అనింది బొటన వేలు. ‘అసలు మీ అందరికన్నా పొడుగుండేది నేను కాబట్టి నేనే గొప్ప’ అనింది నడుమ వేలు. ‘ఏది ఎక్కడ వుందో చూపించేదాన్ని నేను కాబట్టి నేనే గొప్ప’ అనింది చూపుడువేలు. “బంగారు ఉంగరమయినా రతనాల ఉంగరమయినా మొదట తొడిగేది నాకే కాబట్టి నేనే గొప్ప’ అనింది ఉంగరపు వేలు.
“దేవునికి మొక్కేటప్పుడు అందరికన్నా ముందుండేది నేను కాబట్టి నేనే గొప్ప’ అనింది చిటికెన వేలు. ఐదువేళ్ళూ గొడవపడి ఒకదానికొకటి సాయం చేసుకోవడ మానివేశాయి. దాంతో… రంగయ్య ఏ పనీ చేయలేక పోయాడు.. చివరికి అన్నంగూడా తినలేక పోయాడు. నీరసంగా పడిపోయాడు. దాంతో… ఐదువేళ్ళూ ‘మనమంతా ఒకటే. అందరం కలిసివుంటేనే బతకగలం’ అని తెలుసుకున్నాయి. అప్పటినుండీ గొడవలు మానేసి కలసిమెలసి వుండసాగాయి.
తగిలేది నీకే – Telugu Moral Stories
ఒక సాధువు ఒక ఇంటి ముందు నిలబడి ‘అమ్మా… ఏమయినా వుంటే దానం చెయ్ తల్లీ’ అని పిలిచాడు. ఆ ఇంటి యజమానికి తాను పెద్ద ధనవంతుడిని అని చాలా పొగరు. ఒక పావుగంటకు బైటకు వచ్చాడు. ‘దున్నపోతులెక్క వున్నావు. పనీ పాటా చేసుకోగూడదా’ అంటూ నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఆ సాధువు చిరునవ్వుతో అలాగే నిలబడ్డాడు.
ఆ ధనవంతునికి ఇంకా కోపం పెరిగిపోయింది. మరలా నానాక మాటలు తిట్టాడు. అప్పుడు ఆ సాధువు ‘అయ్యా … నీవు నాకు ఒక ఆవును నాకు ఇచ్చినావనుకో. దానిని నేను తీసుకోలేదనుకో. అది ఎవరికి చెందుతుంది?” అని అడిగాడు. ‘నాకే చెందుతుంది. ఏం?” అన్నాడు ఆ ధనవంతుడు.
‘ఏమీ లేదు. ఇంతకుముందు నువ్వు తిట్టిన మాటలు గూడా నేను తీసుకోవడం లేదు’ అంటూ ఆ సాధువు వెళ్ళిపోయాడు.
గద్ద – విమానం – Short Stories in Telugu
ఒక అడవిలో చాలా జంతువులు నివసించేవి. అవి బాగా కలసిమెలసి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ వుండేవి… ఒక రోజు ఒక చిన్న విమానం ఆ అడవివైపు వచ్చింది. ఆ విమానాన్ని చూడగానే జంతువులన్నీ భయంతో తలా ఒక దిక్కుకు పరుగెత్తసాగాయి. ఎందుకంటే అది మామూలు విమానం కాదు. జంతువులను పట్టుకొనిపోయి అమ్ముకునేవాళ్ళ విమానం. వాళ్ళు విమానం ఆగగానే వలలు, మత్తు తుపాకీలతో దిగి జంతువులను పట్టుకొని తీసుకుపోతారు. అందుకే జంతువులన్నీ భయపడి పారిపోతున్నాయి.
అది చూసి ఒక గద్ద చాలా బాధపడింది. ఎలాగయినా అడవిలోని జంతువులను కాపాడాలనుకొంది. ఎలాగబ్బా… అని కిందామీదా పడతావుంటే దానికి తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. వెంటనే కోతి బావ దగ్గరకు పోయి “కోతిబావా… కోతిబావా… నాకు తొందరగా కొంచం బంక కావాలి. తీసుకురావా” అంది. కోతి సరేనంటూ చెట్టు మీదనుండి చెట్టు మీదకు దుంకుతూ కావలసినంత బంక తీసుకువచ్చింది.
ఆ బంక తీసుకున్న గద్ద ఎగురుకుంటా ఏనుగు మామ దగ్గరకు పోయి “ఏనుగుమామా… ఏనుగుమామా… కొంచం బొగ్గులు మెత్తగా నూరి ఇవ్వవా” అంది. ఏనుగు సరేనంటూ కొన్ని బొగ్గులు తీసుకొచ్చి కాలికిందేసి మెత్తగా పొడిపొడిచేసి ఇచ్చింది. అంతలో గద్ద పక్కనే వున్న చెరువునుంచి కొంచం నీళ్ళు ఒక చిన్న బకెట్ లో తీసుకొని వచ్చింది. కోతి గద్ద చెప్పినట్టుగానే ఆ బకెట్ నీటిలో బొగ్గుపొడి, బంక వేసి బాగా కలిపింది. దాంతో అవన్నీ కలసి బాగా కందెనలాగా నల్లగా అయిపోయాయి.
వెంటనే గద్ద ఆ బకెట్ ను తీసుకొని విమానం వైపు గాలిలో ఎగిరింది. విమానం దగ్గరికి పోగానే ఆ కందెనను వేగంగా విమానం అద్దం మీదికి విసిరింది. అంతే… అద్దం మీదంతా నల్లగా అతుక్కుపోయింది. దాంతో ఆ విమానం నడిపేవానికి దారి కనబడక సక్కగా పోయి ఒక పెద్ద కొండను ఢీ కొట్టాడు. అంతే… విమానం ముక్కలు ముక్కలు అయిపోయింది. దాంతో ఆ రోజునుండీ అడవిలోని జంతువులకు ఆ వేటగాళ్ళ బాధ తప్పి పోయింది. అడవిలోని జంతువులు గద్దను బాగా మెచ్చుకున్నాయి. దాని నెత్తిన పూలకీరిటం పెట్టి, ఏనుగుమీద ఎక్కించి, మేళ తాళాలతో అడవంతా తిప్పి గౌరవించాయి.
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. contact@telugubucket.com
Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు