అన్నం పెట్టే చేతిని కాపాడుకో – Telugu Moral Stories
ఒక రైతుకు వూరిబైట కొంత పొలముంది. సరదాగా దానిలో రకరకాల పూలమొక్కలు తెచ్చి నాటాడు. కొద్దిరోజులకే అవి పెరిగి పెద్దగయి రంగురంగుల పూలు పూశాయి. ఆ ఊరికి పక్కనున్న అడవిలో ఒక తేనెటీగల గుంపు వుంది. అవి తేనె కోసం వెదుకుతా వెదుకుతా ఈ తోటవైపుకు వచ్చాయి. “అబ్బ… ఎంత ముచ్చటగా వుందీ తోట. అడుగడుగునా ఒక పూవు వుంది. పూవు పూవుకూ తీయని తేనె వుంది. ఎంత తాగినా ఇంకా ఇంకా దొరుకుతానే వుంటాది. ఈ చోటును వదలగూడదు” అనుకున్నాయి.
ఆ తేనెటీగలన్నీ తోట పక్కనే వున్న ఒక పెద్ద వేపచెట్టు పైన తేనెతుట్టె పెట్టుకున్నాయి. హాయిగా రోజూ నచ్చిన పూవుపై వాలి కడుపు నిండా తాగి తుట్టె నిండా నింపసాగాయి.. ఒకరోజు ఆ తోటలోకి ఒక ఎద్దు వచ్చింది. ఒక్కొక్క మొక్కనే పెరుక్కోని కమ్మగా తినసాగింది. అది చూసి ఒక చిన్న తేనెటీగ మిగతావాటితో “సోదరులారా… అటు చూడండి. ఆ ఎద్దు పూలమొక్కలను ఎలా తింటా వుందో… మనం వెంటనే పోయి దాన్ని తోట నుంచి తరిమివేద్దాం. తోటను కాపాడుకుందాం” అంది. ఆ మాటలకు మిగతావి “అరే… నువ్వు చిన్నపిల్లవి. ఎందుకు మనకు లేనిపోని గొడవలు. తోట సంగతి తోట యజమాని చూసుకుంటాడు. అనవసరమైన వాటిలో వేలు పెట్టొద్దు” అన్నాయి. దాంతో ఆ చిన్నపిల్ల నోరుమూసుకుంది.
ఎద్దు కడుపు నిండా తిని వెళ్ళిపోయింది. తరువాత రోజు అది మరో పది ఎద్దులను ఆ తోటలోకి పిలుచుకొని వచ్చింది. అవన్నీ ఒక్కసారిగా పూలమొక్కల మీదకు దుంకాయి. కనబడిన వాటిని కనబడినట్టు తింటా మిగిలినవన్నీ తొక్కిపడేయ సాగాయి. అందంగా కళకళలాడతా వున్న ఆ తోట గంట దాటేసరికి మొత్తం వల్లకాడులా మారిపోయింది.
సాయంకాలం తోటకు వచ్చిన రైతు తోటను చూసి అదిరిపడ్డాడు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఐనా ఎవరూ కాపలా లేని ఈ వూరి బైట పూలతోట వేయడం నాదే బుద్ధితక్కువ అనుకున్నాడు. ఆ తోటను పట్టించుకోవడం మానివేశాడు. దాంతో కొద్ది రోజుల్లోనే అక్కడక్కడ మిగిలిన మొక్కలు కూడా వాడిపోయాయి.
ఆ తోట మీదనే ఆధారపడి బతుకుతా వున్న తేనెటీగలకు దిక్కు తోచలేదు.
చుట్టుపక్కల ఎక్కడ వెదికినా కొంచం గూడా ఆహారం దొరకలేదు. దాంతో అవన్నీ చిన్న తేనెటీగతో “సోదరా… వూరయినా, తోటయినా, అందరూ మనది అనుకున్నప్పుడే పచ్చగా వుంటాది. ఈ తోట మీద ఆధారపడి బతుకుతా వుండి కూడా ఈ తోట మనది కాదనుకున్నాం. కళ్ళ ముందే నాశనమవుతున్నా కాపాడుకోలేక పోయాం . మొదట వచ్చిన ఎద్దును అప్పుడు అదిలించి వుంటే ఈ రోజు ఇలా కడుపు చేత పట్టుకోని బజారున పడవలసిన అవసరం తప్పేది. మేం చేసిన తప్పును క్షమించు” అన్నాయి. అవన్నీ కళ్ళనీళ్ళతో ఆహారం కోసం వెదుక్కుంటా మరోచోటుకు బైలుదేరాయి.
సాధువు-నాగుబాము – Neethi Kathalu
ఒక గుడి దగ్గర ఒక యంకరమైన నాగుబాము ఉండేది. అది ఎవరైనా అటువైపు అడుగుబెడితే చాలు బుసలు కొడతావచ్చి కాటువేసేది. దానికి భయపడి ఎవరూ అటువైపు పోయేవారు కాదు. ఒకసారి ఒక సాధువు ఆ గుడి వద్దకు వచ్చాడు. అతనిని చూసి ఆ పాము బుసలు కొడతా బైటికి వచ్చింది. కానీ అతని పెదవులపై చిరునవ్వు , మొహంలోని వెలుగు చూసి చటుక్కున పడగ దించేసుకొంది.
సాధువు ఆ పామువంక చూసి ఎందుకు అలా అనవసరంగా అందరినీ కాటువేసి చంపుతా వున్నావు. వాళ్ళు నీకు ఏమి అపకారం చేశారు. ఇది చాలా పాపం అని చెప్పాడు. దాంతో పాము ఆరోజునుంచీ కాటువేయడం మానివేసింది. సాధువులా మారిపోయింది. విషయం తెలిసి జనాలు మరలా గుడికి రావడం మొదలు పెట్టారు.
ఒక ఏడాది తరువాత సాధువు మరలా ఆ గుడి వద్దకు వచ్చాడు. అక్కడ జనాలు బాగా తిరుగుతావున్నారు. ఒకచోట కొందరు పిల్లలు గట్టిగా కేకలు పెడతా రాళ్లు విసురుతావుంటే పోయి చూశాడు. అక్కడ నాగుబాము పారిపోతావుంది. దాని వళ్లంతా దెబ్బలతో నిండిపోయింది. అది చూసి ముని ఆ పిల్లలని అదిలించి పాము దగరికి పోయాడు… సాధువును చూసి ఆ పాము… నీవు చెప్పినట్టే ఆ రోజు నుంచీ ఎవరి జోలికి వెళ్లడం లేదు. ఐనా ఈ మనుషులు నన్ను వూరికే వదలడం లేదు. కనబడితే చాలు రాళ్లతో, కట్టెలతో కొడతా వున్నారు అనింది దీనంగా… బాధగా….
సాధువు దాని పడగపై నిమురుతూ చూడు… చెడ్డతనం ఎలా మంచిది కాదో , అతి మంచితనం కూడా మంచిది కాదు. నిన్ను వాళ్ళని కాటు వేయవద్దు అని అన్నానే కానీ బుసకొట్టి బెదిరించొద్దు అనలేదు గదా, మనం ఎదుటి వాళ్ళను బాధ పెట్టకూడదు. అలాగే ఎదుటి వాళ్ళు మనలని బాధపెట్టే అవకాశం కూడా ఇవ్వకూడదు అని చెప్పాడు. దాంతో పాము తెలివి తెచ్చుకొంది. తనను కాపాడుకోవడానికి పడగ ఎత్తి బుసలు కొట్టడం మొదలుపెట్టింది. దాంతో పిల్లలు దాని జోలికి రావడం మానేశారు.
ఎవరు మోసగాడు – Telugu Short Stories
ఒక రాజు దగ్గర ఒక మహిమలున్న కత్తెర వుంది. దానిని ఒక సాధువు అతనికి ఇచ్చాడు. ఎవరయినా సరే అందులో వేలు పెట్టి అబద్దం చెబితే అది ఆ వేలును కత్తిరించి వేసేది. అందుకే ఆ రాజుదగ్గర ఎవరూ అబద్దాలు చెప్పేటోళ్ళు కాదు. ఒకసారి నాగరాజు, శేషన్న అనే ఇద్దరు రాజు దగ్గరికి వచ్చారు. ఈ శేషన్న కత్తెరలో వేలు పెట్టి “రాజా… నేను నావద్ద వున్న బంగారు వరహాలను ఈ నాగరాజుకు ఇచ్చి విదేశాలకు పోయాను. తిరిగి వచ్చి వరహాలు అడిగితే నీకు ఇచ్చేశాను అని అబద్దం చెబుతున్నాడు. నా బంగారు వరహాలు నాకు ఇప్పించండి” అన్నాడు. కత్తెర వాని వేలును ఏమీ చేయలేదు.
తరువాత నాగరాజు వంతు వచ్చింది. నాగరాజు చేతిలో ఒక కట్టె వుంది. నాగరాజు తన చేతిలోని కట్టెను కొంచెం సేపు పట్టుకో అని శేషన్నకు ఇచ్చి
వేలు కత్తెర నడుమ పెట్టాడు. “రాజా! శేషన్న నాకు బంగారు వరహాలు ఇచ్చింది నిజమే. నేను గూడా శేషన్న వరహాలు శేషన్నకు తిరిగి ఇచ్చేశాను అన్నాడు. వేలు అలాగే వుంది. కత్తెర వానిని గూడా ఏమీ చేయలేదు.
ఆ వింత చూసి రాజుకు నోట మాట రాలేదు. ఇద్దరిలో ఒకరు అబద్దం చెబుతున్నారు అని అందరికీ తెలుసు. కానీ కత్తెర ఎవరినీ ఏమీ చేయలేదు. కత్తెర మహిమ తగ్గిపోయిందా లేక దొంగల తెలివి పెరిగిపోయిందా అని రాజు కాసేపు బాగా ఆలోచించాడు. అనుమానం వచ్చి నాగరాజు చేతిలోని కట్టెను తీసుకొని విరగగొట్టాడు. అంతే … అందులోంచి గలగలా వరహాలు బైటపడ్డాయి. రాజు నవ్వుతూ “సభలో ఉన్నవారితో… ఈ నాగరాజు కత్తెరలో వేలు వుంచేముందు ఈ కట్టెను శేషన్నకి ఇచ్చాడు. దాంతో వరహాలు తిరిగి ఇచ్చేసినట్టయింది. అందుకే కత్తెర వాన్ని ఏమీ చేయలేదు” అని చెప్పాడు . జనాలంతా రాజు తెలివిని మెచ్చుకున్నారు. రాజు వరహాలు శేషన్నకి ఇచ్చివేసి నాగరాజును చెరసాలలో వేయించాడు.
కొడుకంటే ఎలా వుండాలంటే – Short Stories in Telugu
ఒక ఊరిలో ఒక అవ్వ వుండేది. ఆమెకు పెళ్ళయిన కొన్ని రోజులకే మొగుడు చచ్చిపోయాడు. అయినా కొంచం కూడా భయపడకుండా, బాధను గొంతులోనే దిగమింగి వున్న ఒక్క కొడుకును బాగా చదివించింది. పొలాన్ని బాగా సాగుచేసి మంచి పంటలు పండించి నాలుగెకరాలను పదెకరాలు చేసింది. మంచి ఇల్లుగూడా కట్టిచ్చింది. ఆమెకు కొడుకే లోకం. తన కొడుకు చిన్న బాధగూడా పడగూడదని కోరుకునేది.
కానీ వాడు పెళ్ళయ్యాక అమ్మను కొంచంగూడా పట్టించుకోలేదు. ఇంటి బైట వున్న చెట్టు కింద అమెకు మంచమేసి అక్కన్నే వుంచేశాడు. మూడు పూటలా ఏదో కుక్కకు పెట్టినట్లు మిగిలిపోయినవి, పాచిపోయినవి ఒక గిన్నెలో ఏసి ఆమె ముందు పారేసేవాడు. ఎండయినా, చలయినా, వానయినా ఆమె ఆ చెట్టు కిందే. కన్నెత్తి చూసేటోళ్ళు లేక, పన్నెత్తి పలకరించేటోళ్ళు లేక ఆమె “దేవుడా… ఎందుకు నాకీ బతుకు, తొందరగా నన్ను తీసుకుపో” అని తెగ బాధపడేది.
ఆ వూరి రాజు చానా మంచివాడు. జనాలను కన్నబిడ్డలలెక్క కళ్ళల్లో పెట్టుకోని కాపాడుకునేవాడు. అప్పుడప్పుడు చీకటి పడ్డాక మారువేషం వేసుకోని వూరంతా తిరుగుతా జనాల బాధలు తెలుసుకునేవాడు. ఒక రోజు ఒంటరిగా బాధ పడుతున్న అవ్వను చూశాడు. ఆమె సంగతి తెలుసుకున్నాడు రాజుకు చానా బాధ వేసింది. తరువాత రోజు పొద్దున్నే ఆ ముసలామెను , ఆమె కొడుకుని సభకు పిలిపించాడు. “ఏంరా… నీ కోసం చిన్నప్పటి నుంచీ రెక్కలు ముక్కలు చేసుకోని, తినీ తినక ఎన్నో బాధలు పడి పెంచితే…. అటువంటి అమ్మను నెత్తిన పెట్టుకోని పూజించాల గానీ… ఇలా గాలికి వదిలేసి నువ్వు హాయిగా వుంటావా… అసలు కొడుకువేనా నీవు. అమ్మ సంపాదించిన ఇల్లు, పొలాలు కావాలగానీ, అమ్మ వద్దా…. అడిగేవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా…” అంటా కొరడా తీసి కొట్టిన చోట కొట్టకుండా చావగొట్టాడు. .
ఆ తరువాత అవ్వతో “చూడమ్మా… కన్నతల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు కొడుకే గాదు. అటువంటోడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. వానిపై మమకారం వదులుకో” అంటూ ఒక పిల్లవాన్ని పిలిపించి “ఇదిగో వీన్ని చూడు…. వీనికి చిన్నప్పుడే యుద్ధంలో అమ్మానాన్నా చచ్చిపోయారు. ఎవరూ లేరు. అనాథ. నా అనేటోళ్ళు లేక ఎంతో బాధపడుతా వున్నాడు. నువ్వు పూ… అను. నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు. నీతోనే వుంటా నువ్వు ఎలా చెబితే అలా వింటాడు. ఏమంటావు. పెంచుకుంటావా. నేను గూడా చివరివరకు నీ బాధల్లో తోడుంటా” అన్నాడు.
దానికా ముసలామె “రాజా… నేను బతికినా చచ్చినా పట్టించుకోని కొడుకు నాకెందుకు. ఈ పిల్లోడు నన్ను బాగా చూసుకుంటే నా తరువాత ఇల్లు, పొలమూ గూడా వీని పేరు మీద రాసి పెడతా” అంది. ఆ మాటలకు రాజు సంబరంగా చిరునవ్వు నవ్వి “శభాష్… అవ్వా… అదీ మాటంటే. ముసలితనంలో మనలని ఎవరు చూసుకుంటారో వాళ్ళే కొడుకులు గానీ ఇలాంటి వెధవలు కాదు. ఇకపై ఈ ఊరిలో ఎవరు అమ్మానాన్నలను చూసుకోకున్నా వాళ్ళకి వీనికి పట్టిన గతే పడుతుంది” అంటా వాన్ని ఆ దేశం నుంచి తన్ని తరిమేశాడు.
పొలమే బంగారం – Short Stories in Telugu
ఒక రైతుకు నలుగురు కొడుకులు వున్నారు. వాళ్ళు పెద్ద సోమరిపోతులు. ఏ పనీ చేసేటోళ్ళు కాదు. రైతు ముసిలోడు అయిపోయాడు. పొలాన్ని చూసుకొనేటోళ్ళు ఎవరూ లేక పిచ్చిమొక్కలు పెరిగి ఆ పొలం పనికిరానిదిగా అయిపోయింది. ఒకరోజు రైతు నలుగురు కొడుకులను పిలిచాడు. “నేను సంపాదించిన డబ్బంతా మన పొలంలో దాచి పెట్టాను. కానీ ఎక్కడ దాచి పెట్టానో మతికి రావడం లేదు” అన్నాడు.
కొడుకులు వాళ్ళ నాయన మతిమరుపుకు తిట్టుకున్నారు. డబ్బు మీది ఆశతో పొలమంతా నాగలితో కిందికీ మీదికీ బాగా దున్నినారు. ఐనా ఏమీ దొరకలేదు.
వాళ్ళ నాయన అదిచూసి “యాడికి పోతుందిలే దొరకక… ఎలాగూ పొలం దున్నినారు గదా… నార నాటి సాగు చేయండి” అన్నాడు..
వాళ్ళు తిట్టుకుంటానే సాగు చేశారు. మూడు నెలలు తిరిగే సరికి పొలం విరగకాసింది. రైతు దాన్నంతా తీసుకోనిపోయి అమ్మేశాడు. చాలా డబ్బులు వచ్చాయి
రైతు నవ్వుతా డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి “ఇదేరా పొలంలో నేను దాచిన సంపద, మీరు పనిచేయడం మొదలు పెట్టాలిగానీ ఎప్పుడూ దొరుకుతూనే వుంటాది” అన్నాడు. ఆ రోజు నుండి రైతు కొడుకులు పనిచేసి సంపాదించడం మొదలు పెట్టారు.
గొప్పలు చెప్పకు గురు – Telugu Kathalu
ఒక అడవిలో ఒక ఏనుగు వుండేది. అది చాలా మంచిది. ఒక కోతితో అది చిన్నప్పటి నుంచీ కలసిమెలసి వుండేది. కోతి ఒకటే గొప్పలు చెప్పుకొనేది. “మేం కోతులం చాలా తెలివైనవాళ్ళం. మాకు బుద్ధిబలం ఎక్కువ. మానవులది కూడా మా వంశమే” అనేది. ఏనుగు ఏమీ అనేది కాదు. చిన్నగా నవ్వేది..
కోతి చెట్టు పైకి ఎక్కి పళ్ళు తెంపుకొచ్చేది. ఏనుగుకు ఇచ్చేది. “చూడు నీవు నాతో వున్నందుకు ఎన్ని లాభాలో… రోజూ మంచి మంచి పళ్ళు రుచిగా తింటావున్నావు. నా మాదిరి ఎక్కగలవా చెట్టు” అనేది. ఏనుగు నవ్వేది. ఏమీ అనేది కాదు.
ఒకసారి కొందరు వేటగాళ్ళు అడవికి వచ్చారు. జంతువుల కోసం వలలు వేశారు. తీయని పళ్ళు ఎరగా పెట్టారు. జింకలు, కుందేళ్ళు, కోతులు పళ్ళ కోసం ఆశపడి వలలో ఇరుక్కుపోయాయి. వేటగాళ్ళు వాటిని పట్టుకొని తీసుకుపోసాగారు. ఏనుగుకు ఆ విషయం తెలిసింది. వెంటనే పరుగు పరుగున పోయింది. జీపును తొండంతో పట్టుకొని ఎత్తి పడేసింది. దొరికినవాన్ని దొరికినట్టు గిరగిరగిర తిప్పి విసిరి పారేసింది. అందరూ భయంతో కిందామీదా పడతా పారిపోయారు. ఏనుగు జంతువులను అన్నింటినీ విడిపించింది.
కోతి అది చూసి “అబ్బ ఎంత బలం వుంది నీకు. నాకెప్పుడూ చెప్పలేదే” అంది. ఏనుగు నవ్వి “మనకు వున్నదాని గురించి అనవసరంగా ఎవరికీ చెప్పుకోగూడదు, చూపించగూడదు. అవసరమైనప్పుడే దానిని ఉపయోగించాలి” అంటూ కోతిని ఎత్తి మీద కూచోబెట్టుకొంది.
దేవుని పాప (ఒత్తులు లేని కథ) – Pitta Kathalu
ఒక ఊరిలో ఒక పాప వుండేది. ఆ పాప రోజూ గుడికి పోయేది. పూలతో దేవుని కొలిచేది. దేవుడు ఆ పాపను చూచి ఎంతో సంతోషించేవాడు.
ఒక రోజు దేవుడు ఆపాపకు కనబడి పలకరించాడు. ఆ రోజు నుండి ఆపాప గుడికిపోయి పిలవగానే కనబడేవాడు. పాపతో బాగా ఆటలు ఆడేవాడు. మంచి మంచి పాటలు పాడేవాడు.
ఒకరోజు ఆపాప దేవునికోసం మామిడిపండు తీసుకొని గుడికి పోసాగింది. దారిలో ఒక ముసిలామె తిండిలేక కిందపడి మూలుగుతూ కనబడింది.
ఆ ముసిలామె పాప చేతిలోని పండు వంక ఆశగా చూసి “పాపా… పాపా… మూడు రోజులుగా తినడానికి తిండి లేదు, ఆకలితో నీరసంగా వుంది. ఏదయినా సాయం చేయవా” అని అడిగింది. కానీ ఆపాప “
ఊహూ… ఈపండు దేవుని కోసం. నీకోసం కాదు” అంటూ అలాగే ముందుకు పోయింది. పాప గుడికి పోయి మామూలుగానే ‘దేవా’ అని పిలిచింది. కానీ దేవుడు రాలేదు. “ఏమైంది ఎందుకు రావడం లేదు” అని బాధతో ఆపాప మరలా మరలా పిలిచింది. కానీ ఎంత పిలిచినా దేవుడు రాలేదు. దాంతో ఆపాప ఏడవసాగింది.
పాప బాధ పడతూవుంటే దేవుడు చూడలేక పోయాడు. వెంటనే పాపకు కనబడి తల నిమురుతూ “చూడు పాపా… నాకు నీవు కాకపోతే ఇంకొకరు… అడిగినా అడగకపోయినా ఏదో ఒకటి పెడుతూనే వుంటారు. కానీ దారిలో పాపం….. ఆ ముసిలామె ఆకలితో బాధపడుతూ సాయం చేయమని అడిగినా నీవు చేయలేదు.
అందుకే చాలా బాధవేసి నీముందుకు రాలేదు. పేదవారికి చేతనయిన సాయం చేయాలి. వారికి సేవ చేసినా, నాకు సేవ చేసినా ఒకటే, సరేనా” అని కారణం వివరించాడు. దాంతో ఆపాప ఆరోజు నుండి అందరికీ సాయం చేసి మంచి పేరు సంపాదించుకొంది.
తోక తెచ్చిన తంటా – Small Stories in Telugu
ఒక అడవిలో ఒక కుందేలు పిల్ల ఉండేది. అది చాలా మొండిది. ఎప్పుడూ ఏదో ఒకటి కావాలని వాళ్ళమ్మను బాగా వేధించేది. ఒకరోజు దానికి ఒక ఉడుత కనబడింది. అది తన అందమైన తోకను అటూయిటూ తిప్పుకుంటా చెంగుచెంగున ఎగురుతా వుంది. కుందేలుపిల్లకు ఆ తోక భలే నచ్చేసింది. ఉరుక్కుంటా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయింది.
“అమ్మా… అమ్మా… నాక్కూడా ఉడుతలెక్క తోక తయారుచేసి ఇవ్వమ్మా” అంటూ అడిగింది కుందేలు నవ్వి “చూడమ్మా… ఎవరి తోక వారిదే… కొన్నింటికి పెద్ద తోకలుంటాయి. కొన్నింటికి చిన్న తోకలుంటాయి. మరికొన్నింటికి మన మాదిరి మరీ చిన్నగా వుంటాయి. వాటిని చూసి మనం బాధపడగూడదు. దేని అందం దానిదే. దేని అవసరం దానిదే” అంది. కానీ కుందేలు తల్లి మాటలు వినలేదు. ఓ అంటూ ఏడుపు మొదలెట్టింది.
ఆ ఏడుపు వినలేక వాళ్ళమ్మ మెత్తని గడ్డి ఏరుకోనొచ్చి గుబురుగా ఉడుత తోక లెక్క తయారుచేసి దాని వెనుక కట్టింది. ఆ తోకను చూసుకొని హాయిగా ఎగురుకుంటా, అటూయిటూ తిప్పుకుంటా అందరికీ చూపించుకుంటా మురిసిపోసాగింది. అంతలో ఎక్కడినుంచో పులి అరుపు వినబడింది. అంతే… కుందేళ్ళన్నీ తలా ఒక దిక్కు పారిపోయాయి. కుందేలు పిల్ల గూడా తన పొదలోకి ఉరికింది. కానీ… దాని తోక గుబురైన పొదల్లో ఇరుక్కుపోయింది. పాపం… కుందేలు పిల్ల ముందుకు పోలేక, తోక విడిపించుకోలేక బాధతో అరవసాగింది. పులి దగ్గరికి వచ్చేసింది.
అంతలో కుందేలు వాళ్ళ అమ్మ వెనక్కు ఉరుక్కుంటా వచ్చి దానికి కట్టిన తోకను బలంగా లాగేసింది. అంతే… రెండూ కలసి చెంగున ఆ చెట్టు కింద ఉన్న ఒక చిక్కని పొదలోకి దూరి మాయమైపోయాయి. “అయ్య బాబోయ్… ఒక్క నిమిషం ఆగి వుంటే నాపని అయిపోయేదే. ఇంకెప్పుడూ అమ్మమాట వినకుండా అల్లరి చేయగూడదు” అనుకుంది.
ఎలుక రాజు – Telugu Stories
ఒక అడవిలో ఒక ఎలుకరాజు వుండేవాడు. ఆ అడవి పక్కనే కందనవోలు అనే దేశం వుండేది. ఒక రోజు ఎలుకరాజుకు కందనవోలు రాజు ఎలా వుంటాడో చూడాలనిపించింది. దాంతో ఆ ఎలుకరాజు నెమ్మదిగా రాజభవనం దాటి రాజు పడుకునే గదిలోకి చేరుకొంది. అప్పుడే అనుకోకుండా ఒక గండుపిల్లి ఎలుకరాజు మీదకు దూకింది. దాంతో అది అదిరిపడి మంచం ఎక్కి రాజు పక్కలోకి దూరింది. ఆ చప్పుడుకి రాజు లేచాడు. పిల్లి అక్కడినుంచి పారిపోయింది. రాజు మంచం మీదున్న ఎలుకను చూసి చంపడానికి కత్తి తీశాడు.
వెంటనే ఆ ఎలుకరాజు “రాజా …. నీవెలాగయితే ఈ దేశానికి రాజువో, అలాగే నేను మా దేశానికి రాజును. నన్ను వదిలిపెడితే నీవు ఆపదలో వున్నప్పుడు సాయం చేసి పెడతా” అంది. రాజు నవ్వుకొని ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అనుకుంటా దానిని వదిలి వేశాడు. ఒకరోజు కందనవోలు మీదకి పక్క దేశపు రాజు చాలామంది సైనికులతో దండెత్తి వచ్చాడు. వాళ్ళను ఎదిరించడం అంత సులభం కాదు.
ఏమి చేయాలో తెలియక రాజు బాధ పడసాగాడు. అంతలో ఈ విషయం ఎలుకరాజుకు తెలిసింది. వెంటనే అది తన సైనికులయిన ఎలుకలు అన్నింటినీ వెంట పెట్టుకోని చీకటి పడగానే పక్కదేశపు రాజు వున్న సైనిక గుడారాలకు చేరింది. ఆ ఎలుకలు చప్పుడు కాకుండా లోపలికి దూరి సైనికుల బట్టలు, చెప్పులు, విల్లులు, బాణాలు అన్నీ కొరికి కొరికి పాడేశాయి. పొద్దున లేచేసరికి ఇంకేముంది… సైనికుల దగ్గర ఒక్క ఆయుధమూ లేదు. అన్నీ ముక్కలు ముక్కలు అయిపోయాయి. దానికి తోడు వంటిమీద వేసుకోవడానికి బట్టలుగూడా లేవు. అన్నీ చిరిగిపోయాయి. దాంతో వాళ్ళు యుద్ధం చేయలేక భయపడి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. కందనవోలు రాజు ఎలుకరాజు సహాయానికి మెచ్చుకొని ఎలుకలన్నింటికీ పెద్ద విందు ఇచ్చాడు.
పారిపోయిన మొసలి – Short Stories in Telugu
ఒక అడవిలో ఒక ఏనుగుపిల్ల ఉండేది. ఒకసారి ఏనుగుపిల్ల అడవిలో పోతా వుంటే ఒక కొండచిలువ గోతిలో పడి కనిపించింది. ఆ గొయ్యి చానా లోతుగా, నున్నగా ఉంది. దాంతో అది బయటకి రాలేకపోతోంది. ఆ ఏనుగుపిల్లది చానా జాలిగుండె. కొండచిలువను పైకి లాగుదామని తొండం చాపింది.
కానీ అది అందలేదు. దాంతో ఒక చెట్టు కొమ్మను విరుచుకొని వచ్చింది.
“ఏయ్ కొండచిలువా… కొమ్మను గట్టిగా పట్టుకో. పైకి లాగుతా” అంది. కొండచిలువ అలాగేనంటూ దాన్ని గట్టిగా చుట్టుకుంది. ఏనుగుపిల్ల నెమ్మదిగా దాన్ని పైకి లాగేసింది. అప్పటినుంచి రెండూ బాగా కలసిమెలసి ఉండేవి. ఒకరోజు ఏనుగుపిల్ల కొండచిలువ తెంపి ఇచ్చిన తీయని మామిడిపళ్ళు తిని అక్కడున్న చెరువులో నీళ్లు తాగబోయింది. ఆ నీళ్లలో ఒక పెద్ద మొసలి వుంది.
అది చానా బలమైంది. లటుక్కున ఏనుగుపిల్ల కాలు పట్టుకుంది. నీళ్లలో ఉన్నప్పుడు మొసలికి చానా బలం ఉంటుంది కదా. దాంతో అది తప్పించుకోలేక బాధతో అరవసాగింది. ఆ అరుపులు కొండచిలువ వింది. వేగంగా వచ్చి నీళ్లలో మునిగిపోతావున్న ఏనుగుపిల్ల కాలును గట్టిగా చుట్టుకొని వెనక్కు లాగసాగింది.
ఏనుగుపిల్ల , కొండచిలువల బలం ముందు మొసలి బలం సరిపోలేదు. నెమ్మదిగా అవి రెండూ కలసి మొసలిని ఒడ్డుకు లాక్కొని రాసాగాయి.
“అమ్మో… నీళ్లలోంచి బయటపడిన వెంటనే నా బతుకు కుక్క కన్నా హీనంగా తయారవుతుంది. వాటి చేతిలో చావడం ఖాయం” అని మొసలి భయపడింది. వెంటనే ఏనుగుపిల్ల కాలు వదిలేసి వెనక్కి పారిపోయింది.
అమ్మ మాట – Mother Stories in Telugu
ఒక అడవిలో ఒక అల్లరి కోతిపిల్ల ఉండేది. అది ఎవరి మాటా వినేది కాదు. ఆ అడవిని ఆనుకుని ఒక పెద్ద చెరువు ఉంది. అందులో ఒక చిన్న తాబేలు పిల్ల ఉండేది. కోతిపిల్లకు దానితో చెలిమి కుదిరింది. కోతిపిల్లకు తాను గూడా తాబేలులాగా నీటిలో తిరగాలని చాలా కోరిక. కానీ దానికి ఈత రాదు. దాంతో ఒక చిన్నపడవ తయారు చేసింది. దానిలో ఎక్కి తాబేలుతో బాటు చెరువంతా తిరగసాగింది. అది చూసి కోతిపిల్ల తల్లి “పాపా… ఏదయినా ఆపద వచ్చినప్పుడు నిన్ను నీవు కాపాడుకోనన్నా కాపాడుకోగలగాలి లేదా కాపాడే వాడన్నా పక్కనుండాలి. అందుకే చెరువులో షికారు చేయొద్దు” అంది. కానీ కోతిపిల్ల అమ్మకి తెలియకుండా అలాగే తిరగసాగింది.
ఒకసారి కోతిపిల్ల చెరువులో తిరుగుతుంటే పెద్దగాలి వీయసాగింది. చెరువంతా అల్లకల్లోలమై అలలు ఎగిసిపడసాగాయి. పడవ అటూయిటూ ఊగిపోసాగింది.
దానిలోకి నీళ్ళు ఎగిరి పడసాగాయి. దాంతో పడవ కొంచం కొంచం మునిగిపోసాగింది. అది చూసి తాబేలు “రా… తొందరగా వచ్చి నా మీదకు ఎక్కు నిన్ను వేగంగా ఒడ్డుకు తీసుకుపోతాను” అంది. కోతిపిల్ల సరేనని తాబేలు మీదకు ఎక్కింది.
కానీ తాబేలేమో చిన్నది. కోతి పిల్లేమో పెద్దది. దాంతో దాని బరువును మోయలేక నీళ్ళలోకి మునిగిపోతూ ‘నా బలం సరిపోవడం లేదు. తొందరగా ఎవరినన్నా పిలువు’ అంది. కోతిపిల్ల భయంతో కాపాడమని గట్టిగా కేకలు వేయసాగింది. ఆ అరుపులు చెరువుకు కొంచం దూరంలోనే వున్న కోతిపిల్ల తల్లికి వినిపించాయి. పరుగెత్తుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. చెరువు పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది.
దాని కొమ్మలు చెరువుపైకి పెరిగి ఉన్నాయి. వెంటనే వేగంగా చెట్టు మీదకు ఎక్కి నీళ్ళపైన పెరిగిన కొమ్మ అంచుకు చేరి, “పాపా… రా… వచ్చి నా తోక గట్టిగా పట్టుకో” అని అరిచింది. తాబేలు పెద్దకోతిని చూసింది. బలమంతా ఉపయోగించి ఈదుతూ అక్కడికి చేరుకొంది. వెంటనే కోతిపిల్ల ఛటుక్కున ఎగిరి అమ్మతోక పట్టుకొంది. నెమ్మదిగా ఎక్కుతూ చెట్టుపైకి చేరుకుంది. దాంతో ఆ కోతిపిల్లకు పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఎంతో ఆలోచించి చెబుతారని తెలిసివచ్చింది. ఆరోజు నుంచీ అమ్మమాట ఎప్పుడూ జవదాటలేదు.
ఆశపోతు తోడేలు – Moral Stories in Telugu
ఒక అడవిలో ఒక తోడేలు వుండేది. ఆ తోడేలు చాలా ఆశపోతుది. ఒక రోజు ఆ తోడేలు ఆహారం కోసమని అడవిలో వెదుకుతా బయలు దేరింది.
అలా పోతావుంటే ఆ తోడేలుకు కొంచం దూరంలో ఒకచోట ఒక కుందేలు కనబడింది. తోడేలు సంతోషంగా ఆ కుందేలును నోట కరచుకొని పోతావుంటే దానికి దారిలో ఇంకొకచోట ఇంకో కుందేలు కనిపించింది.
తోడేలు సంబరంగా ఆ కుందేలును గూడా నోటితో కరచుకొని పోసాగింది. కొంచం దూరం పోయాక ఆ తోడేలుకు ఒక చెరువు కనబడింది. చెరువు అవతల ఒక జింక చనిపోయి కనబడింది. “ఆహా… ఈ రోజు చాలా మంచిరోజు. పోయి ఆ జింకను గూడా తీసుకొని పోతా” అని ఆ ఆశపోతు తోడేలు నోటిలో కుందేలుతో నీళ్ళలోనికి దూకింది. అలా నీళ్ళలో ఈదుకుంటూ పోతావుంటే అలలు బాగా ఎక్కువగా వచ్చి నోటిలో వున్న కుందేలు ఒకదాని తరువాత ఒకటి జారిపోయాయి.
“పోతే పోనీలే… అవతల వైపున జింక వుంది గదా!” అనుకొంటూ అవతలి వైపుకు చేరుకొంది. ఆ జింకను నోట కరచుకొని తిరిగి చెరువులో ఇవతలి వైపుకు ఈదుకుంటా రాసాగింది. ఆ చెరువులో ఒక మొసలి వుంది. ఆ మొసలి తోడేలును , దాని నోటిలోని జింకను చూసింది. ఆహా ఈ రోజు విందు భోజనం దొరికింది అనుకుంటూ వేగంగా తోడేలు మీదకు దూకింది. ఆ మొసలిని చూసి తోడేలు ఆదిరిపడింది. దానికి దొరికితే చావడం ఖాయం ఆనుకొని భయపడి జింకను వదిలి పారిపోయింది. దొరికినది తినకుండా ఆశకు పోయినందుకు చేతికి దొరికినవి కూడా పోయాయే అని బాధ పడింది.
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. contact@telugubucket.com
Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు