పగడాల హారం – Telugu Moral Stories
ఒక రాజు దగ్గర ఎంతో విలువైన పగడాల హారం ఉంది. రాజు దాన్ని ఒక అద్దాల పెట్టెలో వుంచి తాళం వేసి, తాళంచెవి తన మొలతాడుకు తగిలించుకున్నాడు. పండగదినాలలో ఆ హారాన్ని వేసుకునేవాడు. ఒకసారి దసరా పండగనాడు వేసుకుందామని పెట్టె దగ్గరికి పోయాడు. కానీ అందులో హారం లేదు. పెట్టె తాళాలు ఎలా వేసినవి అలాగే వున్నాయి. రాజభవనంలో దొంగతనం జరిగిందని తెలిసిందంటే పరువు పోతుంది.
అందుకే కక్కలేక మింగలేక ఎవరినీ అడగలేకపోయాడు. ఆ ఊరిలో దేవసేనుడు అనే తెలివైనవాడు ఉండేవాడు. అతను ఎటువంటి చిక్కు అంశాన్నయినా సులభంగా విప్పేసేవాడు. రాజు అతన్ని పిలిచి గుట్టుచప్పుడు కాకుండా దొంగను పట్టేయాలన్నాడు. దేవసేనుడు బాగా పరిశీలించాడు. అతనికి తళుక్కున ఒక ఆలోచన మెరిసింది.
“రాజా! రాజమందిరంలోంచి ఎవరూ బైటకు పోకుండా, రాకుండా రెండు రోజులు కట్టడి చేయండి. దొంగెవరో కనుక్కుంటాను” అన్నాడు.
రెండు రోజుల తరువాత దేవసేనుడు వచ్చి “రాజా! ఇది ఇంటి దొంగల పనే. మీ దాసీలనంతా పిలవండి” అన్నాడు. వాళ్ళు రాగానే అందరినీ వరుసగా నిలబెట్టాడు.
దేవసేనుడు అందరి వంక చూసి “రాజా! అదిగో ఆ చివర తెల్లచీర కట్టుకొని నిలబడిందే ఆ దాసీనే దొంగ” అన్నాడు. “అలా… ఎలా చెప్పగలవు” అడిగాడు రాజు సందేహంగా. దేవసేనుడు నవ్వి “రాజా! పెట్టెకు వేసిన తాళం తీసి, హారం దొంగిలించి, మరలా తాళం వేశారంటే వారికి తాళం ఎక్కడుందో తెలిసి ఉండాలి.
లేదా మీకు తాళం చేసిచ్చిన వాడైనా ఈ దొంగతనంలో పాలుపంచుకొని ఉండాలి. మీ దగ్గరున్న తాళం ఎప్పుడూ మీ మొలతాడుకే వుంటుంది కాబట్టి దానిని ఎవరూ తీయలేరు. ఇక మిగిలిన దారి ఒక్కటే. అందుకని మీ అంతఃపురంలోని దాసీలు ఎవరెవరు ఎక్కడెక్కడుంటారు, వారికి ఎవరితో సంబంధాలు వున్నాయి అనే కోణంలో పరిశోధించాను.
ఈ దాసి ఉన్న ఇల్లు, మీకు తాళం చేసిచ్చిన కంసాలి ఇల్లు పక్కపక్కనే. వెంటనే వాన్ని బంధించి నాలుగు తగిలించేసరికి తప్పు ఒప్పుకున్నాడు” అన్నాడు. ఆ మాట వినగానే దాసి వణికిపోయింది. తోటలో దాచి పెట్టిన హారం తీసుకొచ్చి రాజు కాళ్ళ మీద పడింది.
అమాయకుడు – తొండ – Neethi Kathalu
ఒక వూరిలో ఎర్రన్న అని ఒకడు వుండేవాడు.వాడు చాలా అమాయకుడు. వయసయితే పెరిగింది కానీ బుద్ది కొంచంగూడా పెరగలేదు. ఒకసారి పక్కూరి సంతలో అమ్ముదామని ఎద్దులు తీసుకొని బైలుదేరాడు. నడిచీ నడిచీ అలసిపోయి ఒక చెట్టు కింద కూలబడ్డాడు. ఆ చెట్టు పక్కనే ఒక పుట్ట వుంది. అందులోంచి ఒక తొండ బైటకు వచ్చి ఎర్రన్న వంకే చూడసాగింది. ఎర్రన్న దాని వంక చూసి “ఎద్దులు కొంటావా” అన్నాడు. అది తల వూపింది. “సరే… అమ్ముతా గానీ పదివేలవుతాది సరేనా” అన్నాడు. అది మరలా తలూపింది. “డబ్బులు తీసుకొని రాపో” అన్నాడు. అది అలాగే చూడసాగింది. “ఇప్పుడు లేవా… సరే రేపు తీసుకొనిరా” అన్నాడు. అది తలూపింది.
“సరే… అయితే ఈ ఎద్దులని నీ దగ్గరే పెట్టుకో. రేపు వచ్చి డబ్బులు తీసుకొని పోతా” అంటూ ఎద్దులని అక్కడే వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆ రోజు చీకటి పడ్డాక అక్కడికి కొందరు దొంగలు వచ్చారు. దొంగతనం చేసిన బంగారం పుట్టలో దాచారు. ఎద్దుల దగ్గర ఎవరూ లేనిది చూసి వాటిని తోలుకొని వెళ్ళిపోయారు.
తరువాత రోజు పొద్దున్నే ఎర్రన్న పుట్ట దగ్గరికి వచ్చాడు. తొండను పిలిచాడు. ఎంతసేపు పిలిచినా లోపల నుంచి ఏమీ రాలేదు. “ఏమే దొంగదానా… ఎద్దులు తీసుకోని డబ్బులు ఇవ్వవా… ఎలా తప్పించుకొంటావో చూద్దాం” అంటూ కోపంగా పుట్ట తవ్వాడు. లోపల దొంగలు దాచిన బంగారు మూట దొరికింది.
“అరెరే… ఎంత మంచిదానివి. నా కోసం మూట పెట్టి మరీ పోయావా… నేనే అనవసరంగా నిన్ను తిట్టానే…” అనుకుంటూ ఆ బంగారం తీసుకొని వెళ్ళిపోయాడు. తొండ వాని ఎద్దులు కొన్న సంగతి విని అందరూ ముక్కున వేలేసుకున్నారు.
కోతి ఉపవాసం – Telugu Kathalu
ఒక గుడి దగ్గర ఒక చెట్టు ఉండేది. దాని మీద ఒక కోతి ఉండేది. అది రోజూ గుడికి వచ్చే పోయే వాళ్ళని బాగా గమనించేది. ఒకసారి శివరాత్రి వచ్చింది. గుడి పూజారులు , గుడికి వచ్చే భక్తులు ఏమీ తినకుండా ఆ రోజంతా ఉపవాసం చేయటం చూసింది.
“ఆహా! నేను కూడా ఈ మనుషుల్లాగే ఒక్క రోజైనా ఉపవాసం ఉండాలి. అప్పుడు నాకు కూడా పుణ్యం వస్తుంది” అనుకొంది. తరువాత రోజు ఆహారం కోసం ఎటూ పోకుండా కదలక మెదలక చెట్టుపైన ఏమీ తినకుండా అలాగే కూర్చుంది. పావు గంట గడిచింది. దానికి ఒక అనుమానం వచ్చింది. ఏమీ తినకపోతే రేపటికంతా నీరసం వస్తుంది గదా. అప్పుడు ఆహారం సంపాదించుకోగలనో లేనో. ఎందుకైనా మంచిది ఈ రోజే తెచ్చి పెట్టుకుంటే ఉపవాసం పూర్తి కాగానే తినొచ్చు గదా అనుకొంది.
వెంటనే గుడి చుట్టుపక్కలంతా బాగా వెదికి నాలుగు అరటి పళ్ళు సంపాదించి వాటిని పక్కన పెట్టుకొని కూర్చుంది. ఒక పావుగంట గడిచింది. పక్కనే అరటి పళ్లు కనడుతూ వుంటే దానికి నెమ్మదిగా ఆకలి పెరగసాగింది. “ఇదేమి ఇంత నీరసంగా ఉంది. ఇప్పుడే ఇలా వుంటే రేపటికంతా ఎలా ఉంటుందో ఏమో… ఎందుకైనా మంచిది. ముందుగానే తొక్కవలుచుకొని పళ్ళను సిద్ధంగా ఉంచుకొందాం” అనుకొంది. వెంటనే అరటిపండ్ల తొక్కలు వలచి ఎదురుగా పెట్టుకుంది.
ఇంకో పావుగంట గడిచింది. దానికి ఆకలితో మరింత నీరసం పెరిగింది. అసలు రేపు పొద్దునకి అరటిపండ్లు తినే శక్తి తనకి ఉంటుందో లేదోనని అనుమానం వచ్చింది.
దాంతో “ఎందుకైనా మంచిది. ఒక పండును మింగకుండా, బుగ్గన పెట్టుకుంటాను. ఉపవాసం పూర్తి కాగానే గుటుక్కున మింగవచ్చు. తినడం తప్పు గానీ బుగ్గన పెట్టుకోవడం తప్పు కాదు కదా” అనుకుంది. వెంటనే ఒక పండు తీసి నోట్లో బుగ్గన పెట్టుకుంది. మరో పావుగంట గడిచింది. పండు రసం తీయగా నోట్లో ఊరడం మొదలు పెట్టింది. దాంతో దానికి ఆకలి మరింత పెరిగిపోయింది. ఇక తట్టుకోలేక ఛీ.. ఛీ! ఈ ఉపవాసాలు చెడ్డ పనులు చేసి పుణ్యం కోసం తనకలాడే మనుషులకే కానీ మంచివాళ్ళమైన మాలాంటి కోతులకి కాదు” అనుకుంటూ అన్ని అరటి పండ్లను గబగబా తినేసింది. ఈ విధంగా ఒకరోజు అనుకున్న కోతి ఉపవాసం కాస్తా ఒక గంటలోనే పూర్తి అయ్యింది.
దేని అందం దానిదే – Telugu Short Stories
ఒక అడవిలో ఒక గాడిద ఉండేది. అది ఒక రోజు నెమలి పురివిప్పి ఆట ఆడుతుంటే చూసింది. “అబ్బ… ఆ నెమలి పింఛం ఎంత అందంగా ఉంది. అది నాకు గూడా ఉంటే ఎంత బాగుంటుందో” అనుకొంది. ఒకరోజు గాడిద ఏటిలో నీళ్ళు తాగుతా పులిని చూసింది.
“అబ్బ…దీని ఒళ్ళంతా చారలు చారలుగా ఎంత నిగనిగలాడుతోంది. నాగూడా ఒళ్ళంతా పులిలా చారలుంటే ఎంత బాగుంటుందో” అనుకొంది.
ఒకరోజు గాడిద పొడవైన మెడతో ఒక పెద్ద చెట్టు ఆకులు తెంపుతా వున్న జిరాఫీని చూసింది. ఆ “అబ్బ… దీని మెడ ఎంత బాగుంది. నాకు గూడా ఇలాంటి పొడవైన మెడ వుంటే ఎంత బాగుంటుందో” అనుకొంది.
గాడిద తాను అందంగా లేనని చాలా బాధపడసాగింది. ఒకరోజు దానికి ఒక ముని కనిపించాడు. ఆ ముని కాళ్ళపై పడి “నాకు నాలుగు వరాలు ఇవ్వు” అని వేడుకొంది. ముని దాని బాధ చూసి “సరే” అన్నాడు.
గాడిద వెంటనే నెమలిలాగా పింఛం, పులిలాగా చారలు, జిరాఫీలాగా మెడ కావాలనుకొంది. మూడు వరాలతో మూడు వచ్చేశాయి. నాలుగోవరం దాచుకొంది.
గాడిద సంబరంగా ఇంటికి పోయింది. కానీ దాన్ని చూసి మిగతా గాడిదలన్నీ భయపడిపోయాయి. కొన్ని పారిపోయాయి. ఏవీ దానితో మాటలు కలపలేదు. మిగతా జంతువులుగూడా దూరం దూరం తిరగసాగాయి. దాంతో ఆ గాడిద పోయి చెరువులో తన రూపం తాను చూసుకొంది. ఆ చారలు, పొడవైన మెడ, నెమలి పింఛం తనకే చాలా వికారంగా అనిపించాయి. తన పాత రూపమే చాలా అందంగా తోచింది. వెంటనే నాలుగోవరంతో తన రూపం తనకు రావాలని కోరుకుంది.
అరటి తొక్క – Pitta Kathalu
ఒక ఊరిలో సోము అని ఒక పిల్లోడు వుండేవాడు. వాడు చానా అల్లరోడు. ఎవరి మాటా వినేవాడు కాదు. తన పనులతో ఎప్పుడూ అందరినీ ఇబ్బంది పెట్టేవాడు. ఒకసారి సోము పొద్దున్నే అరటి పండు తిని తొక్క విసిరి వీధిలో పడేశాడు. అది సక్కగా పోయి దారి నడుమ పడింది.
కాసేపటికి ఒక పిల్లవాడు అటువైపు ఏదో పనుండి వేగంగా ఉరుక్కుంటా వచ్చాడు. పాపం… ఆ పిల్లోడు ఆ అరటి పండు తొక్కను చూసుకోకుండా దానిమీద కాలేశాడు. అంతే… అసలే అది నున్నని తారు రోడ్డు. దాంతో ఆ పిల్లోడు సర్రున జారుకుంటా ముందుకు పోయాడు. సరిగ్గా అదే సమయంలోనే ఆ
పిల్లోని ముందు ఒక ముసలాయన వేగంగా సైకిలు తొక్కుకుంటా వచ్చాడు. ఆ పిల్లోడు సర్రున జారుకుంటా రావడం చూసి ఎక్కడ ఢీ కొట్టుకుంటాడో ఏమా అని భయపడి … ఒక్కసారిగా సైకిలు పక్కకు తిప్పాడు. అక్కడ ఒక గాడిద హాయిగా కాగితాలు తింటా వుంది. ఆ ముసలాయన సైకిలు పక్కకు తిప్పాడు కదా … అది సర్రున పోయి దభీమని ఆ గాడిదకు గుద్దుకుంది.
అంతే… ఆ దెబ్బకు గాడిద అదిరిపడి వేగంగా ముందుకు వురికింది. అక్కడ ఒకాయన గోడకు నిచ్చన వేసుకొని పైకి ఎక్కి సున్నం కొడతా వున్నాడు. గాడిద పోయి ఆ నిచ్చనకు తగిలింది. దాంతో నిచ్చన అటూఇటూ ఊగింది. దానిమీద నిలబడి వున్నతను పైనుంచి ఎక్కడ పడిపోతానో ఏమో అని భయపడి చేతిలోని సున్నం డబ్బా వదిలేసి కింద పడకుండా గోడను గట్టిగా పట్టుకున్నాడు.
ఆయన నిచ్చన మీదనుంచి సున్నండబ్బా వదిలేశాడు గదా… అది సరిగ్గా అప్పుడే అటువైపు వచ్చిన ఒక దున్నపోతు మీద దభీమని పడింది. దాంతో పైనుంచి ఏమి పడిందో ఏమో అని భయపడిన ఆ దున్నపోతు వేగంగా అక్కడినుంచి సర్రున ముందుకు వురికింది.
అప్పుడే సోము బడికి పోవడానికి సంచీ తగిలించుకోని తెల్లని బట్టలతో బైటకు వచ్చాడు. అంతలో వేగంగా అటువైపు దూసుకొని వచ్చిన ఆ దున్నపోతుని చూసి అడిరిపడ్డాడు. అది ఎక్కడ తనను ఢీ కొడుతుందో ఏమో అని భయపడి వెనక్కు తిరిగి ఇంటివైపు వురకసాగాడు. ఇంటి ముందు వీధిలోకి విసిరేసిన అరటి తొక్క పడివుంది గదా… సోము ఆ కంగారులో చూసుకోక దాని మీద కాలేశాడు. అంతే… సోము జర్రున జారుకుంటా ముందుకు పోయాడు. అక్కడ ఒక పెద్ద మురికి కాలవ వుంది. దభీమని పోయి దానిలో పడ్డాడు. తెల్లని బట్టలు కంపు కొడతా నల్లగా బురద బురద అయ్యాయి. అది చూసి జనాలందరూ పడీ పడీ నవ్వసాగారు. సోము తలవంచుకొని బైటికి వచ్చాడు. రోడ్డుమీద అరటి తొక్క పకపకపక నవ్వుతా కనబడింది.
చింతపండు… జాంపండు – Telugu Short Stories Text
ఒక చెట్టుకు ఒక పెద్ద తేనెతుట్టె వుంది. కుందేలు, తాబేలు తేనెటీగలను అడిగి కొంచం తేనెను తాగాలనుకున్నాయి. రెండూ నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకున్నాయి. అంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఒక దొంగనక్క ఎగిరి రెండింటినీ పట్టుకొంది. “ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరికింది. నేను, నా పెళ్ళాం పిల్లలూ అందరం హాయిగా తినొచ్చు” అంది లొట్టలు వేసుకుంటా.
తాబేలుకు ఏం చేయాలో తోచలేదు. కానీ కుందేలు తెలివైంది. అది వెంటనే “నక్కరాజా! మేము ఎలాగూ మీ చేతిలో పడ్డాం. ఇక చావు ఖాయం. చచ్చేముందు చివరికోరిక తీరితే హాయిగా నీకు ఆహారమవుతాం” అంది.
“సరే… నాకు చేతనైతే తప్పక తెచ్చిపెడతా… కోరుకోండి” అంది.
“ఏం లేదు.. నక్కరాజా… తేనె తాగాలని ఎంతో ఆశతో వచ్చాం . తలా నాలుగు చుక్కలు మా నోటిలో పోయి చాలు. హాయిగా చప్పరించుకుంటా నీకు ఆహారమయిపోతాం” అంది.
నక్క నవ్వి… “ఓస్… ఇంత చిన్న కోరికా… కానీ ఎలా తేనె తాగడం” అంది.
“ఏముంది రాజా… రాయి తీసుకొని కొడదాం… తేనె చుక్కలు కిందకు రాలుతాయి. నోరు తెరచి తలా నాలుగు చుక్కలు తాగుతాం” అంది కుందేలు.
“అలాగే… కొడుతున్నా… సిద్ధంగా వుండండి” అంది నక్క సరే అంటూ నోళ్ళు తెరచినట్టు నటించాయి కుందేలు, తాబేలు. నక్క రయ్యిమని రాయి విసిరింది. అంతే… అది తగలగానే ఝుమ్మని తేనెటీగలు లేచాయి. కింద నక్క కనిపించింది. అంతే సర్రున వచ్చి కస కస కస కుట్టసాగాయి.
“అబ్బా మంట అబ్బా మంట” అంటూ నక్క రెండు చేతుల్లోని కుందేలు, తాబేలును వదిలి వేసింది. అంతే కుందేలు ఎగిరి పొదల్లోకి దూరింది.
తాబేలు సర్రుమని తల డిప్పలోకి ముడుచుకుంది. నక్క ఒక్కటే తేనెటీగలకు దొరికింది. ఇంకేముంది. చింతపండు… జాంపండు…
గాలిమేడలు – Telugu Stories for Children
ఒక ఊరిలో రామారావు అని ఒక సోమరి ఉండేవాడు. అతనికి పని తక్కువ. ఆలోచనలు ఎక్కువ. ఒకరోజు ఏదయినా పనిచేసి బాగా సంపాదించాలి అనుకున్నాడు. వాళ్ళమ్మ దగ్గర పది రూపాయలు ఇప్పించుకొని కుండలో పాలు పోయించుకొన్నాడు.
కుండ నెత్తిన బెట్టుకొని పోతావుంటే ఆలోచనలు మొదలయ్యాయి. ఈ పాలకు తోడు పెడితే పెరుగవుతుంది. ఇప్పుడు ఎండాకాలం. పెరుగును మజ్జిగ చేసి అమ్ముతే చాలా డబ్బులు చేతిలో పడతాయి. ఆ డబ్బుతో కోళ్లను కొంటాను. అవి రొజుకొక గుడ్డు పెడతాయి. వాటిని కోళ్ళు పొదిగితే పిల్లలు అవుతాయి. కోళ్ళనమ్మిన డబ్బులతో పెద్ద మేడ కడతాను. చక్కని చుక్కను పెళ్ళి చేసుకొని పిల్లలను కంటాను. పిల్లలకు అడిగినవన్నీ కొనిచ్చి బాగా చూసుకుంటాను. నా పిల్లలని ఎవరయినా ఏమయినా అంటే కాలితో ఒక్క తన్ను తంతాను.
అంటూ ఆలోచనలోనే కాలు వేగంగా ముందుకు ఊపాడు. ఎదురుగా ఒక పెద్ద రాయి వుంది. కాలుపోయి దానికి కొట్టుకొంది. అంతే… అది తగిలి అలాగే ముందుకు దభీమని పడ్డాడు. కుండ పగిలి పాలన్నీ నేల పాలయ్యాయి.
మర్రిపండు – గుమ్మడి పండు – Pitta Kathalu
సుబ్బయ్య ఒకసారి ఎంతో దూరం నుండి నడిచీ నడిచి అలసిపోయి ఒక మర్రిచెట్టు కింద కూచున్నాడు. మర్రిచెట్టు వంక చూశాడు. దానికి చిన్నచిన్న ఎర్రటి కాయలు కనిపించాయి. దూరంగా నేలమీద ఒక గుమ్మడి తీగ అంతా అల్లుకోని కనబడింది. ఆ గుమ్మడి తీగకు పెద్ద పెద్ద కాయలు వున్నాయి.
సుబ్బయ్య వాటిని చూచి “ఈ దేవునికి కొంచంగూడా తెలివి లేదు. లేకపోతే ఇంత పెద్ద మర్రిచెట్టుకు ఇంత చిన్న పళ్ళేమి ? అంత చిన్న గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలేమిటి?” అనుకున్నాడు. కాసేపటికి సుబ్బయ్య అలసటతో ఆ మర్రిచెట్టు కింద అలాగే పండుకున్నాడు.
కొంచెం సేపు పండుకున్నాక లేచాడు.. వంటి మీద చాలా మర్రి పళ్ళు రాలి కనబడ్డాయి. ఆ మర్రిపళ్ళు చూసిన సుబ్బయ్య అదిరిపడ్డాడు. “అరెరే …. అనవసరంగా దేవున్ని తెలివి లేని వాడు అనుకున్నాను గానీ… దేవుడు ఎంత తెలివైనవాడు. మర్రిచెట్టుకే గనుక పెద్ద పెద్ద కాయలు ఉండింటే అవి పడి ఇప్పటికల్లా నాతల పగిలి చచ్చేటోన్ని”గదా అనుకున్నాడు.
ఎవరు దొంగ – Telugu Stories
కందనవోలు అనే ఊరిని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజు దగ్గర ఒక బంగారు హారం వుండేది. ఆ హారం చానా ఖరీదయినది. ఒక రోజు అంతఃపురంలో ఎవరో ఆ హారాన్ని కాజేశారు. ఎవరిని అడిగినా ‘నాకు తెలీదు’ అంటే ‘నాకు తెలీదు’ అన్నారు. రాజు ఒక కుండ తెప్పించాడు.
దానికి బాగా మసివుంది. అంతఃపురంలో పనిచేసే వాళ్ళందరినీ పిలిపించాడు. కుండ గదిలో పెట్టి “లోపలున్నది మహిమగల కుండ. ఒకొక్కరే కళ్ళు మూసుకొని పోయి దానిని ముట్టుకోని కళ్ళు తెరవకుండా అలాగే బైటకు రావాలి. ఎవరు దొంగతనం చేసుంటే వాళ్ళ చేతికి మసి అంటుతుంది” అని చెప్పాడు. ఒకొక్కరే లోపలికి పోతున్నారు. ముట్టుకుంటున్నారు.
ఆ హారాన్ని దొంగిలించిన భటుని వంతు వచ్చింది. ముట్టుకుంటే మసి అంటుతుందని భయపడి ముట్టుకోకుండానే బైటకి వచ్చాడు. రాజు అందరి చేతులూ చూచాడు. ఆ ఒక్క ఆభటునికి తప్ప అందరికీ మసి అంటి వుంది. రాజు నవ్వుతా “అది మహిమగల కుండ కాదు. ఏమీ కాదు. ముట్టుకున్న అందరికీ మసి అంటుతాది. ఈ భటుడు దొంగ కాబట్టి భయపడి ముట్టుకోలేదు. అందుకే వీని చేతికి మసి అంటలేదు” అంటా వానిని కారాగారంలో వేశాడు.
కోతి – అరటిపళ్ళు – Telugu Stories for Kids
ఒక అడవిలో ఒక కోతి వుండేది. ఒకరోజు ఆ కోతి ఆహారం కోసం అడవి అంతా వెదికింది. ఏమీ దొరకలేదు. అంతలో ఆ కోతి వున్న చెట్టు కిందకి నాలుగు కుందేళ్ళు తలా ఒక అరటి పండుతో వచ్చాయి. కోతి కుందేళ్ళ దగ్గరికి వచ్చింది. “నాకు చాలా ఆకలిగా వుంది. ఒక అరటి పండు ఇయ్యరా” అని అడిగింది.
కుందేళ్ళు ‘లేదు… లేదు…. మేము ఒక పండు ఇవ్వము’ అన్నాయి. “కనీసం సగమన్నా ఇవ్వండి. చాలా ఆకలిగా వుంది” అంటూ కోతి మళ్ళా అడిగింది. కుందేళ్ళు ‘సరే’ అన్నాయి.
మొదటి కుందేలు తన పండులో సగం ఇచ్చింది. రెండో కుందేలు కూడా తన పండులో సగం ఇచ్చింది. అలా ఆ నాలుగు కుందేళ్ళు తలా సగం సగం ఇచ్చాయి. కోతి సంబరంగా అన్నీ తిని “నేను ఒకటి అడుగుతే ఇవ్వలేదు. కానీ అందరూ కలిసి తలా సగం ఇచ్చి రెండు పళ్ళు ఇచ్చారు. మీరు ఎంత అమాయకులు” అనింది. కుందేళ్ళు ‘అవును కదా’ అని నాలిక కరచుకున్నాయి.
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. contact@telugubucket.com
Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu