తెల్ల పావురం – నల్లకాకి – Stories for Children in Telugu – 02
ఒక అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు వుంది. ఆ మర్రిచెట్టు మీద ఒక పావురము, ఒక కాకి గూడు కట్టుకొని నివసించేవి. పావురమేమో తెల్లగా, అందంగా వుండేది. దానికి నల్లని కాకన్నా, దాని అరుపులన్నా చాలా చిరాకు. అది కాకితో అస్సలు మాటలు కలిపేది కాదు. పలకరించినా విసుగ్గా మొహం తిప్పుకుని వెళ్లిపోయేది.
ఆ పావురానికి రెండు చిన్న పిల్లలున్నాయి.
రోజూ పొద్దున్నే ఆ పిల్లలకి ఆహారం తేవడం కోసం పావురం బైటకు పోయేది. పళ్లు, గింజలు తెచ్చి పిల్లలకు కొసరి కొసరి తినిపించేది. వాటిని బాగా చూసుకొనేది.
ఒకరోజు పొద్దున్నే పావురం ఎప్పటిలాగే ఆహారం కోసం బైలుదేరింది. ఆరోజు అనుకోకుండా పెద్దగాలి వానా వచ్చింది. దాని దెబ్బకు పావురం గూడు చెదిరిపోయింది.
పాపం… గూటిలోని పిల్లలు కింద పడ్డాయి. అవి భయంతో వణికి పోతూ “అమ్మా, అమ్మా” అంటూ ఏడవసాగాయి. కాకి వాటిని చూసి రివ్వున వచ్చి పక్కన వాలింది. పావురం పిల్లలను తన గూటిలోనికి తీసుకుపోయింది. వాటి మీద వాన పడకుండా తన రెక్కలను కప్పి కాపాడింది. వాన తగ్గగానే గింజలు తెచ్చి తినిపించింది. జోలపాట పాడి నిదురబుచ్చింది.
కొంత సేపటికి పావురం ఆహారం తీసుకొని మర్రిచెట్టు దగ్గరకు వచ్చింది. నేలమీద పడిన గూడును చూసి ఆదిరిపడింది. పిల్లలు కనబడక బాధతో కళ్లనీళ్లు పెట్టుకొంది. చుట్టూ కంగారుగా వెదకసాగింది. ఇంతలో కాకి పావురం దగ్గరకు వచ్చింది. “భయపడకు. నీ పిల్లలు నా గూటిలో హాయిగా ఉన్నాయి” అని చెప్పింది. పావురం సంతోషంగా పరుగెత్తుకుంటూ పిల్లలను చేరింది. ఒళ్ళంతా ముద్దులు పెట్టింది.
పిల్లలు అమ్మకు జరిగినదంతా చెప్పాయి. దానితో పావురానికి బయటికి కనపడే రూపంకన్నా లోపల ఉండే మనసు గొప్పదని తెలిసి వచ్చింది… తన తప్పును మన్నించమని కాకిని వేడుకుంది. అప్పటి నుండి అవి రెండూ కలసిమెలసి హాయిగా వుండసాగాయి.
తెల్ల పావురం – నల్లకాకి – Stories for Children in Telugu – 02, Moral Stories for Children in Telugu, Text Format