Menu Close

1000+ Moral Stories in Telugu for Children – నీతి కథలు

Lowest Price - Shop Now

32 Inch TV - High Quality Screen - Android - Dolby

సీతాకోక చిన్నది – Telugu Stories Text

ఒక ఊరిలో ఒక చిన్నపాప ఉండేది. . ఆ పాప చాలా మంచిది. కానీ చాలా పేదది. ఒకరోజు బడిలో పిల్లలు కొందరు సీతాకోకచిలుకలను పట్టుకొన్నారు. వాటికి దారాలు కట్టి ఎగురవేయసాగారు. పాప అది చూసింది. బాధపడింది. పరుగెత్తుకు వెళ్ళి టీచరుకి చెప్పింది. టీచరు పిల్లలందరినీ తిట్టి సీతాకోకచిలుకలని విడిచి పెట్టింది. అవి చాలా సంతోషించాయి. ఒకరోజు బడిలో పిల్లలందరికీ రంగురంగుల బట్టలు వేసుకునే పోటీ పెట్టారు.

అందరూ రంగురంగుల మంచిమంచి కొత్త కొత్త బట్టలు వేసుకొచ్చారు. ఆ పాపకు కొత్త బట్టలు లేవు. ఎప్పటిలాగే తెల్లబట్టలు వేసుకోని వచ్చింది. అది చూసి పిల్లలందరూ ఎగతాళి చేశారు. పాప బడి వెనక్కు పోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. అది సీతాకోకచిలుక చూసింది. తనవారందరినీ పిలుచుకొని వచ్చింది.
వెంటనే అవన్నీ ఆ పాప తెల్లని బట్టల మీద తలా కొంత తమ ఒంటి మీదున్న రంగులను అంటించసాగాయి.

కొద్ది నిముషాలలో గౌను రంగురంగులతో మెరిసిపోయింది. పాప ఆ గౌనుతో రాగానే పిల్లలందరూ నోళ్ళు తెరిచారు. “అబ్బ… ఎంత ముచ్చటగా ఉందీ గౌను” అంటూ మెచ్చుకున్నారు. ఇంకేముంది… మొదటి బహుమతి మన చిన్నపాప చేతుల్లోకి వచ్చి వాలింది.

అసలైన దొంగ – Telugu Short Stories

ఒక ఊరిలో రామయ్య , సోమయ్య అని ఇద్దరు పక్క పక్క ఇళ్లలో వుండేవాళ్ళు. రామయ్య చాలా మంచివాడు. నిజాయితీపరుడు. పదిమందికి సహాయం చేసే గుణం కలవాడు. అందుకని అందరూ రామయ్యను మెచ్చుకొనేవాళ్ళు. రామయ్యను అందరూ పొగుడుతూ వుంటే చూసి పక్కింటిలో ఉండే సోమయ్య అసూయతో కుతకుత ఉడికిపోయేవాడు. ఎలాగైనా సరే పదిమంది ముందు రామయ్యను అవమానించి పరువు తీయాలని అనుకున్నాడు.

ఒకసారి దసరా పండగ వచ్చింది. ఊరి పెద్దలు గుడిలో హరికథలు చెప్పడానికి ఒక మంచి హరి కథకున్ని పిలిపించారు. జనాలందరు చీకటి పడేసరికి ఊరి బైటి గుడి దగ్గరికి చేరుకునేవారు. కుంకుమ , అగరబబత్తి , టెంకాయ అమ్మవారికి ఇచ్చి గుడి ముందుకు చేరేవాళ్ళు. హరికథ పదికి మొదలయ్యేది. ఐపోయేసరికి ఏ రెండో మూడో అయ్యేది. చీకటిలో పోవడం ఎందుకని చాలామంది ఆ గుడి ఆవరణలోనే పడుకొని ఉదయాన్నే లేచి వెళ్లిపోయేవారు. రామయ్య సోమయ్య కూడా రోజూ హరికథలు విని అక్కడే పడుకునేవారు.

సోమయ్య ఒక రోజు అందరూ నిదురపోయాక నెమ్మదిగా లేచి గుడిలోకి పోయాడు. అమ్మవారి మెడలో హారం తీసుకొచ్చి రామయ్య జేబులో వేశాడు. తిరిగి తాను పడుకున్న చోటికి పోయి దొంగ దొంగ అని గట్టిగా కేకలు వేశాడు. అందరూ ఆ అరుపులు ఉలిక్కిపడి లేచారు. అమ్మవారి మెడలో హారం లేదు. ఇక్కడ పడుకున్న వారిలోనే ఎవరో దొంగతనం చేసి వుంటారని అందరినీ వెదకడం మొదలు పెట్టారు. ఆ హారం రామయ్య దగ్గర దొరికింది. నువ్వు చాలా మంచివాడివని అనుకున్నాము గానీ… ఇలాంటి వాడివని అనుకోలేదు అంటూ తలోమాట అనసాగారు.

రామయ్య కళ్ళలో నీళ్ళు తిరిగాయి. చేయని తప్పుకు మౌనంగా తల దించుకొని నిలబడ్డాడు. కానీ పూజారికి రామయ్య మంచితనం బాగా తెలుసు. దాంతో అందరినీ వారించి… అసలు దొంగ ఎవరో నేను కనుక్కుంటాను. ముందు మీరంతా వరుసగా నిలబడండి అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. పూజారి బిందెతో నీళ్లు తెచ్చాడు. ఒకొక్కరే వరుసగా వచ్చి నీళ్లతో కాళ్ళు కడుక్కోండి అన్నాడు.

అలా… వరుసగా ఒకొక్కరే కడుక్కుంటా వుంటే… సోమయ్య కడుక్కున్నప్పుడు నీళ్లు కుంకుమ రంగులో ఎర్రగా వచ్చాయి. వెంటనే పూజారి సోమయ్యను పట్టుకొని వీడే అసలైన దొంగ అన్నాడు. పిల్లలూ… సోమయ్యనే అసలైన దొంగ అనే విషయం పూజారి ఎలా కనిపెట్టాడో ఆలోచించి చెప్పండి.

రాముటోపి – Pitta Kathalu

ఒక ఊరిలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. రాముకి వాళ్ళ అమ్మ ఎండాకాలంలో ఒక అందమైన రంగు రంగుల టోపీ కొనిచ్చింది. రాము ఎండ పడకుండా దానిని నెత్తిన పెట్టుకొని ఆనందంగా తిరగసాగాడు. రాము వాళ్ళ పక్క ఇంటిలో రవి అనే పిల్లవాడు వున్నాడు. ఆ పిల్లవాడు చాలా చెడ్డవాడు. ఎలాగయినా సరే రాము టోపి కొట్టేయాలి అనుకున్నాడు. ఒకరోజు రాము నిదురపోతుంటే రవి ఆ టోపీని దొంగలించాడు. ఎవరికీ కనబడకుండా పశువుల పాకలోని గడ్డిలో దాచిపెట్టాడు. ఒక వారం తరువాత అందరూ మరిచిపోయాక తీసుకుందాం అనుకున్నాడు.

రవి వెళ్లిన కాసేపటికి ఒక బరగొడ్డు గడ్డికోసమని అక్కడికి వచ్చింది. గడ్డి పట్టుకొని లాగుతా వుంటే లోపలున్న టోపీ జారి దభీమని దాని నెత్తిన పడింది.
“అరే… ఇదేదో భలే బాగుందే… ఎండపడకుండా చల్లగా గమ్మత్తుగా” అనుకుంటూ బరగొడ్డు నెత్తి మీద టోపీతో రోడ్డు మీద కులుక్కుంటూ నడవసాగింది.
బరగొడ్డు టోపీ పెట్టుకొని పోతూ వుంటే ఒక కుక్కపిల్ల చూసింది.

“అబ్బ… ఎంత ముచ్చటగుంది ఈ టోపి. ఎలాగయినా సరే దీనిని కొట్టేయాలి” అనుకుంది. అంతలో దానికి ఒకచోట కొంచెం పచ్చగడ్డి కనబడింది. పరిగెత్తుకుంటూ పోయి ఆ గడ్డి తీసుకొచ్చి బరగొడ్డు పోయే దారిలో వేసింది. పచ్చగడ్డి చూసిన బరగొడ్డు సంతోషంగా దానిని తినడానికి తల వంచింది. అంతే… అలా తల వంచిన వెంటనే కుక్కపిల్ల వురుక్కుంటా వచ్చి ఆ టోపీని పట్టుకొని పారిపోయింది.

కుక్కపిల్ల నెత్తిన టోపీ పెట్టుకొని సంబరంగా ఎగురుకుంటా పోతా వుంటే చెట్టు మీద నుంచి ఒక కోతి చూసింది. “అరే… ఎంత అందంగుందీ టోపీ. ఇది దాని నెత్తి మీద కన్నా నా నెత్తి మీద వుంటే ఇంకా అందంగా ఉంటుంది” అనుకొంది. కుక్కపిల్ల చెట్టు కిందకు రాగానే పైనుంచి లటుక్కున టోపీ తీసుకొని, చటుక్కున పైకి ఎక్కి పారిపోయింది.

చెట్టు మీద టోపీ పెట్టుకొని సంబరంగా కిచకిచలాడుతున్న కోతిని ఒక కాకి చూసింది. “అరే… ఇదేదో చాలా బాగుందే. గూడులాగా… దీనిని ఎత్తుకుపోతే మా పిల్లలు చాలా సంబరపడతాయి” అనుకుంది. వెంటనే వేగంగా దూసుకొని వచ్చి కాళ్ళతో ఆటోపీని పట్టుకొని ఎగిరిపోయింది. కాకీ టోపీ తీసుకొని పోతూ వుంటే దారిలో ఒక గద్ద ఎదురయింది. “అబ్బ… ఎర్రగా ఎంత అందంగా వుందీ టోపీ. ఎలాగయినా సరే దీనిని ఆ కాకి దగ్గర నుంచి గుంజుకోవాలి” అనుకుంది.

సర్రున వచ్చి టోపీని పట్టుకొని గుంజింది. కానీ కాకి వదలలేదు. రెండూ టోపీ కోసం పోటీపడుతూ అటూ ఇటూ గుంజుకోసాగాయి. రాము ఇంటిలో టోపీ కనబడక విచారంగా దానికోసం వెతుక్కుంటా తిరుగుతూ వున్నాడు. పైనేమో కాకీ, గద్దా రెండూ టోపీ కోసం తన్నుకుంటా ఉన్నాయి గదా… ఆ గొడవలో ఆ
టోపీ జారిపోయింది. అది సర్రున పైనుంచి వచ్చి సరిగ్గా కింద పోతున్న రాము తల మీద పడింది. “అరే… ఇది నా నా రంగు రంగుల టోపీనే. ఎలా ఆకాశంలోంచి వచ్చి నా నెత్తిన పడింది. ఇదేదో భలే వింతగా వుందే” అనుకుంటూ రాము ఆనందంగా ఎగురుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.

దుడ్డుకర్ర – Neethi Kathalu

ఒక అడవిలో ఒక గంధం చెట్టు దగ్గర ఒక వనదేవత నివసించేది. ఆమె చానా మంచిది. ఆ అడవి పక్కనే వుండే ఊరిలో నాగన్న అనే పేదవాడు వుండేవాడు. అతను రోజూ అడవిలోకి పోయి కట్టెలు కొట్టుకొని వచ్చి, వాటిని అమ్ముకొని బతికేవాడు. ఏ రోజు సంపాదన ఆ రోజుకి సరిపోయేది. ఒకసారి నాగన్న రోజూ ఇలా కట్టెలు కొట్టి ఎంతకాలమని బదుకుతాను.

ఏదైనా ఒక విలువైన టేకు చెట్టుగానీ , గంధం చెట్టుగానీ దొరికితే ఒక ఆరు నెలలు హాయిగా బతకొచ్చు గదా అని అడవంతా వెదకసాగాడు. అలా ఒక నాలుగు రోజులు వెదుకుతే నాగన్నకు ఈ గంధం చెట్టు కనబడింది.దాంతో నాగన్న సంబరంగా ఆ చెట్టు నరకబోయాడు. అంతలో వనదేవత అక్కడికి వచ్చి… ఈ గంధం చెట్టు నరకొద్దు. ఇది నా ఇల్లు. దానికి బదులుగా ఈ దుడ్డుకర్ర తీసుకో. దీంతో నువ్వు ఎవరిని కొడితే వాళ్ళ రోగాలు వెంటనే నయమవుతాయి. దాంతో వాళ్ళు సంతోషంగా నీ చేతిలో ఎంతో కొంత పెడతారు అంది.

నాగన్న కర్ర తీసుకొని అడవిలో తిరిగి బైలుదేరాడు. దారిలో గూని గురువయ్య ఎదురు పడ్డాడు. నాగన్న దుడ్డుకర్రతో వాని వీపు మీద ఒక్కటి వేశాడు. వెంటనే గురువయ్యకు గూని పోయింది. అతను సంబరంగా నాగన్న చేతిలో వంద వరహాలు పెట్టాడు. అది చూసి ఆహా… నెల రోజులు కట్టెలు కొడితే వచ్చే సంపాదన ఒక్క దెబ్బకే వచ్చేసింది అనుకున్నాడు.

నాగన్న సంబరంగా పోతావుంటే ఈసారి చాలా ధనవంతుడైన కుంటి కనకయ్య కనబడ్డాడు. దాంతో నాగన్న కర్ర తీసుకొని అతని కాలుపై ఒక్క దెబ్బ వేశాడు. అంతే అతని కాలు బాగైపోయింది. కనకయ్య సంబరపడిపోయి వేయి వరహాలు ఇచ్చాడు. అది చూసి వాడు ఆహా… ఒక్క దెబ్బకే ఒక్క ఏడాదికి సరిపోయే సంపాదన వచ్చింది అనుకున్నాడు.

వానిలో ఆశ మరింత పెరిగింది. ఎంత పెద్ద ధనవంతున్ని కొడితే అంత లాభం అనుకుంటా దుడ్డుకర్ర తీసుకొని పోసాగాడు. అంతలో వానికి వేటకు వచ్చిన రాజు కనబడ్డాడు. రాజుకు గూడా ఏదో ఒక రోగం వుండే వుంటుంది. ఒక్క దెబ్బతో అది పోతే కనీసం పదివేల వరహాలన్నా బహుమానంగా దొరుకుతుంది అనుకుంటా రాజు దగ్గరికి పోయాడు. ఒక్కసారిగా దుడ్డుకర్ర తీసి రాజు తలమీద ఒక్కటి వేశాడు. అంతే… రాజుకు ఎటువంటి రోగాలు లేకపోవడంతో ఆ దెబ్బకు తల పగిలి కింద పడ్డాడు. సైనికులు నాగన్నకు పట్టుకొని , వాని దగ్గరి ధనాన్ని గుంజుకొని కర్రను రెండు ముక్కలుగా విరిచి పడేశారు.

నాగన్న వనదేవత వరం గురించి ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. తీసుకుపోయి కారాగారంలో బంధించారు. ఆశకు పోయి దుడ్డుకర్రను పోగొట్టుకోవడమే గాక ధనంగూడా పోయి కారాగారం పాలైనందుకు నాగన్న చాలా బాధ పడ్డాడు. తరువాత రోజు గూని గురువయ్య , కుంటి కనకయ్య వల్ల విషయం తెలుసుకున్న రాజు వానిమీద జాలిపడి వాని ధనం వానికిచ్చి విడిచి పెట్టాడు.

తేలు కాటు – Moral Stories in Telugu

విజయనగరంలో దొంగలు ఎక్కువయ్యారు. రోజుకొక ఇంటిలో దొంగతనం చేయసాగారు. తెనాలి రామలింగడు ఏదో ఒక రోజు తన ఇంటిలో కూడా దొంగలు పడతారని ముందే ఊహించాడు. ఒక మంచి తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి గూటిలో పెట్టాడు. పెళ్ళానికి ఏం చేయాలో ముందే చెప్పాడు. ఒకరోజు చీకటి పడ్డాక ఒక దొంగ ఇంటిలోనికి దూరాడు. ఆ విషయాన్ని పసిగట్టిన రామలింగడు “ఏమే … మొన్న కొన్న బంగారు ఉంగరం ఇనుప పెట్టెలో దాచినావా… లేదా…” అని గట్టిగా అడిగాడు.

“లేదండి …. గూటిలోని అగ్గిపెట్టెలో వుంది. పొద్దున్నే దాచి పెడతాలే” అంది ఆమె. దొంగ అదంతా విన్నాడు. సంతోషంగా చప్పుడు చెయ్యకుండా గూటికాడికి పోయాడు. అగ్గిపెట్టె తెరిచి ఉంగరం కోసమని లోనికి ఏలు పెట్టాడు. అంతే … తేలు కసుక్కున ఆ దొంగను కుట్టింది. ఆ దొంగ నొప్పికి తట్టుకోలేక అమ్మా …. అబ్బా అని అరవడం మొదలు పెట్టాడు. ఆ అరుపులకు చుట్టుపక్కల జనాలంతా లేచారు. దొంగను పట్టేశారు.

వెనుకడుగు వేయకు – Telugu Moral Stories

శివయ్యకు రమ అనే కూతురుంది. ఆమె చక్కదనాల చుక్క కాలు కింద పెట్టనీయకుండా అల్లారుముద్దుగా పెంచాడు. నెమ్మదిగా ఆ పాప పెరిగి పెద్దగయింది. పెద్దగయ్యాక పెళ్ళి చేయాల గదా దాంతో సంబంధాలు వెదకాలి అనుకున్నాడు. . శివయ్యకు రాముడు, శేఖరుడు అని ఇద్దరు మేనల్లుళ్ళు వున్నారు. వాళ్ళిద్దరూ రమను ‘నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటా’నంటా ముందుకు వచ్చారు. ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్ళే. డబ్బున్న వాళ్ళే. దాంతో శివయ్య ఇద్దరినీ పిలిచి ‘మీలో నాకు ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. ఇద్దరూ ఒకటే. కానీ నేనొక పోటీ పెడతాను. అందులో గెలిచిన వాళ్ళకే నా కూతురును ఇచ్చి పెళ్ళి జరుపుతా. సరేనా” అన్నాడు. ఇద్దరూ ‘సరే’ అన్నారు.

శివయ్య తరువాత రోజు పొద్దున్నే ఇద్దరినీ వూరికి దూరంగా వున్న ఒక కొండ దగ్గరకు పిలుచుకొని పోయాడు. “మీలో ఎవరైతే ముందుగా ఆ కొండను ఎక్కి అక్కడున్న గుడిని చేరుకుంటారో వాళ్ళే నాకు కాబోయే అల్లుడు” అన్నాడు. ఆ కొండ చాలా ఎత్తుగా వుంది. పైకి ఎక్కడానికి సరియైన దారి గూడా లేదు. అంతా ముళ్ళ పొదలు, నున్నని రాళ్ళు, అడుగడుగునా పాములూ, తేళ్ళతో నిండి వుంది. దాంతో శేఖరుడు “అమ్మో ఆ కొండనా… నావల్ల కాదు. ఇంకేదయినా పోటీ పెట్టు” అన్నాడు. కానీ రాముడు కొంచం కూడా వెనుకడుగు వేయకుండా “రమను పెళ్ళి చేసుకోవడం కోసం నేను ఏ పోటీకయినా సిద్ధమే. ఎప్పుడు పోటీ” అంటూ ముందుకు వచ్చాడు.

“సరే… ఐతే నువ్వు ఒక్కనివే పోయి రాపో చూద్దాం” అన్నాడు శివయ్య. వెంటనే రాముడు సరేనని వురుక్కుంటా పోయి కొండ ఎక్కడం మొదలు పెట్టాడు. అది చాలా నున్నగా, జారుడుగా, ముళ్ళ పొదలతో వుంది గదా…. దాంతో కొంచం దూరం ఎక్కాక పట్టు తప్పి కాలు జారి ఒకచోట కిందపడ్డాడు. ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. అయినా సరే రాముడు కొంచం గూడా వెనుకడుగు వేయకుండా నాకు రెండు రోజులు సమయం ఇవ్వండి.

దెబ్బలు తగ్గగానే మరలా ఎక్కుతాను అన్నాడు. అది చూసి శేఖరుడు “నేను ముందే చెప్పాగదా… దాన్ని ఎక్కడం అంత సులభం కాదని. వీనికి కొంచం గూడా తెలివి లేదు. అందుకనే ఒకసారి కిందపడినా కొంచం గూడా ఆలోచించకుండా మరలా ఎక్కుతా అంటున్నాడు” అని తిట్టాడు.

ఆ మాటలకు శివయ్య నవ్వుతా “చూడు శేఖరూ… ఏదయినా ఒక పని చెబితే అడుగు కూడా ముందుకు వేయకుండా నా చేతగాదు అనే నీలాంటి వాడు ఎప్పటికీ విజయం సాధించలేడు. అసలు పని మొదలు పెట్టని వాని కన్నా, ఓడిపోయినా సరే అడుగు ముందుకు వేసినవాడే గొప్పవాడు. ఈ రోజు కాకపోయినా రేపయినా విజయం పొందుతాడు. కాబట్టి రాముడే నా కూతురికి తగిన మొగుడు, నాకు అల్లుడు” అన్నాడు. శేఖరుడు సిగ్గుతో తలదించుకొన్నాడు.

తాబేలు-ఎలుగుబంటి – Short Stories in Telugu

ఒక అడవిలో ఒక ఎలుగుబంటి వుండేది. దానికి తనకు చాలా బలం వుందని చాలా పొగరు. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకొనేది. వాటిని ఏడిపించేది. హింసించేది. దానితో అవన్నీ ఈ ఎలుగుబంటి పీడ ఎప్పుడు విరుగడ అవుతుందా అని ఎదురుచూడసాగాయి. ఆ అడవిలో సింహాలు , పులులు , ఏనుగుల వంటి పెద్ద పెద్ద జంతువులు ఏవీ లేకపోవడంతో ఎలుగుబంటికి ఎదురే లేకుండా పోయింది.

ఎలుగుబంటి ఒక రోజు అడవిలోని జంతువులను అన్నింటినీ పిలిచింది.“ ఈ అడవిలో నన్ను ఓడించే మొనగాళ్ళు ఎవరయినా వున్నారా. ఉంటే నాతో పోటీకి రండి. లేకపోతే రేపటినుంచి నేనే ఈ అడవికి రాజును. మీరంతా నేను చెప్పినట్టు వినాలి” అని సవాలు చేసింది. జంతువులు భయంతో ఏవీ ముందుకు రాలేదు..
ఆ అడవిలో ఒక తాబేలు ఉంది. అది చాలా తెలివైంది. ఎలాగైనా ఆ పొగరుబోతు ఆట కట్టించి అడవిని కాపాడాలి అనుకొంది.

వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చి “ఒక తాడు నా కాలికి కట్టుకొని ఈ చెరువులోకి దుంకుతా. నీకు నిజంగా అంత బలం వుంటే నన్ను బయటికి లాగగలవా. నీటిలో నన్ను ఎదిరించే మొనగాళ్ళు ఎవరూ లేరు” అనింది. ఆ మాటలకు ఎలుగుబంటి పడీ పడీ నవ్వుతూ “ఏందీ… నిన్ను నేను బైటికి లాగలేనా. గట్టిగా ఒక్క లాగు లాగానంటే ఎగిరి చేరువులోంచి బైటకొచ్చి పడతావు. నేను పోటీకి సిద్ధం” అంది .

తాబేలు సరే అయితే నేను నీళ్లలో బాగా అడుగుకు పోతాను. చేతనైతే లాగు చూద్దాం అంటూ ఒక కాలికి తాడు కట్టుకొని బుడుంగున నీళ్ళలోకి మునిగింది. తాబేలు వేగంగా కిందకు పోయింది. . ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసి పక్కనే మౌనంగా నిలబడింది. ఎలుగుబంటికి ఇదంతా తెలీదు కదా… దాంతో లాగడం మొదలు పెట్టింది. ఎంత లాగినా తాడు కొంచెం కూడా కదల లేదు. లాగి లాగీ దానికి చేతులు నొప్పి పెట్టాయి. ఆఖరికి ‘ ఇంక నా చేత కాదు’ అంటూ తల దించుకొంది.

వెంటనే ఆ తాబేలు మరలా తాడును తన కాలికి కట్టుకొంది. ఏమీ తెలీని నంగనాచి లెక్క పైకివచ్చి “ఓస్… నీ బలమింతేనా… ఏదో పెద్ద వీరునివి అనుకున్నానే ఇన్ని రోజులు” అంది. అది చూసి చుట్టూవున్న జంతువులు అన్నీ పడీపడీ నవ్వసాగాయి. ఎలుగుబంటి సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి వెళ్ళిపోయింది. అడవిలోని జంతువులు అన్నీ సంబరంగా చిందులు వేశాయి.

ఎవరు? – Moral Stories in Telugu

ఒక ఊరిలో ఒక రాజకుమారుడికి వివాహం చేయడానికి అతని అమ్మానాన్నలు పక్క ఊరి రాజు కూతురిని చూడటానికి వెళ్ళారు. రాజు ఆమెతో “ఆపద సమయాలలో నిన్ను ఎవరు కాపాడతారు” అని అడిగాడు. ఆమె “నన్ను మా అమ్మానాన్నలు కాపాడతారు” అని చెప్పింది. ఆ సమాధానం రాజుకి నచ్చలేదు. దాంతో వాళ్ళు మరొక వూరికి వెళ్ళారు.

అక్కడి రాజు కూతురిని కూడా “నిన్ను ఆపదలో ఎవరు కాపాడతారు” అని అడిగారు. ఆమె నా అన్నదమ్ములు కాపాడుతారని చెప్పింది. ఆ సమాధానం కూడా రాజుకు నచ్చలేదు. మరొక వూరికెళ్ళి ఆ రాజు కూతురిని ఇలాగే అడిగాడు. ఆమె మా అక్కా చెల్లెళ్ళు కాపాడతారని చెప్పింది. రాజుకు ఆ సమాధానం కూడా నచ్చలేదు.

దాంతో రాజు ఎవరైతే సరైన సమాధానం చెబుతారో వాళ్ళకి రాజకుమారున్ని ఇచ్చి వివాహం జరుపుతానని దండోరా వేయించాడు. అనేకమంది రాజభవనానికి వచ్చారు. అందరికి భోజనాలు చేసి పెట్టేందుకు రాజు ఒక అవ్వను నియమించాడు. ఆ అవ్వకు ఒక మనవరాలు వుంది. ఆమె కూడా అక్కడే ఉంది. సభలో రాజు “ఆపద సమయాలలో మిమ్ములను ఎవరు కాపాడతారు” అని అడగగానే అందరూ తలో సమాధానం చెప్పారు.

రాజుకు ఏ సమాధానమూ నచ్చలేదు. అపుడు రాజుకు అక్కడ వున్న అవ్వ మనవరాలు కనబడింది. ఆమెని పిలిచి నీవు చెప్పగలవా అన్నాడు. దానికి ఆమె “ఆపద సమయంలో నేను ఒకరి సహాయం కోసం ఎప్పుడూ ఎదురుచూడను. నన్ను నేనే కాపాడుకొంటాను” అని సమాధానం ఇచ్చింది.. ఆ మాటలు విన్న రాజు “ఇంతకాలానికి నాకు సరియైన సమాధానం వచ్చింది. ఇలాంటి ధీరురాలే నాకు కావాలి ” అంటూ ఆ అమ్మాయిని తన కుమారునికి ఇచ్చి వివాహం జరిపించాడు.

గద్ద – విమానం – Telugu Stories

ఒక అడవిలో చాలా జంతువులు నివసించేవి. అవి బాగా కలసిమెలసి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ వుండేవి… ఒక రోజు ఒక చిన్న విమానం ఆ అడవివైపు వచ్చింది. ఆ విమానాన్ని చూడగానే జంతువులన్నీ భయంతో తలా ఒక దిక్కుకు పరుగెత్తసాగాయి. ఎందుకంటే అది మామూలు విమానం కాదు. జంతువులను పట్టుకొనిపోయి అమ్ముకునేవాళ్ళ విమానం. వాళ్ళు విమానం ఆగగానే వలలు, మత్తు తుపాకీలతో దిగి జంతువులను పట్టుకొని తీసుకుపోతారు. అందుకే జంతువులన్నీ భయపడి పారిపోతున్నాయి.

అది చూసి ఒక గద్ద చాలా బాధపడింది. ఎలాగయినా అడవిలోని జంతువులను కాపాడాలనుకొంది. ఎలాగబ్బా… అని కిందామీదా పడతావుంటే దానికి తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. వెంటనే కోతి బావ దగ్గరకు పోయి “కోతిబావా… కోతిబావా… నాకు తొందరగా కొంచం బంక కావాలి. తీసుకురావా” అంది. కోతి సరేనంటూ చెట్టు మీదనుండి చెట్టు మీదకు దుంకుతూ కావలసినంత బంక తీసుకువచ్చింది.

ఆ బంక తీసుకున్న గద్ద ఎగురుకుంటా ఏనుగు మామ దగ్గరకు పోయి “ఏనుగుమామా… ఏనుగుమామా… కొంచం బొగ్గులు మెత్తగా నూరి ఇవ్వవా” అంది. ఏనుగు సరేనంటూ కొన్ని బొగ్గులు తీసుకొచ్చి కాలికిందేసి మెత్తగా పొడిపొడిచేసి ఇచ్చింది. అంతలో గద్ద పక్కనే వున్న చెరువునుంచి కొంచం నీళ్ళు ఒక చిన్న బకెట్ లో తీసుకొని వచ్చింది. కోతి గద్ద చెప్పినట్టుగానే ఆ బకెట్ నీటిలో బొగ్గుపొడి, బంక వేసి బాగా కలిపింది. దాంతో అవన్నీ కలసి బాగా కందెనలాగా నల్లగా అయిపోయాయి.

వెంటనే గద్ద ఆ బకెట్ ను తీసుకొని విమానం వైపు గాలిలో ఎగిరింది. విమానం దగ్గరికి పోగానే ఆ కందెనను వేగంగా విమానం అద్దం మీదికి విసిరింది. అంతే… అద్దం మీదంతా నల్లగా అతుక్కుపోయింది. దాంతో ఆ విమానం నడిపేవానికి దారి కనబడక సక్కగా పోయి ఒక పెద్ద కొండను ఢీ కొట్టాడు. అంతే… విమానం ముక్కలు ముక్కలు అయిపోయింది.

దాంతో ఆ రోజునుండీ అడవిలోని జంతువులకు ఆ వేటగాళ్ళ బాధ తప్పి పోయింది. అడవిలోని జంతువులు గద్దను బాగా మెచ్చుకున్నాయి. దాని నెత్తిన పూలకీరిటం పెట్టి, ఏనుగుమీద ఎక్కించి, మేళ తాళాలతో అడవంతా తిప్పి గౌరవించాయి.

మూడునాళ్ళ ముచ్చట – Telugu Stories PDF

ఒక ఇంటిలో రాగిలోటా వుండేది. ఇంటిలో అందరూ దానితో నీళ్ళు తాగేవారు. ఆ ఇంటిలో ఒక చిన్నబాబు వున్నాడు. ఆ బాబు దానితో బాగా ఆడుకునేవాడు. అది చూసి రాగిలోటా చాలా సంతోషించేది… ఒక రోజు వాళ్ళింటికి బంధువులు వచ్చారు. తమవెంట ఒక అందమైన గాజులోటా తెచ్చారు. దానిని బాబుకు బహుమతిగా ఇచ్చారు..

దాని మీద రంగురంగుల పూలబొమ్మలు వున్నాయి. అది చూసి బాబుకు చాలా సంతోషం వేసింది. రాగిలోటా వదిలేసి దానితోనే నీళ్ళు తాగడం మొదలు పెట్టాడు.
అది చూసి గాజులోటాకు బాగా పొగరు ఎక్కింది. రాగిలోటాను చూసి “నేను చూడు ఎంత ముద్దుగా, ముచ్చటగా వున్నానో. నా చక్కదనం ముందు నువ్వు కొంచం గూడా పనికిరావు” అంది.

ఆ మాటలకు రాగిలోటా నవ్వుతా “నిజమే నువ్వు చాలా అందంగా వున్నావు. కానీ నీ కులుకంతా మూడునాళ్ళే. అందమొక్కటే సరిపోదు. బలం గూడా వుండాలి” అంది. ఒక రోజు బాబు నీళ్ళు తాగుతుంటే చేయి జారి కిందపడింది. అంతే భళ్ళున పగిలిపోయింది. ఆ చప్పుడుకు అమ్మ వంటింటిలోంచి పరుగెత్తుకుంటా వచ్చింది. గాజుముక్కలన్నీ ఏరి చెత్తడబ్బాలో పాడేసింది.

అది చూసి రాగిలోటా “నేను చెప్పలేదూ… నీదంతా మూడునాళ్ళ ముచ్చటే అని. నీ మీద పూలరంగు పోయి అందం తగ్గినా, చేయి జారి కిందపడినా నువ్వు చేరేది చెత్తకుప్పకే. అందుకే అందంగా వున్నానని పొగరుతో ఎగరగూడదు” అంది. పగిలిన గాజులోటా సిగ్గుతో తలదించుకొంది.

పొలమే బంగారం – Telugu Stories for Kids

ఒక రైతుకు నలుగురు కొడుకులు వున్నారు. వాళ్ళు పెద్ద సోమరిపోతులు. ఏ పనీ చేసేటోళ్ళు కాదు. రైతు ముసిలోడు అయిపోయాడు. పొలాన్ని చూసుకొనేటోళ్ళు ఎవరూ లేక పిచ్చిమొక్కలు పెరిగి ఆ పొలం పనికిరానిదిగా అయిపోయింది. ఒకరోజు రైతు నలుగురు కొడుకులను పిలిచాడు. “నేను సంపాదించిన డబ్బంతా మన పొలంలో దాచిపెట్టాను. కానీ ఎక్కడ దాచి పెట్టానో మతికి రావడం లేదు” అన్నాడు.

కొడుకులు వాళ్ళ నాయన మతిమరుపుకు తిట్టుకున్నారు. డబ్బు మీది ఆశతో పొలమంతా నాగలితో కిందికీ మీదికీ బాగా దున్నినారు. ఐనా ఏమీ దొరకలేదు.
వాళ్ళ నాయన అదిచూసి “యాడికి పోతుందిలే దొరకక… ఎలాగూ పొలం దున్నినారు గదా… నార నాటి సాగు చేయండి” అన్నాడు..

వాళ్ళు తిట్టుకుంటానే సాగు చేశారు. మూడు నెలలు తిరిగే సరికి పొలం విరగకాసింది. రైతు దాన్నంతా తీసుకోనిపోయి అమ్మేశాడు. చాలా డబ్బులు వచ్చాయి
రైతు నవ్వుతా డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి “ఇదేరా పొలంలో నేను దాచిన సంపద, మీరు పనిచేయడం మొదలు పెట్టాలిగానీ ఎప్పుడూ దొరుకుతూనే వుంటాది” అన్నాడు. ఆ రోజు నుండి రైతు కొడుకులు పనిచేసి సంపాదించడం మొదలు పెట్టారు.

SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. contact@telugubucket.com

Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks