Menu Close

Neethi Kathalu 10 – నీతి కథలు

మనమే ముందు నవ్వుదాం – Neethi Kathalu

రాము వాళ్ళు కొత్త ఇంటికి మారారు. చుట్టుపక్కల ఎవరూ తెలియదు. నెల రోజూలు దాటినా వీధిలోని పిల్లలు ఎవరూ పలకరించడం లేదు. పట్టించుకోవడం లేదు. వాళ్ళకు వాళ్ళే ఆడుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు. తిరుగుతున్నారు. రాముకు ఏం చేయాలో తోచడం లేదు. ఒంటరిగా అనిపించసాగింది. అమ్మకు విషయం చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. అమ్మ నవ్వింది.

“కొత్త వాళ్ళతో పాతవాళ్ళు అంత తొందరగా కలవరు. కలుపుకోరు. మనమే ఒక అడుగు ముందుకు వేయాలి. కాబట్టి ఒక పని చేద్దాం” అంది.
సాయంకాలం తీయ తీయని గులాబుజాములు చేసింది. చుట్టుపక్కల వాళ్ళకు అందరికీ ఇచ్చి రమ్మని రాముని పంపింది. రాము అలాగే చేశాడు.
అందరూ నవ్వుతూ పలకరించారు. వివరాలు అడిగారు.

తరువాత రోజు ఎదురింటి ఉమ మైసూరుపాకులు తీసుకొని వాళ్ళింటికి నవ్వుతూ వచ్చింది. రెండు రోజుల తరువాత వెనకింటి వేణు వాళ్ళింటిలో కాసిన మునక్కాయలు తెచ్చి ఇచ్చాడు. నాలుగో రోజు నాలుగిళ్ళ అవతలి రాధ పుట్టిన రోజుకు రమ్మని పిలిచింది. “ఆదివారం అందరం సాయంకాలం దాగుడుమూతలు ఆడుతున్నాం. ఆరుకంతా వచ్చేసెయ్” అన్నాడు వీధి చివరి వినాయక్.

పది రోజులు గడిచేసరికి వీధి వీదంతా కలిసిపోయారు. ఒకరితో ఒకరు కలసిపోవడం ఇంత సులభమా అనుకుంటూ అమ్మను ముద్దు పెట్టుకున్నాడు రాము.
అప్పటినుంచీ అడుగు ముందుకు వేయకపోతే తానే చిరునవ్వుతో వేయడం మొదలు పెట్టాడు .

అనుమానాల కాశయ్య – Telugu Moral Stories

ఒక ఊరిలో కాశన్న అని ఒకడు వుండేవాడు. వానికి అన్నీ అనుమానాలే. ఒక రోజు ఏదో పనిబడి పక్క ఊరికి పోతున్నాడు. నడిచీ నడిచీ బాగా దాహం వేసింది. వెంట తెచ్చుకున్న నీళ్ళన్నీ అయిపోయాయి. ఒకచోట ఒక కొలాయి కనబడింది. తాగుదామని పోతే పక్కన ఒకామె బట్టలు ఉతుకుతూ కనబడింది. .

“చీ… ఛీ… సబ్బు చేతులతో ఆమె కొలాయి ముట్టుకోనింటాది. ఈ సబ్బునీళ్ళు నేను చచ్చినా తాగను” అనుకుంటూ ముందుకు పోయాడు. దారిలో ఒకచోట ఒక బోరింగు కనిపించింది. తాగుదామని దగ్గరికి పోయేసరికి ఒక ఆవు అక్కడికి వచ్చి నాలికతో దానిని నాకసాగింది. “చీ… చీ… యాక్. ఈ ఆవు బోరింగునంతా నాకినాకి పెట్టింది. ఈ ఎంగిలినీళ్ళు నేను తాగనే తాగను” అనుకుంటూ ముందుకు నడిచాడు.

ఒకచోట ఒక బావి కనిపించింది. బావిలో నీళ్ళు తాగుదామని దగ్గరికి పోయి లోపలికి తొంగి చూశాడు. లోపల ఒక తాబేలు నీళ్ళలో తిరుగుతూ కనబడింది. “చీ… చీ… ఈ తాబేలు నీళ్ళనంతా గలీజు చేసింటాది. ఈ నీళ్ళు నేను అస్సలు తాగను” అనుకుంటూ ముందుకు నడిచాడు. దారిలో ఒకచోట ఒక చెరువు కనిపించింది. నీళ్ళు తాగుదామని దగ్గరికిపోతే చెరువు నిండా చేపలు తిరుగుతా కనబడ్డాయి.

“బాబోయ్… ఇన్ని చేపలా… కంపు కంపు. యాక్ ఈ నీళ్ళను సచ్చినా తాగను” అనుకుంటూ ముందుకు నడిచాడు. కొంచెం దూరం పోయాడో లేదో వాన మొదలైంది. “ఆహా! ఆకాశంలోంచి వచ్చే వాన చినుకులు స్వచ్చమైనవి. ఇవి తాగుతాను” అని తల పైకెత్తి నోరు తెరిచాడు. సరిగ్గా అప్పుడే పైన ఎగురుతున్న కాకి ఒకటి రెట్ట వేసింది. అది చక్కగా వచ్చి కాశయ్య నోటిలో పడింది.

“చీ… చీ… యాక్… యాక్… ” అనుకుంటూ నీళ్లకోసం చుట్టూ చూశాడు. పక్కనే వానకు పారుతున్న బురదనీరు కనబడింది. ఏమీ చేయలేక వాటితోనే గబగబా నోరు కడుక్కున్నాడు. అనుమానాల కాశయ్యకు అన్ని నీళ్ళూ పోయి చివరికి బురదనీరే గతి అయ్యింది.

తేలు కాటు – Moral Stories in Telugu

విజయనగరంలో దొంగలు ఎక్కువయ్యారు. రోజుకొక ఇంటిలో దొంగతనం చేయసాగారు. తెనాలి రామలింగడు ఏదో ఒక రోజు తన ఇంటిలో కూడా దొంగలు పడతారని ముందే ఊహించాడు. ఒక మంచి తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి గూటిలో పెట్టాడు. పెళ్ళానికి ఏం చేయాలో ముందే చెప్పాడు. ఒక రోజు చీకటి పడ్డాక ఒక దొంగ ఇంటిలోనికి దూరాడు. ఆ విషయాన్ని పసిగట్టిన రామలింగడు “ఏమే … మొన్న కొన్న బంగారు ఉంగరం ఇనుప పెట్టెలో దాచినావా… లేదా…” అని గట్టిగా అడిగాడు.

“లేదండి … గూటిలోని అగ్గిపెట్టెలో వుంది. పొద్దున్నే దాచి పెడతాలే” అంది ఆమె. దొంగ అదంతా విన్నాడు. సంతోషంగా చప్పుడు చెయ్యకుండా గూటికాడికి పోయాడు. అగ్గిపెట్టె తెరిచి ఉంగరం కోసమని లోనికి ఏలు పెట్టాడు. అంతే … తేలు కసుక్కున ఆ దొంగను కుట్టింది. ఆ దొంగ నొప్పికి తట్టుకోలేక అమ్మా …. అబ్బా అని అరవడం మొదలు పెట్టాడు. ఆ అరుపులకు చుట్టుపక్కల జనాలంతా లేచారు. దొంగను పట్టేశారు.

తుంటరి చిలుక (ఒత్తులు లేని కథ)

ఒక అడవిలో ఒక చిలుక వుండేది. ఆ చిలుక చాలా తుంటరిది. అడవిలో ఏవయినా జంతువులు కనబడితే చాలు వాటిని ఏడిపించి ఎగిరి గంతులు వేసేది.. ఒక రోజు ఆ చిలుకకు ఒక ఏనుగు పడుకొని కనబడింది. ఆ ఏనుగుని ఏడిపించాలని పోయి దానిని పొడిచింది. ఏనుగు చిలుకను తరమాలని చూసిందిగానీ అది అందలేదు. ఆ చిలుక ఏనుగు వెంటపడి మాటిమాటికీ దానిని పొడవసాగింది. ఏనుగు మంటతో బాధపడతూవుంటే ఆనందంతో ఎగరసాగింది.

ఏనుగు ఆ చిలుకను ఎలా తరమాలా అని ఆలోచించసాగింది. అంతలో దానికి ఒక చెరువు కనబడింది. వెంటనే ఏనుగు చెరువులోకి దిగింది. తొండంనిండా నీటిని నింపుకొంది. ఇది తెలియని ఆ చిలుక మామూలుగానే ఏనుగుని పొడవడానికి రాసాగింది. వెంటనే ఏనుగు తొండంతో నీటిని వేగంగా ఆ చిలుక మీదకు విసిరింది. అంతే… నీరు వేగంగా తగిలేసరికి చిలుక అదిరిపడింది..

ఈకలు తడిచి పోవడంతో ఎగరలేక దభీమని చెరువులోనే పడిపోయింది. ఆ చిలుకకు ఈతరాదు. దాంతో అది చెరువులో మునిగిపోసాగింది. అది చూసి జాలిపడిన ఏనుగు తొండంతో ఆ చిలుకను బయటకు తీసి కాపాడింది. ఆ రోజు నుండి చిలుక తుంటరి పనులు మానేసి అందరితో కలసిమెలసి ఉండసాగింది.

మూడు కప్పులు – Pitta Kathalu

ఒక టేబుల్ పైన ఒక పాల కప్పు, ఒక టీ కప్పు, ఒక కాఫీ కప్పు ఉన్నాయి. ‘నేనంటే అందరూ ఇష్టపడతారు’ అనింది కప్పులోని కాఫీ. ‘కాదు… కాదు… నేనంటేనే ఇష్టం’ అనింది పక్కకప్పులోని టీ. పాల కప్పులోని పాలు ఏమీ మాట్లాడలేదు. ఒక చిన్న పిల్లోడు టేబుల్ దగ్గరికి వచ్చినాడు. వాడు కాఫీ కప్పును, టీ కప్పును ముట్టుకోలేదు. పాల కప్పును చూచి, ఆనందంగా తీసుకొని పాలు తాగాడు.

ఇది చూచి టీ కప్పు చాలా బాధ పడింది. కాఫీ కప్పు, టీ కప్పును ఓదార్చుతూ ‘ఎవరో ఒకరు ఇష్టపడనంత మాత్రాన మనలని ఎవరూ ఇష్టపడరు అనుకోకూడదు’ అనింది. కొంచెం సేపటికి ఆ పిల్లోని అమ్మా, నాన్న అక్కడికి వచ్చారు. వాళ్ళమ్మ టీ కప్పు తీసుకొని టీ తాగింది. వాళ్ళ నాన్న కాఫీ కప్పు తీసుకొని కాఫీ తాగాడు.
కాఫీ కప్పు టీ కప్పుతో ‘చూశావా! మనలని ఇష్టపడే వారు వచ్చారు’ అనింది. ‘అవునవును. ప్రతి ఒక్కరినీ ఎవరో ఒకరు ఇష్టపడే వారు ఉంటారు’ అనింది టీ కప్పు ఆనందంగా.

చలాకీ ఎలుక – Telugu Short Stories

ఒక అడవిలో చాలా ఎలుకలుండేవి. అవన్నీ సంతోషంగా, సరదాగా కాలం గడుపుతుండేవి. ఒక రోజు ఒక పిల్లి అక్కడికి వచ్చింది. అన్ని ఎలుకలు కనబడేసరికి దానికి చాలా ఆనందం వేసింది. దొరికిన ఎలుకను దొరికినట్లు పట్టి తినేయసాగింది. ఒకరోజు ఒక చిన్న ఎలుక ఆకలై ఏదైనా దొరుకుతుందేమోనని బైటకు వచ్చింది. కానీ ఆ దొంగపిల్లి లటుక్కున దాన్ని పట్టేసింది. ఆ చిన్ని ఎలుక చాలా తెలివైంది, చలాకీది.

వినయంగా “పిల్లిమామా… చాలా ఆకలి మీద ఉన్నట్టున్నావు. కానీ ఎన్ని ఎలుకలను తింటే నీ ఆకలి తీరుతుంది. నన్ను గనుక వదిలిపెడితే నీకు రోజూ కావలసినంత ఆహారం దొరికే ఉపాయం చెబుతా” అంది. “ముందు చెప్పు… నచ్చితే వదులుతా” అంది పిల్లి. “ఈ పక్కనే ఒక సింహం గుహ వుంది. అందులో లెక్కలేనంత ఆహారం దొరుకుతుంది. ఆ సింహం పడుకుంటే పక్కన బాంబులు పడినా లెయ్యదు. నీవు పోయి హాయిగా తిని రావచ్చు” అంది. “కానీ సింహం పడుకుందో, లేచిందో తెలుసుకోవడం ఎలా” అంది పిల్లి.

“నేను లోపలికి పోయి చూసి చెబుతాగా” అంది ఎలుక. పిల్లి కాసేపు ఆలోచించి “కానీ… నీవు అటు నుంచి అటే పారిపోతే ఎలా” అంది. “మా ఇంటినీ, బంధువులను వదిలి ఎక్కడికని పారిపోతాను. కానీ నువ్వు మా ఎలుక జాతిని ఇకపై ఏమీ చేయగూడదు” అని మాట తీసుకొంది. ఎలుక ఆరోజు నుంచీ గుహలో దూరి సింహం పడుకుందో, లేదో చూసి చెప్పేది.

పిల్లి లోపలికి పోయి బాగా మెక్కి వచ్చేది. అంతకుముందు అది చాలా చలాకీగా, మెరుపువేగంతో కదలాడేది. కానీ ఊరికే తిని పడుకోవడం వల్ల బాగా లావైపోయి వేగం గూడా తగ్గిపోయింది. ఇది ఎలుక గమనించింది. సింహం రోజూ తన ఆహారం ఎవరో ఎత్తుకుపోవడం గమనించింది. దాని అంతు చూద్దామని కాసేపు కాపలా కాసేది గానీ నిదుర మబ్బుతో కళ్ళు మూసుకుపోయేవి.

ఒకరోజు పిల్లి తింటా వున్నప్పుడు ఎలుక పోయి సింహం తోక పట్టుకొని కసుక్కున ఒక్క కొరుకు కొరికింది. అంతే… ఆ నొప్పికి అదిరిపడి సింహం కోపంగా పైకి లేచింది. ఎదురుగా పిల్లి తన మాంసం తింటూ కనబడింది. ఇంకేం జరిగిందో చెప్పాలా….. మీకు తెలుసు గదా… ఆలోచించండి.

మేకలు కాసే పిల్లోడు – Telugu Stories Text

ఒక ఊరిలో ఒక మేకలు కాసే పిల్లోడు వుండేవాడు. ఆ పిల్లోడు రోజూ అడవికి పోయి మేకలను తినడానికి వదిలి ఒక చెట్టుమీదకు ఎక్కి వాటిని పడుకునేవాడు. మరలా సాయంకాలం అన్నింటినీ లెక్కబెట్టి ఇంటికి తోలుకొని వచ్చేవాడు. ఒకరోజు ఎప్పటిలానే సాయంకాలం అన్నింటినీ ఒక దగ్గరకు చేసి లెక్కబెడితే ఒకటి తక్కువ వచ్చింది. ఎక్కడికి పోయిందబ్బా అని చుట్టుపక్కలంతా వెదికాడు. కానీ ఎంత వెదికినా ఎక్కడా కనబడలేదు. తరువాత రోజు సాయంకాలం కూడా అలాగే మరలా ఒకటి తక్కువ వచ్చింది.

అలా…. వరుసగా రోజుకొకటి తగ్గిపోసాగాయి. ఇలాగయితే లాభం లేదనుకుని ఒకరోజు ఆ పిల్లోడు చెట్టుమీద పండుకున్నట్టే పండుకొని నిదుర పోకుండా కళ్ళల్లో వత్తులేసుకొని కాపలా కాయసాగాడు. అంతలో ఒక పులి పొదల చాటుగా దాచి పెట్టుకుంటా వచ్చి ఒక గొర్రెపిల్లను నోట కరచుకొని పోవడం కనబడింది.
అది చూసి వాడు ఓహో ఇదా సంగతి అనుకున్నాడు. ఆ పులిని ఎలా దెబ్బతీయాలా అని ఆ రోజంతా బాగా ఆలోచించాడు. తరువాత రోజు గడ్డితో , గొర్రె బొచ్చుతో అచ్చం నిజమైన గొర్రె పిల్లనే అనుకునేలా ఒక గొర్రె పిల్ల బొమ్మను తయారు చేశాడు.

దానిని తీసుకొని అడవికి పోయాడు. అక్కడ బండలతో ఒక చిన్న ఇల్లు కట్టి లోపల దానిని కట్టేశాడు. కాసేపటికి పులి వచ్చింది. దానికి ఎక్కడా ఒక మేకగానీ గొర్రెగానీ కనబడలేదు. . ఇదేందబ్బా వీడు ఈ రోజు వేటినీ తోలుకొని రాలేదు అని నిరాశగా ఆకలితో వెళ్లి పోతావుంటే…. దానికి రాళ్ళ ఇంటిలో మేక బొమ్మ కనబడింది. అది బొమ్మని దానికి తెలీదు కదా… దాంతో సంబరంగా దానిని తినడానికి లోపలికి పోయింది.

ఎప్పుడయితే పులి పులి ఇంటిలోకి పోయిందో అప్పుడు ఆ పిల్లోడు వెంటనే చెట్టు దిగి వురుక్కుంటా వచ్చి చటుక్కున తలుపు మూసి బైట గొళ్ళెం పెట్టేశాడు. అంతే… పులి లోపల ఇరుక్కుని పోయింది. అది రాళ్ళ ఇల్లు గదా… వెంటనే వాడు ఆ రాళ్లను బలంగా తోయసాగాడు. అంతే… రాళ్లన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టినేవి కావడంతో దబదబదబ పడిపోయాయి. నిమిషాల్లో ఇళ్ళంతా కూలిపోయింది. దాంతో పులి లోపలే ఇరుక్కొని బండలు మీదపడి చచ్చిపోయింది.
పులి పీడ విరగడ కావడంతో తరువాత రోజు నుంచి హాయిగా మేకలను తోలుకొని మరలా అడవికి రాసాగాడు.

వానలో జింకపిల్ల – Panchatantra Stories in Telugu

ఒక అడవిలో ఒక జింకపిల్ల ఉండేది. అది అడవిలో చెంగు చెంగున ఎగురుతా గెంతుతా ఉండేది. ఒక రోజు అలా తిరుగుతా వుంటే ఒక్కసారిగా ఆకాశంలో దట్టంగా మేఘాలు ముసురుకోసాగాయి. ‘అయ్యబాబోయ్ కాసేపటిలో వాన వచ్చేలా ఉంది. అంతలోపల ఇంటికి చేరుకోవాలి’ అనుకొని ఇంటి వైపుకు ఉరకసాగింది. నెమ్మదిగా ఆకాశం నుండి ఒకొక్క చినుకు నేలపై పడసాగింది.

దారిలో ఒక కుందేలు కనబడి “ఓ చిన్నారి జింకా! పెద్ద వాన వచ్చేలా ఉంది. వెంటనే నా గుబురు పొదలోకి రా. హాయిగా కాసేపు కమ్మని కథలు చెప్పుకుందాం. వాన తగ్గిపోయాక పోదువు గానీ’ అని పిలిచింది. ఆ మాటలకు ఆ జింకపిల్ల ‘నేను నీ కంటే చాలా పెద్ద దాన్ని. నీ చిన్న పొద నాకేం సరిపోతుంది? కావాలంటే ఉడుతలని, తొండలని పిలుచుకో. నేను మా ఇంటికి పోయి హాయిగా పడుకుంటా’ అని ముందుకు ఉరికింది.

అది అలా పోతావుంటే దారిలో ఒక మామిడి చెట్టు మీద కోతి కనబడింది. “ఓ బంగారు జింకా! కాసేపటిలో పెద్ద వాన వచ్చేలా ఉంది. దా వచ్చి ఈ మామిడి చెట్టు కింద తలదాచుకో. నీకు తీయ తీయని మాగిన మామిడి పల్లు తెంచి పెడతా. అవి తింటూ వాన తగ్గిపోయాక పోదువు గాని’ అనింది. అప్పుడా జింకపిల్ల ‘ఓ కోతిమామా… ఈ చెట్టుకు అసలు కొమ్మలే లేవు. దీని కింద నిలబడితే కొంచమన్నా తడిసిపోతాను. నువ్వే హాయిగా పళ్ళు తిను. నేను మా ఇంటికి పోతా’ అంటూ గెంతుతా ముందుకు పోయింది.

ఆ జింకపిల్ల అలా పోతా పోతా ఉంటే వాన ఇంకొంచం పెరిగింది. ఎక్కడైనా ఆగుదామా అని చుట్టూ చూసింది. దానికి ఒక గుహ కనబడింది. ‘ఆహా! ఇదేదో చాలా బాగుంది. ఇందులోకి పోతే ఒక్క వాన చినుకు కూడా నా మీద పడదు’ అనుకుంటా గుహలోకి పోబోయింది. గుహ పక్కనే ఎగురుతూ పోతున్న ఒక పిచ్చుక దీనిని చూసింది. వెంటనే ‘ఓ జింకపిల్లా! కొంచెం ఆగు. ఆ గుహలోకి పోయావంటే మళ్ళా తిరిగి వచ్చేది ఉండదు. సక్కగా పైకి పోవడమే. లోపల ఒక సింహం గురకలు పెట్టి నిదురపోతా ఉంది’ అనింది.

ఆ మాటలకు జింకపిల్ల అదిరిపడి ఆగిపోయింది. అంతలోనే వాన పెద్దగయింది. చుట్టూ ఒక చిన్న పొదగానీ , చెట్టుగానీ కనబడలేదు. వాన మరింత పెద్దగయ్యింది. చినుకులు టపటపటప లావు లావువి పడసాగాయి. ‘అయ్యో నేను ఎంత తెలివి తక్కువ దాన్ని. కుందేలు, కోతి మంచిమనసుతో నన్ను రమ్మని పిలిచినా కాదని ఇంత దూరం వచ్చేసాను. ఇక ఈ వానలో తడవకుండా తప్పించుకోవడం ఎలా అనుకుంటూ వుండగానే గుహ లోపలి నుండి గట్టిగా సింహం అరుపు వినబడింది.

అంతే… అయ్యబాబోయ్… ఇంకొక్క నిమిషం ఇక్కడ నిలబడితే దానికి ఆహారం కావడం ఖాయం అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా ఆ వానలోనే మొత్తం తడిసిపోతూ ఇంటివైపు పరుగు తీసింది. దాంతో బాగా జలుబు చేసి వారం రోజులపాటు ఒకటే తుమ్ములే తుమ్ములు.

తేలు కాటు – Telugu Stories Writing

విజయనగరంలో దొంగలు ఎక్కువయ్యారు. రోజుకొక ఇంటిలో దొంగతనం చేయసాగారు. తెనాలి రామలింగడు ఏదో ఒక రోజు తన ఇంటిలో కూడా దొంగలు పడతారని ముందే ఊహించాడు. ఒక మంచి తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి గూటిలో పెట్టాడు. పెళ్ళానికి ఏం చేయాలో ముందే చెప్పాడు. ఒక రోజు చీకటి పడ్డాక ఒక దొంగ ఇంటిలోనికి దూరాడు. ఆ విషయాన్ని పసిగట్టిన రామలింగడు “ఏమే … మొన్న కొన్న బంగారు ఉంగరం ఇనుప పెట్టెలో దాచినావా… లేదా…” అని గట్టిగా అడిగాడు.

“లేదండి …. గూటిలోని అగ్గిపెట్టెలో వుంది. పొద్దున్నే దాచి పెడతాలే” అంది ఆమె. దొంగ అదంతా విన్నాడు. సంతోషంగా చప్పుడు చెయ్యకుండా గూటికాడికి పోయాడు. అగ్గిపెట్టె తెరిచి ఉంగరం కోసమని లోనికి ఏలు పెట్టాడు. అంతే … తేలు కసుక్కున ఆ దొంగను కుట్టింది. ఆ దొంగ నొప్పికి తట్టుకోలేక అమ్మా …. అబ్బా అని అరవడం మొదలు పెట్టాడు. ఆ అరుపులకు చుట్టుపక్కల జనాలంతా లేచారు. దొంగను పట్టేశారు.

సోమరిపోతు కొడుకు – Telugu Stories With Moral

ఒక రైతుకు ఒక కొడుకు వుండేవాడు. వాడు చాలా సోమరిపోతు. ఏ పనీ తొందరగా చేసేవాడు కాదు. ఏదో ఒక వంక పెట్టి తప్పించుకోవాలని చూసేవాడు. కానీ రైతు వెంటబడి పదేపదే పనులు చెప్పేవాడు. కోప్పడేవాడు. తిట్టేవాడు. బతిమాలేవాడు. బుజ్జగించేవాడు. కానీ వాడు ఎంత చెప్పినా వినకుండా మొండికే సేవాడు. వీనికి చెప్పినా, ఆ గోడకు చెప్పినా ఒకటే అని ఆయన బాధపడతా తానే ఆ పని చేసుకునేవాడు…

ఒకసారి చలికాలం వచ్చింది. ఆ ఏడాది చలి చాలా ఎక్కువగా వుంది. రైతు పొద్దున్నే కొడుకుని లేపి “రేయ్… ఇది మంచి పంటల కాలం. మొక్కలు మోకాలంత ఎత్తుకు ఎదిగాయి. పోయి నీళ్ళు పెట్టు” అన్నాడు. ఆ మాటలకు వాడు “అబ్బ… ఈ చలిలో కుక్కలు గూడా బైట తిరగవు. నేను రాను. అంతగా కావాలంటే బాగా పొద్దెక్కి ఎండబడ్డాక అన్నం తిని పొలంలోకి అడుగు పెడతాలే” అని అడ్డం తిరిగాడు. రైతు ఏమీ చేయలేక ఆ చల్లని చలిలోనే వణుక్కుంటా, వణుక్కుంటా అన్ని పనులూ ఆయన ఒక్కడే చేసుకోసాగాడు.

ఒకరోజు ఆ సోమరిపోతుకి పొద్దున్నే మెలకువ వచ్చింది. చలిమంట వేసుకోని, గొంగడి కప్పుకోని చేతులు కాపుకోసాగాడు. అంతలో పక్కింటి సిద్ధయ్య ఆ చలిలో వాని కళ్ళ ముందే అంగీ గూడా వేసుకోకుండా పొలానికి పోతూ కనబడ్డాడు. వయసు అరవై పైన్నే వుంటాయి. అది చూసి వాడు “ఏం తాతా… ఇంత చలిలో అంగీకూడా లేకుండా పొలానికి పోతావున్నావు. దా… కాసేపు వచ్చి ఈ మంట పక్క వెచ్చగా కూచో. లేకుంటే ఈ చలికి తట్టుకోలేక పైకి పోయినా పోతావు” అన్నాడు నవ్వుతా.

ఆ మాటలకు అతను నవ్వి “ఒరేయ్… నేను పెళ్ళాం పిల్లలు లేని ఒంటిగాన్ని. తప్పదు. అయినా రైతుకు ఎండా, చలీ, వాన అంటా ఏదీ వుండదురా. అవన్నీ పనీపాటా లేని నీలాంటి పోరంబోకు గాళ్ళకే. పనిలోకి దిగితే అన్నీ ఎగిరిపోతాయి. ఐనా ఏం బతుకురా నీది. ఇంత చలిలో ఇంత వయసులో మీ నాయన పొలానికి పోయి ఒక్కడే కిందామీదా పడతావుంటే వూకె తిని కూచోడానికి సిగ్గుగా లేదు. నీలాంటి కొడుకులు బతికినా ఒకటే చచ్చినా ఒకటే.. ఛీ… ఛీ…” అన్నాడు.

రైతు కొడుక్కి నోట మాట రాలేదు. వయసులో వున్న నాకే ఇంత చలిగా వుంటే, ముసలోడయిన మా నాయనకు ఎంత చలిగా వుండాలి అని తలచుకోగానే సిగ్గుతో వాని ఒళ్ళు జలదరించింది. గబగబా వాళ్ళ నాయన కోసం ఒక గొంగడి తీసుకోని తాత వెంట పొలానికి బైలుదేరాడు.

SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. contact@telugubucket.com

Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker

Refresh Page
x

Subscribe for latest updates

Loading

South Indian Actress with Highest Remuneration Interesting Facts About Indian Flag in Telugu Rashmika Mandanna Images Sai Pallavi Photos Samantha Cute Photos